ఆశ్చర్యమాశ్చర్యమాయె !.. BJP సభలో గద్దర్..

ABN , First Publish Date - 2022-07-04T18:54:11+05:30 IST

తెలుగువారికి పరిచయమే అక్కర్లేని పేరు గద్దర్(Gaddar).. తనదైన ప్రత్యేక ఆహర్యం, బడుగుల గొంతుగా ఎన్నో పాటలు పాడి ‘ప్రజా గాయకుడి’గా చెరుగని ముద్రవేసుకున్నారు. మావోయిస్టు ఉద్యమంలో ఏళ్ల

ఆశ్చర్యమాశ్చర్యమాయె !.. BJP సభలో గద్దర్..

హైదరాబాద్: తెలుగువారికి పరిచయమే అక్కర్లేని పేరు గద్దర్(Gaddar).. తనదైన ప్రత్యేక ఆహార్యం, బడుగుల గొంతుగా ఎన్నో పాటలు పాడి ‘ప్రజా గాయకుడి’గా చెరగని ముద్రవేసుకున్నారు. మావోయిస్టు ఉద్యమంలో ఏళ్ల తరబడి పనిచేసి.. తన పాటల స్ఫూర్తితో ఎంతోమందిని విప్లవోద్యమం వైపు నడిపారు. అంతటి బలమైన మావోయిస్టు భావజాలమున్న గద్దర్.. విరుద్ధ భావజాలమున్న బీజేపీ సభకు వెళ్లడం అన్ని వర్గాలనూ ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభ ఆరంభం నుంచి ముగింపు వరకు ఆయన మైదానంలోనే ఉండడం తెలంగాణ సమాజం దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. ‘విప్లవ సాహిత్యం’ పేరు చెబితే గుర్తుకొచ్చే గద్దర్.. బీజేపీ సభకు వెళ్లారా.. నమ్మలేకపోతున్నామంటూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. దేశం గురించి ప్రధాని మోదీ ఏం మాట్లాడుతారో వినేందుకు సభకు వచ్చానని చెప్పిన గద్దర్.. ఎలాంటి ఊహాగానాలకూ తావివ్వకుండా చెక్ పెట్టారు. అయితే గద్దర్ ఆశ్చర్యపరచడం ఇదే తొలిసారి కాదు.


యాదాద్రీశుడి దర్శనం..

భావజాలానికి విరుద్ధంగా నడుచుకుని వార్తల్లో నిలవడం గద్దర్‌కు ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా డిసెంబర్ 2021లో కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం మీడియాలో హైలెట్ అయ్యింది. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నానని గద్దర్ చెప్పడంపై అప్పట్లో చర్చే జరిగింది. 


చంద్రబాబుతో ఆలింగనం..

చంద్రబాబు నాయుడు సారధ్యంలోని టీడీపీ ప్రభుత్వంలో దేవేందర్ గౌడ్ హోంమంత్రిగా ఉన్నప్పుడు 1997 ఏప్రిల్‌లో గద్దర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. శరీరంలోకి కొన్ని బుల్లెట్లు దూసుకెళ్లాయి. అన్నింటినీ తొలగించినా.. ప్రాణాపాయం దృష్ట్యా ఒక బుల్లెట్‌ని తొలగించలేదు. ఇంకా ఆ బుల్లెట్ ఆయన శరీరంలోనే ఉంది. ఆ ఘటనను మనసులో పెట్టుకోకుండా 2018లో ఓ ఎన్నికల సభలో చంద్రబాబుని గద్దర్ ఆలింగనం చేసుకున్నారు. మహాకూటమి తరపున ప్రచారం చేసిన ఆయన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుతో మాట్లాడడం అమితాశ్చర్యానికి గురిచేసింది. కాగా కాల్పుల సమయంలో హోంమంత్రిగా ఉన్న దేవేందర్ గౌడ్ టీడీపీ నుంచి బయటకొచ్చి ‘నవ తెలంగాణ పార్టీ’ పెడితే గద్దర్ మద్దతు తెలిపారు. ఇక 2018లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కూడా కుటుంబ సమేతంగా గద్దర్ కలిశారు. తెలంగాణను ముందుకు తీసుకెళ్లే బాధ్యత కాంగ్రెస్‌దేనని వారికి చెప్పని విషయం తెలిసిందే.


కాగా కొడుకు రాజకీయ భవిష్యత్ దృష్ట్యానే గద్దర్ ఇలా వ్యవహరిస్తున్నారనే ఓ వాదన కూడా ఉంది. ఇందులో వాస్తవమెంతో తెలియదు. కానీ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ విజయసంకల్ప సభలో ప్రజా గాయకుడు గద్దర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారనడంలో సందేహమే లేదు. మైదానంలోకి వచ్చిన గద్దర్‌ను చూసిన బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఆయనతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దేశం గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఏం మాట్లాడతారో విందామని వచ్చానని గద్దర్ చెప్పారు. సభ ముగిసేంతవరకు ఆయన మైదానంలోనే ఉన్న విషయం తెలిసిందే.

Updated Date - 2022-07-04T18:54:11+05:30 IST