గలిజేరు తింటే...

ABN , First Publish Date - 2022-01-22T05:30:00+05:30 IST

లిజేరు ఆకుల్ని వండుకుని తింటే వ్యాధుల్ని గెలవొచ్చు! కోల్పోయిన శరీర ధాతువుల్ని పునర్నిర్మించే శక్తి దీనికుంది కాబట్టి దీన్ని పునర్నవ అన్నారు. శరీరానికి నూతనత్వాన్నిస్తుంది. ..

గలిజేరు తింటే...

గలిజేరు ఆకుల్ని వండుకుని తింటే వ్యాధుల్ని గెలవొచ్చు! కోల్పోయిన శరీర ధాతువుల్ని పునర్నిర్మించే శక్తి దీనికుంది కాబట్టి దీన్ని పునర్నవ అన్నారు. శరీరానికి నూతనత్వాన్నిస్తుంది. కామెర్లవ్యాధిలో ఇది స్పర్శామాత్రంగానే పనిచేస్తుందని నమ్మిక. గళం అంటే మెడ. చేరు అంటే హారం. గలిజేరు తీగను మెడలో హారంగా వేస్తారు కాబట్టి  దీన్ని గలిజేరు అని పిలిచారు. కామెర్లవ్యాధికి పసరు మందులు, తాళ్లు వేయటం లాంటి చికిత్సా విధానాలకు గలిజేరునే ఉపయోగిస్తారు. దీని ఆకులు, కాండం, వేళ్లూ వగరుగా, చిరుచేదుగా ఉంటాయి. దీని ఆకుల్ని తోటకూర లేదా పాలకూర లాగా కూర, పప్పు, పచ్చడి, పులుసుకూరలుగా వండుకోవచ్చు. గోంగూర, చుక్కకూర, చింతచిగురు లాంటి పులుపు కూరలతో కలిపి వండుకుంటే రుచిగా ఉంటుంది. 


ప్రయోజనాలివి!

అన్ని వాతవ్యాధుల్లోనూ వాపులు, నొప్పుల్ని తగ్గించే గుణం గలిజేరాకులకు ఉంది. ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే వారికి ఈ ఆకులు మేలు చేస్తాయి. దగ్గు, జలుబు, ఉబ్బసాలను తగ్గిస్తాయి. కాలేయం, ప్లీహం, క్లోమగ్రంథుల్లో వచ్చే వ్యాధుల్ని  తగ్గించేందుకు ఔషధంగా గలిజేరును వాడతారు. విరేచనం అయ్యేలా చేస్తుంది. మలబద్ధకం, మొలల వ్యాధులతో బాధపడేవారికి ఉపశమనం ఇస్తుంది. రక్తహీనతను పోగొడ్తుంది. క్షీణింప చేసే క్షయ, ఎయిడ్స్‌ లాంటి వ్యాధుల్లో ఇది ఔషధమే! గుండె జబ్బుల్లో మంచి ఫలితాల నిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. కరోనావచ్చి తగ్గినవారికి దీన్ని కూరగానో పప్పుగానో వారంలో మూడు నాలుగు సార్లయినా వండిపెడితే త్వరగా కోలుకుంటారు. జీర్ణకోశ వ్యాధులన్నింటి మీదా ఇది పనిచేస్తుంది. తీసుకున్న ఆహారం తేలికగా అరిగేలా చేస్తుంది. మినప్పప్పుతో దీని ఆకుల్ని రుబ్బి, సుగంధద్రవ్యాలు కూడా చేర్చి, వడియాలు పెట్టుకునే అలవాటు మన పూర్వీకుల కుండేది. కడుపులో గడ్దలు, పేగుల్లో వచ్చే జబ్బులు, ముఖ్యంగా పెద్దపేగులో వచ్చే కేన్సర్‌, టీబీ లాంటి జబ్బులున్నవారికి ఇది మేలు చేస్తుంది. 


ఇలా వండుకోవాలి...

గలిజేరాకులతో పొడికూర వండుకునే పద్ధతిని పాకదర్పణం గ్రంథంలో వివరించాడు నలుడు. లేత గలిజేరు ఆకుల్ని తీసుకుని శుభ్రపరచి సన్నగా తరగాలి. కాకరాకుల్ని శోంఠిపొడిని ఈ ఆకులతో చేర్చి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. ఇలా చేస్తే గలిజేరాకుల్లో ఉండే చేదు పోతుంది. కాకరాకుల్ని తీసేసి, నీటిని వార్చేసి, ఉడికిన గలిజేరాకుల్ని ఒక భాండీలోకి తీసుకోవాలి. ఈ ఆకుల్లో తగినంత ఉప్పు, మీకిష్టమైన సుగంధ ద్రవ్యాలు చేర్చి, నెయ్యి వేసి దోరగా వేయించాలి. వేడి తగ్గాక కొద్దిగా పచ్చకర్పూరం వేస్తే ఈ కూర కమ్మగా ఉంటుంది. దీన్ని ఒక మంచి వస్త్రంలో మూటగట్టి కాగుతున్న నేతిలో ముంచి తీసి వేడిగా వడ్డించుకోవాలన్నాడు నలుడు. 


చేదు తీసిన తరువాత పప్పుగానూ, పచ్చడిగా కూడా వండుకోవచ్చు. తరచూ దీన్ని తినే అలవాటు చేసుకోవటం మంచిది. ఆకుకూరలంటే కేవలం తోటకూర, పాలకూర, మెంతికూర, గోంగూర లాంటివే కాదు, అంతకన్నా విస్తృతంగా పండే ఎన్నోరెట్లు ఔషధ విలువలున్న, రుచికరమైన ఆకుకూరలు ఇంకా చాలా ఉన్నాయి. గలిజేరు, గుంటగలగర, ఉత్తరేణి, కొండపిండి, చెంచలి, గంగపావిలి, గజపల్లేరు ఇలాంటి మొక్కలు మన చుట్టూ పెరిగేవే!


గంగారాజు అరుణదేవి 

Updated Date - 2022-01-22T05:30:00+05:30 IST