సీఎం ఇలాకాలో.. ఫోకస్‌

ABN , First Publish Date - 2021-11-09T17:27:56+05:30 IST

గజ్వేల్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీని మరింత పటిష్ఠంగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ ఫోకస్‌ పెట్టారు. 2023 ఎన్నికలే లక్ష్యంగా నియోజకవర్గంలో పార్టీని బలోపేతం ...

సీఎం ఇలాకాలో.. ఫోకస్‌

బూత్‌ కమిటీలతో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళిక

గజ్వేల్‌ నియోజకవర్గంలో బూత్‌కు 25 మంది కార్యకర్తల గుర్తింపు 


గజ్వేల్: గజ్వేల్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీని మరింత పటిష్ఠంగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ ఫోకస్‌ పెట్టారు. 2023 ఎన్నికలే లక్ష్యంగా నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు బూత్‌కు 25 మంది కార్యకర్తలను ఎంపిక చేసి ఇటు పార్టీ, అటు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సారథ్యంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల పరిధిలోని 306 పోలింగ్‌బూత్‌లలో బూత్‌కు 25 మంది చొప్పున ఎంపిక చేసి బూత్‌ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల, మండలాలకు టీఆర్‌ఎస్‌ కమిటీలను ఏర్పాటు చేయగా వర్గల్‌, గజ్వేల్‌టౌన్‌, కొండపాక మండలాలకు చెందిన పార్టీ కమిటీలను పెండింగ్‌లో ఉంచారు. 


హుజూరాబాద్‌ ఉపఎన్నిక ముగిసిన నేపథ్యంలో మండల కమిటీలను పూర్తిగా ప్రకటించే అవకాశం ఉంది. 

పార్టీ కోసం పనిచేసే నిబద్ధతగల కార్యకర్తలను గుర్తించే పనిలో టీఆర్‌ఎస్‌ ఆయా మండలాల బాధ్యులు, సమన్వయ కమిటీ సభ్యులు నిమగ్నమయ్యారు. గ్రామాల్లో పార్టీ కోసం కొన్నాళ్లుగా కృషిచేస్తూ, పార్టీ పటిష్ఠత కోరుకునే వారికి, పార్టీ పదవులు దక్కని వారికి బూత్‌ కమిటీల్లో స్థానం కల్పించి వారికి న్యాయం చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ఈ బూత్‌ కమిటీలు కృషిచేసేలా ప్రణాళికను రూపొందిచారు. ఉద్యమంలో పనిచేసిన నాయకులతో పాటు ఇటీవల పార్టీలో చేరి, పార్టీ ఉన్నతిని కోరుకునే వారికి బూత్‌ కమిటీలో స్థానం కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. బూత్‌ కమిటీలతో గజ్వేల్‌ నియోజకవర్గంలో పార్టీకి ఎదురులేకుండా చేసేందుకు సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు దృష్టిసారించినట్లు తెలిసింది.

Updated Date - 2021-11-09T17:27:56+05:30 IST