గడ్డి అన్నారం మార్కెట్‌లో దొంగల హల్‌చల్!

ABN , First Publish Date - 2020-09-20T12:48:40+05:30 IST

గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు దొంగల బెడద పట్టుకుంది. అర్ధరాత్రి సమయంలో మార్కెట్‌లో దొంగలు హల్‌చల్‌ చేస్తూ సరుకును దోపిడీ చేస్తున్నారు. ఓ వైపు

గడ్డి అన్నారం మార్కెట్‌లో దొంగల హల్‌చల్!

దిల్‌సుఖ్‌నగర్‌ (ఆంధ్రజ్యోతి) : గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు దొంగల బెడద పట్టుకుంది. అర్ధరాత్రి సమయంలో మార్కెట్‌లో దొంగలు హల్‌చల్‌ చేస్తూ సరుకును దోపిడీ చేస్తున్నారు. ఓ వైపు రేయింబవళ్లు వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే జాతీయ రహదారి పక్కన, మరోవైపు పోలీస్‌ స్టేషన్‌కు ఆనుకుని ఉన్న పండ్ల మార్కెట్‌లోనే రక్షణ కరువైంది. 15 రోజులుగా ప్రతిరోజూ అర్ధరాత్రి మార్కెట్‌ లోపలికి వచ్చి లారీలలోని పండ్లను అపహరించుకుపోతూ పోలీసులకు దొంగలు సవాల్‌ విసురుతున్నారు.


చోరీ తీరిది...

గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లో ప్రస్తుతం మోసంబి, యాపిల్‌ సీజన్‌ కొనసాగుతోంది. 50 రోజుల తాత్కాలిక బంద్‌ అనంతరం సెప్టెంబర్‌ 1వ తేదీన మార్కెట్‌ గేట్లు తెరుచుకున్నాయి. అయితే మార్కెట్‌ బంద్‌ ఉన్న సమయంలో కొంతమంది జులాయిలు మార్కెట్‌ యార్డులోని ప్లాట్‌ఫామ్‌లు, దుకాణాలను అడ్డాలుగా మార్చుకున్నారు. రాత్రి సమయంలో అక్కడ చేరి మద్యం తాగడానికి అలవాటుపడ్డారు. ఈ సమయంలోనే మార్కెట్‌లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో పరిశీలించారు. జులాయిలు పండ్ల చోరీలకు పథకం రూపొందించుకున్నారు. 15 నుంచి 20 మంది దుండగులు ఓ ముఠాగా ఏర్పడ్డారు. అర్ధరాత్రి 1 గంట నుంచి 3 గంటల సమయంలో వారంతా గ్రూపులుగా విడిపోయి మార్కెట్‌లోకి ప్రవేశిస్తారు. అప్పటికే అన్‌లోడింగ్‌ కోసం కమీషన్‌ ఏజెంట్‌ దుకాణాల ముందు ఉన్న లారీల పైకప్పులను కత్తులతో కోసి యాపిల్‌ బాక్సులను అపహరించుకుపోతున్నారు.


అడ్డగిస్తే కత్తులతో దాడి...

దొంగతనం చేసే సమయంలో దుకాణాల వద్ద ఉన్న హమాలీలు అడ్డగిస్తే దుండగులు ఏకమై కత్తులతో దాడులకు దిగుతున్నారు. ప్రతిరోజూ రూ. 2 లక్షల విలువ చేసే యాపిల్‌ బాక్సులతో పాటు, మోసంబీలను కూడా ఎత్తుకుపోతున్నారని హమాలీలు, వ్యాపారులు వాపోతున్నారు.


దొంగతనాలను అరికట్టాలి : ఖుర్రం, కమీషన్‌ ఏజెంట్

పదిహేను రోజులుగా యాపిల్‌ బాక్సులను ఎత్తుకెళ్తున్నారు. ఇప్పటికే పోలీసులకు, మార్కెటింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేశాం. వెంటనే చర్యలు చేపట్టి దొంగతనాలను అరికట్టాలి.


చాకచక్యంగా చోరీలు : ప్రవీణ్‌రెడ్డి, ఉన్నతశ్రేణి కార్యదర్శి, గడ్డిఅన్నారం

సీసీ కెమెరాలకు చిక్కకుండా చాకచక్యంగా చోరీలు చేస్తున్నారు. కెమెరాల డైరెక్షన్‌లు మారుస్తున్నారు. నైపుణ్యం కలిగిన సెక్యూరిటీని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. దొంగతనాల నివారణ కోసం కమిటీని నియమించనున్నాం.


మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు: రవికుమార్‌, ఇన్‌స్పెక్టర్‌, చైతన్యపురి

మార్కెట్‌లో చోరీలకు సంబంధించి మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఫిర్యాదు వస్తే వెంటనే చర్యలు చేపడతాం.

Updated Date - 2020-09-20T12:48:40+05:30 IST