‘గడప గడప’లో సమస్యల గళం

ABN , First Publish Date - 2022-05-18T06:41:59+05:30 IST

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం పేరుతో ప్రజల వద్దకు వెళుతున్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.

‘గడప గడప’లో సమస్యల గళం

అర్హులకు సంక్షేమ పథకాలు అందడంలేదని ఫిర్యాదులు

సీతయ్యపేట, చింతపాక గ్రామాల్లో ఎమ్మెల్యే ధర్మశ్రీకి సమస్యలు ఏకరువు


బుచ్చెయ్యపేట, మే 17: ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం పేరుతో ప్రజల వద్దకు వెళుతున్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. అర్హులమైనప్పటికీ తమకు ప్రభుత్వ పథకాలు అందడంలేదంటూ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆయన మంగళవారం మండలంలోని సీతయ్యపేట, చింతపాక గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నా సంక్షేమ పథకాలు మంజూరు కావడం లేదని సీతయ్యపేటలో పలువురు వాపోయారు. జగనన్న కాలనీ ఇళ్లు మంజూరు కాలేదని పరవాడ నాగమణి, నందారపు గోవింద, గంపల చిన్నారావు; పింఛన్‌ మంజూరు కాలేదని పసుపులేటి లక్ష్మి, వాహనమిత్ర మంజూరు కాలేదని మందపాటి వెంకటపతిరాజు, రైతు భరోసా మంజూరు కాలేదని చెల్లిబోయిన నర్సమ్మ, టైలర్‌ నేస్తం మంజూరు కాలేదని పండూరి సరోజని, బొబ్బరి లక్ష్మి, నందారపు రామలక్ష్మి తదితరులు ఫిర్యాదు చేశారు. అనంతరం చింతపాకలో నిర్వహించిన కార్యక్రమంలో.. పింఛన్‌, ప్రభుత్వ పథకాలు మంజూరు కాలేదని లక్కందాసు కళావతి, బొబ్బరి రామకృష్ణ, చొప్పా సత్యవతి, యలమంచలి విజయమ్మ, జె.సత్యారావు, ఆర్‌.వెంకటలక్ష్మి తదితరులు వాపోయారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపడతానని ఎమ్మెల్యే కె.ధర్మశ్రీ హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు దొండా రాంబాబు, విశాఖ డెయిరీ డైరెక్టర్‌ గేదెల సత్యనారాయణ, వైసీపీ మండల అధ్యక్షుడు కొల్లిమళ్ల అచ్చెంనాయుడు, సర్పంచ్‌లు గొలజాన శ్రీను, వజ్రపు ఇందిర, తహసీల్దార్‌ ఉమామహేశ్వరరావు, ఎంపీడీఓ విజయలక్ష్మి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-18T06:41:59+05:30 IST