సెంచరీ మిస్ చేసుకున్న గైక్వాడ్.. కొండంత స్కోరు సాధించిన చెన్నై

ABN , First Publish Date - 2022-05-02T02:58:30+05:30 IST

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు చెలరేగిపోయారు.

సెంచరీ మిస్ చేసుకున్న గైక్వాడ్.. కొండంత స్కోరు సాధించిన చెన్నై

పూణె: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు చెలరేగిపోయారు. బ్యాటర్లను బెంబేలెత్తించే ఉమ్రాన్ మాలిక్‌ను సైతం లెక్కచేయని రుతురాజ్ గైక్వాడ్-డెవోన్ కాన్వేలు క్రీజులో రెచ్చిపోయారు. ఫెవిక్విక్ రాసుకుని వచ్చినట్టు క్రీజు నుంచి కదిలేందుకు మొరాయించారు. ఈ జోడీని విడదీసేందుకు హైదరాబాద్ కెప్టెన్ మార్చిమార్చి బౌలర్లను ప్రయోగించినా ఫలితం లేకుండా పోయింది.


ఇద్దరూ కలిసి బంతులను నిర్దాక్షిణ్యంగా బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఓవైపు గైక్వాడ్, మరోవైపు కాన్వే బ్యాట్‌తో విరుచుకుపడుతుండడంతో బౌలర్లు ప్రేక్షకులే అయ్యారు. ఈ సీజన్‌లో పెద్ద స్కోర్లు చేయడంలో విఫలమవుతూ వస్తున్న గైక్వాడ్ ఈసారి ఇరగదీశాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో రుతురాజ్‌కు ఇది 9వ అర్ధ సెంచరీ.


ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తూ సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. అయితే, దురదృష్టం వెంటాడింది. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో నటరాజన్ బౌలింగులో భువనేశ్వర్ కుమార్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో 182 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం.  మొత్తంగా 57 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్ 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 99 పరుగులు చేశాడు. 


రుతురాజ్ అవుటైన తర్వాత బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకొచ్చిన ధోనీ తీవ్రంగా నిరాశ పరిచాడు. 7 బంతులు ఆడి ఒక్క ఫోర్‌తో 8 పరుగులు చేసిన ధోనీ కూడా నటరాజన్‌కే చిక్కి పెవిలియన్ చేరాడు. మరోవైపు, 55 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 85 పరుగులు చేసిన కాన్వే నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసి హైదరాబాద్‌కు కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. కాగా, ప్రత్యర్థి బ్యాటర్లను తన పదునైన బంతులతో ముప్పుతిప్పలు పెట్టి హైదరాబాద్ విజయాల్లో కీలకంగా మారిన ఉమ్రాన్ మాలిక్‌కు ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా దక్కలేదు.

Updated Date - 2022-05-02T02:58:30+05:30 IST