తం నమామి గజాననం

ABN , First Publish Date - 2020-08-22T09:12:23+05:30 IST

ఇందు గజానన పదం వినబడుతోంది. కనుక శ్లోకార్థం తెలియకపోయినా, వినాయకుణ్ని స్తుతిస్తున్నామని అర్థమవుతుంది.

తం నమామి గజాననం

వాగీశాద్యాః సుమనసః సర్వార్థానాం ఉపక్రమే

యం సత్వా కృతకృత్యాస్యుః తం నమామి గజాననం


ఇందు గజానన పదం వినబడుతోంది. కనుక శ్లోకార్థం తెలియకపోయినా, వినాయకుణ్ని స్తుతిస్తున్నామని అర్థమవుతుంది. ఈ శ్లోకం ఏమని చెప్పింది? దేవతలు, తుదకు బ్రహ్మ కూడా ఏదైనా పనిని ఆరంభించి పూర్తి కావాలని అనుకొనేవారు ఆ గజాననుణ్ని కొలుస్తారని. బలహీనులైన మానవులే కాదు, బలవంతులైన దేవతలూ కొలుస్తారట. వారు నిర్దిష్టమైన తిథుల్లోనే కాదు, ఏదైనా పని ఆరంభించినపుడు, నిరంతరమూ కొలుస్తారట. అలా కొలిస్తే చేసిన పనులు ఫలిస్తాయని శ్లోకం చెబుతోంది. వినాయకుడు వారి నమస్కారాన్ని స్వీకరించడం మాత్రమే కాదు.. వారెందుకు నమస్కరించారో దాన్ని నెరవేరుస్తాడు. అనగా వారి లక్ష్యాన్ని నెరవేరుస్తాడు. ఇందులో ‘వాగీశాద్యా సుమనసః’.. అంటే దేవతలను సుమనస్కులుగా అంటే మంచి మనసుగలవారిగా అభివర్ణించారు. మంచిమనస్సు గలవారు పూజించే దేవుడూ మంచి మనసే కలిగి ఉండాలి కదా! ఎవరి దగ్గర కోపం రాదో, ఎవరిని చూస్తే కోపం పటాపంచలవుతుందో, శాంతమనస్కులవుతారో అట్టి వానికి ప్రేమ హృదయం ఉంటుందనే కదా. అటువంటి మంచి మనసు కలిగినవాడు గణపతి.


వినాయకుని షోడశ నామాల్లో మొదటి పేరు ‘సుముఖ’. అనగా మంచి ముఖం. మంచిమనస్సును ప్రకటింపజేసేది సుముఖం. ముఖానికి నోరు అనే అర్థం కూడా ఉంది. సంస్కృతంలో నోటికి విడిగా పేరు లేదు. మాట్లాడడానికి ప్రధానమైన ముఖానికి అన్ని పేర్లు. ఉచ్చరించే దానికే పేరు లేదు చూశారా? సుముఖమనగా మంచి నోరు. మంచి మాటలు మాట్లాడేది. ఏనుగు నోటికి ఒక ప్రత్యేకత ఉంది. నరులకు, జంతువులకు పెదవులను కదిపితే నోరు కనిపిస్తుంది. ఏనుగు నోటిని తుండం కప్పుతుంది. మన నోటిని చేతితో కప్పి మాట్లాడడం వినయాన్ని సూచిస్తుంది. కానీ, ఏనుగు సహజమైన తుండంతోనే నోటిని మూస్తుంది. అది నోట్లో ఆహారం వేసినప్పుడు, ఇంకా ఏదైనా కారణం వల్లగానీ తుండం ఎత్తినప్పుడు దాని నోటిని చూడగలం. అందులో చాలా తత్వం ఇమిడి ఉంది. తుండంతో కప్పబడిన నోరు ఏమని సూచిస్తోంది? పాండిత్యం ఎంత ఉన్నా వాగుడుతనం లేకుండా ఉండాలని తప్పనిసరియైునప్పుడు మాత్రమే ప్రదర్శించాలని అదే సరియైున విద్వాంసుని లక్షణమని సూచించట్లేదా? అనగా పాండిత్యానికి మౌనమే చివరి మెట్టు అని ఏనుగు చెబుతోంది.


చవితినాడు చంద్రుని చూసిన నీలాపనిందలు తొలగాలంటే శమంతకోపాఖ్యానం కథ చదవడం ఒక మార్గం. అయితే, మొత్తం శమంతకోపాఖ్యానాన్ని చదవలేనివారు ఒక శ్లోకాన్ని చదివితే చాలు.


సింహఃప్రసేనం అవధీత్‌ సింహో జాంబవతా హతః

సుకుమారక మారోదీః తవహ్యేష శ్యమంతకః


ఈ ఒక్క శ్లోకం చదివితే మొత్తం కథ అంతా మదిలో మెదలుతుంది. వినాయక వత్రం ఎలా చేయాలో వివరించి చూడామణి కల్పం తెలిపిన సూక్ష్మోపాయం ఇది. 


-జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శంకరాచార్య స్వామి

Updated Date - 2020-08-22T09:12:23+05:30 IST