విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో భారీ గడ్డివామి దగ్ధం

ABN , First Publish Date - 2021-06-14T04:46:50+05:30 IST

విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో భారీ గడ్డివామి దగ్ధమైన సంఘటన బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ పరిధిలోని కనిసిరిపాళెం వద్ద జాతీయ రహదారి పక్కన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో భారీ గడ్డివామి దగ్ధం
మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

రూ. లక్షకు పైగా ఆస్తినష్టం


బుచ్చిరెడ్డిపాళెం, జూన్‌ 13: విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో భారీ గడ్డివామి దగ్ధమైన సంఘటన బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ పరిధిలోని కనిసిరిపాళెం వద్ద జాతీయ రహదారి పక్కన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కనిసిరిపాళేనికి చెందిన పాడి రైతులు కనిసిరి పద్మమ్మ, శీనయ్యలు వారి గేదెలకు పశుగ్రాసం నిమిత్తం 25 ఎకరాల్లోని ఎండుగడ్డిని కొనుగోలు చేసి జాతీయ రహదారి పక్కన గడ్డివామిని ఏర్పాటు చేసుకున్నారు.  ఆదివారం మధ్యాహ్నం ఓ కాకి విద్యుత్‌ తీగలకు తగలడంతో నిప్పురవ్వలు రేగి గడ్డివామిపై పడడంతో ఒక్కసారిగా మంటలు రేగాయి. వెంటనే గడ్డివామి నుంచి మంటలు రేగి దట్టమైన పొగతో కనిసిరిపాళెంను కమ్మేసింది. దీంతో  స్థానిక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక అధికారులు, సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ క్రమంలో  చుట్టుపక్కల ఉన్న నివాసాలపైన గడ్డివామి నుంచి నిప్పురవ్వలు ఎగసిపడినా ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. లక్ష రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగిందనీ. ప్రస్తుతం తమ గేదెలకు పశుగ్రాసం కోసం తీవ్ర ఇబ్బందులు తప్పవని బాధితులు వాపోయారు. 

Updated Date - 2021-06-14T04:46:50+05:30 IST