డాక్యుమెంట్‌కు లంచం!

ABN , First Publish Date - 2020-10-23T10:18:23+05:30 IST

రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తరువాత డాక్యుమెంట్‌ ఇచ్చేందుకు సిబ్బంది లంచం డిమాండ్‌ చేస్తున్నారన్న ..

డాక్యుమెంట్‌కు లంచం!

గాజువాక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు 

రిజిస్టర్డ్‌ దస్తావేజు ఇచ్చేందుకు

సిబ్బంది లంచం అడుగుతున్నారని అందిన ఫిర్యాదు

రిజిస్ర్టేషన్‌ పూర్తయినా కార్యాలయంలోనే డాక్యుమెంట్లు

పరిశీలించిన అధికారులు

సెలవులో సబ్‌ రిజిస్ట్రార్‌, సూపరింటెండెంట్‌


అక్కిరెడ్డిపాలెం, అక్టోబరు 22:రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తరువాత డాక్యుమెంట్‌ ఇచ్చేందుకు సిబ్బంది లంచం డిమాండ్‌ చేస్తున్నారన్న ఫిర్యాదు మేరకు జిల్లా రిజిస్ట్రార్‌ మన్మథరావు పర్యవేక్షణలో ఏసీబీ డీఎస్పీ రంగరాజు ఆధ్వర్యంలో గురువారం గాజువాక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సోదాలు జరిగాయి. ఏసీబీ డీఎస్పీ అందించిన వివరాల ప్రకారం...ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎనీవేర్‌ రిజిస్ర్టేషన్‌లో భాగంగా పెందుర్తికి చెందిన ఓ వ్యక్తి తన స్థలాన్ని గత నెల 15న గాజువాక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో డాక్యుమెంట్‌ రైటర్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయించాడు.


అనంతరం తన డాక్యుమెంట్‌ అందజేయాలని ఏజెంట్‌ను కోరితే రూ.5 లక్షలు ఇస్తేనే డాక్యుమెంట్‌ ఇస్తామని కార్యాలయ సిబ్బంది చెప్పారనడంతో అయోమయంలో పడ్డాడు. రిజిస్ట్రేషన్‌ జరిగి పది రోజులైనా డాక్యుమెంట్‌ రాకపోవడంతో గత నెల 26న ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన ఏసీబీ డీఎస్పీ రంగరాజు ఆధ్వర్యంలో అధికారులు గురువారం సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుడి డాక్యుమెంట్‌తో పాటు మరికొన్ని డాక్యుమెంట్లను గుర్తించారు. నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్‌ పూర్తిచేసిన తరువాత రోజు డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇంకా కార్యాలయంలోనే వుంచుకోవడంపై సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. ఈ సోదాల్లో ఏసీబీ సీఐలు లక్ష్మణమూర్తి, కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని డీఎస్పీ తెలిపారు. 


సెలవులో సబ్‌ రిజిస్ట్రార్‌, ఇతర అధికారులు 

ఈ దాడుల సమయంలో సబ్‌ రిజిస్ట్రార్‌ చక్రపాణితో పాటు ఇతర అధికారులు ఎవరూ కార్యాలయంలో లేరు. సబ్‌ రిజిస్ట్రార్‌, సూపరింటెండెంట్‌ సెలవు పెట్టారని  సిబ్బంది తెలిపారు.


మూడోసారి దాడులు 

గాజువాక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని షీలానగర్‌లో ఏర్పాటుచేసిన తరువాత ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం ఇది మూడోసారి. అవినీతి ఆరోపణల నేపథ్యంలో 2017 జూన్‌ 19న అప్పటి సబ్‌రిజిస్ట్రార్‌ వెంకయ్యనాయుడు నివాసం, కార్యాలయంలో సోదాలు జరిగాయి. రిజిస్ట్రేషన్‌ చేసేందుకు 0.5 శాతం ఫీజును డాక్యుమెంట్‌ రైటర్లు అదనంగా వసూలుచేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో 2019 సెప్టెంబరు 9న ఏసీబీ దాడి చేసి డాక్యుమెంట్‌ రైటర్లకు చెందిన ఏజెంట్ల నుంచి రూ.2.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 


పూర్తిస్థాయిలో విచారణ ..మన్మథరావు, జిల్లా రిజిస్ట్రార్‌

ప్రస్తుతం ఆస్తులు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న గంట వ్యవధిలోనే డాక్యుమెంట్‌ అందజేసే అవకాశం ఉంది. అయినప్పటికీ గాజువాక కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా అనేక డాక్యుమెంట్లు ఉన్నాయి. వీటన్నింటిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం. బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2020-10-23T10:18:23+05:30 IST