అభివృద్ధికి గజ్వేల్‌ చిరునామా: ఏఎంసీ చైర్మన్‌

ABN , First Publish Date - 2022-07-05T04:59:23+05:30 IST

సీఎంగా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో గజ్వేల్‌ ప్రాంతం అభివృద్ధికి కేరాఫ్‌ అడ్ర్‌సగా నిలిచిందని గజ్వేల్‌ ఏఎంసీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌ అన్నారు.

అభివృద్ధికి గజ్వేల్‌ చిరునామా: ఏఎంసీ చైర్మన్‌
మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఏఎంసీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌

జగదేవ్‌పూర్‌, జూలై 4: సీఎంగా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో గజ్వేల్‌ ప్రాంతం అభివృద్ధికి కేరాఫ్‌ అడ్ర్‌సగా నిలిచిందని గజ్వేల్‌ ఏఎంసీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ బాలేశంగౌడ్‌ అధ్యక్షతన మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయాశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ముందుగా వ్యవసాయశాఖ అధికారి మల్లయ్య తన నివేదికను చదివి వినిపించారు. సాధారణ పంటలతో పాటు వాణిజ్య, ఆయిల్‌పామ్‌ పంటలను సాగు చేయాలన్నారు. జిల్లాలో ఆయిల్‌పామ్‌ నర్సరీలు 7 ఉండగా.. ఈ నర్సరీల నుంచి 2 వేల ఎకరాలకు మొక్కలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఎంపీటీసీ కవిత మాట్లాడుతూ రైతులకు మూడు ఫీట్లు పెరిగిన మొక్కను పంపిణీ చేయాల్సి ఉండగా.. ఒక ఫీటు పెరిగిన మొక్కలను పంపిణీ చేస్తున్నట్టు సభ దృష్టికి తీసుకొచ్చారు. పీర్లపల్లి ఎంపీటీసీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ నెలలు గడిచినా ధరణిలో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని అన్నారు. అనంతరం ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ పై సమస్యలను మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇంద్రసేనారెడ్డి, గజ్వేల్‌ ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ ఉపేందర్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివా్‌సవర్మ, తహసీల్దార్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

వచ్చే సీజన్‌కు పత్తి మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం

గజ్వేల్‌, జూలై 4: వచ్చే సీజన్‌కు పత్తి మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని గజ్వేల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌ అన్నారు. గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలో రూ.2 కోట్ల 80 లక్షలతో నిర్మిస్తున్న కాటన్‌ మార్కెట్‌ పనులను ఆయన మార్కెట్‌ కార్యదర్శి జాన్‌వెస్లీతో కలిసి పరిశీలించి మాట్లాడారు. ఇప్పటివరకు రూ.కోటి 40 లక్షల పనులు పూర్తయ్యాయని, ప్రహరీ, కార్యాలయం, సీసీరోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.

Updated Date - 2022-07-05T04:59:23+05:30 IST