వేలమందికి ఉపాధి కల్పించామన్న సంతృప్తి చాలు : గల్లా జయదేవ్‌

ABN , First Publish Date - 2021-12-21T12:31:24+05:30 IST

అమరరాజా సంస్థను స్థాపించి, వేలమందికి ఉపాధి కల్పించామన్న సంతృప్తి ...

వేలమందికి ఉపాధి కల్పించామన్న సంతృప్తి చాలు :  గల్లా జయదేవ్‌

చిత్తూరు జిల్లా/రేణిగుంట : జిల్లాలో అమరరాజా సంస్థను స్థాపించి, వేలమందికి ఉపాధి కల్పించామన్న సంతృప్తి తమకు చాలని వ్యవస్థాపక అధినేత గల్లా రామచంద్రనాయుడు, ప్రస్తుత చైర్మన్‌ జయదేవ్‌ గల్లా అన్నారు. సోమవారం కరకంబాడి సమీపంలోని అమరరాజా సంస్థ ప్రాంగణంలో 36వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ సంస్థలో ఐబ్రీడ్‌ పద్ధతిలో నిర్వహించిన ఈ వేడుకల్లో లాంగ్‌ సర్వీస్‌, ఉత్తమ పనితీరుతోపాటు ఇతర రంగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన ఉద్యోగులకు అవార్డులతోపాటు 300 మందిని సత్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ అంశాలపై నిర్వహించిన సందేశాత్మక సాంస్కృతిక కార్యక్రమాలు తమను ఆకట్టుకున్నాయని చెప్పారు. సంస్థ స్థాపించినప్పటి నుంచి తమతోపాటు ఉన్న దీర్ఘకాలిక ఉద్యోగులు 97 మందికి అవార్డులు అందించామన్నారు.


పరివర్తన మనల్ని ముందుకు నడిపే మంత్రమని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాదిలోనూ ఫోర్బ్స్‌ 500 ఉత్తమ సంస్థల జాబితాల్లో అమరరాజాకు వరుసగా రెండోసారి స్థానం లభించడం సంతోషంగా ఉందన్నారు. లిథియం, అయాన్‌ సెల్స్‌ అభివృద్ధి చేయడానికి దేశంలోనే తొలి టెక్నాలజీ హబ్‌ను తిరుపతిలో ప్రారంభించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఎనర్జీ స్టోరేజ్‌ రంగంలో అధునాతన టెక్నాలజీలను అన్వేషించే ప్రయత్నంలో ఇది చాలా ముఖ్యమైన దశ అని వారు వెల్లడించారు. మనదేశ ఉద్యోగులను చూసి గర్విస్తున్నామని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మహమ్మారి సమయంలో ఆరోగ్య సంరక్షణతోపాటు గ్రామీణ విద్య, పర్యావరణంపై దృష్టి సారించి, అందరి భాగస్వామ్యంతో ముందుకెళ్లడం ప్రశంసనీయమన్నారు. ఉద్యోగుల సమష్టి కృషితో భవిష్యత్తులోనూ విజయాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు హర్షవర్ధన్‌ గౌరినేని, విక్రమాదిత్య గౌరినేని, అశోక్‌ గల్లా, సిద్ధార్థ గల్లాలతో పాటు సీనియర్‌ ఇంజనీర్లు, మేనేజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-21T12:31:24+05:30 IST