అక్కాయిపాలెం పంచాయతీ గురవయ్యకాలనీలో ఎమ్మెల్సీ పోతుల సునీత, చీరాలలో పార్టీ జాయింట్ సెక్రటరి నీలం శ్యామ్యూల్ మోజెస్(ఫైల్ ఫొటో)
ఎవరికి వారే యమునా తీరే
పార్టీలోని అంతర్గత విభేదాలు బహిర్గతం
నేతలకు సహకరించని నాయకులు, కార్యకర్తలు
అధిష్ఠానం మాటను ఖాతరు చేయని అసమ్మతివర్గాలు
బాపట్ల, మే 19 (ఆంధ్రజ్యోతి): మూడేళ్లలో ప్రభుత్వం నుంచి ప్రజలు అందుకున్న లబ్ధిని, సంక్షేమాన్ని ఇంటింటికి వెళ్లి చెప్పండని గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో వైసీపీ నాయకులను, కార్యకర్తలను రంగంలోకి దింపింది. అయితే ప్రజల నుంచి సానుకూలత విషయం ఏమో కాని పార్టీలోని అంతర్గత విభేదాలు మాత్రం ఈ కార్యక్రమంతో బహిర్గతమయ్యాయి. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే లేదా ఇన్‌చార్జి సారథ్యంలోనే ఈ కార్యక్రమం జరగాలని అధిష్ఠానం ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను అసమ్మతి ఖాతరు చేయకుండా ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల అసమ్మతి నాయకులు గుంభనంగా వ్యవహరిస్తూ నేతలకు సహకరించకుండా తెరవెనక పావులు కదుపుతున్నారు. చీరాల, పర్చూరులో ఇన్ని రోజులు చాపకిందనీరులా ఉన్న విభేదాలు గడపగడపతో ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. కార్యక్రమం ప్రారంభించిన తొలి రోజే వైసీపీ జాయింట్ సెక్రటరి నీలం శ్యామ్యూల్ మోజెస్ విడిగా గడపగడపకు నిర్వహించగా ఇటీవల ఎమ్మెల్సీ పోతుల సునీత తన అనుచరులతో వేటపాలెం మండలం అక్కాయపాలెం పంచాయతీ పరిధిలోని గురవయ్య కాలనీలో గడపగడపను నిర్వహించారు. పార్టీ ఇన్‌చార్జిగా కరణం వెంకటేశ్‌ను ప్రకటించినప్పటికీ అసమ్మతి గ్రూపులు వెనక్కి తగ్గకపోవడం విశేషం. ఇక పర్చూరులో ప్రస్తుత ఇన్‌చార్జి రావిరామనాఽథంబాబు తిరుపతి పాదయాత్రలో ఉండడం వల్ల ఆయన సతీమణి డీసీఎంఎస్ చైర్మన్ పద్మావతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏఎంసీ చైర్మన్ జువ్వా శివరాంప్రసాద్ విడిగా కార్యక్రమం నిర్వహించారు. ఆమె కారంచేడు మండలం స్వర్ణలో నిర్వహించగా ఏఎంసీ చైర్మన్ అదే మండలంలోని దగ్గుపాడులో ఒకేరోజు కార్యక్రమం చేపట్టారు. చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో విభేదాలు తారస్థాయికి చేరడంతో పార్టీ అధిష్ఠానం వీటిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. బాపట్లలో కోనకు అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన నేతలు సహకరించకుండా విడిగా గ్రామాల్లో సమావేశాలు పెట్టి తిరుగుబాటు జెండా గతంలోనే ఎగురవేశారు. వారెవరూ కూడా గడపగడపలో డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే కోన రఘుపతితో కలిసి రావడం లేదు. వీటన్నింటిని నిశితంగా గమనిస్తున్న రఘుపతి తనతో వచ్చేవారిని కలుపుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అద్దంకిలోని ద్వితీయశ్రేణి నాయకుల్లో పార్టీ ఇన్‌చార్జి బాచిన కృష్ణ చైతన్యపై అసంతృప్తి ఉన్నప్పటికీ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అసమ్మతి బయటపడకపోయినప్పటికీ పూర్తిస్థాయిలో ఇన్‌చార్జికి సహకరించడం లేదు. రేపల్లెకు చెందిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. రాబోయే ఎన్నికలలో ఈ స్థానం నుంచి తన కొడుకును బరిలోకి దింపాలనే ఆలోచనలో ఆయన ఉన్నారని సమాచారం. వైసీపీ స్థానిక నాయకులు మాత్రం ఆయన ఎంపీగా ఉన్నందున వేరే వారికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చే అవకాశం ఉంది.
జిలాలో ఇద్దరు ఎమ్మెల్యేలు..
జిల్లాలో వైసీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో వేమూరు నుంచి గెలిచి మంత్రిగా ఉన్న మేరుగ నాగార్జున ఒకరు కాగా మరొకరు బాపట్ల ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. చీరాలలో టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాంకృష్ణమూర్తి వైసీపీకు మద్దతుదారుడిగా వ్యవహరిస్తుండగా ఆయన కొడుకు వెంకటేశ్‌కు నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలను అధికారపార్టీ అప్పగించింది. పర్చూరులో ప్రస్తుతం రావి రామనాఽథంబాబు ఇన్‌చార్జిగా ఉన్నారు. ఆయనను తొలగించి ఆమంచి కృష్ణమోహన్‌కు అక్కడి బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. కానీ పార్టీ అధికారికంగా ఇంతవరకు ప్రకటించకపోవడం గమనార్హం.