కాసేపు కూడా గడప..లేక..

ABN , First Publish Date - 2022-05-17T06:20:03+05:30 IST

కాసేపు కూడా గడప..లేక..

కాసేపు కూడా గడప..లేక..
పథకాలపై ప్రశ్నిస్తున్న వ్యక్తికి కరపత్రాల పుస్తకాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు

గడప గడపకూ మన ప్రభుత్వం అపహాస్యం 

ప్రజల నుంచి ప్రజాప్రతినిధులకు ప్రశ్నల వర్షం

ప్రశ్నించే వారిపై ప్రతిపక్షాలనే ముద్ర

సమాధానం చెప్పలేక కరపత్రం చేతిలో పెట్టి చలో..

జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి


‘గడప గడపకూ మన ప్రభుత్వం’లో ప్రజాప్రతినిధులకు ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా మహిళల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు, నిలదీతలు ఎదురవుతున్నాయి. దీంతో ఎవరైనా పథకాలపై ప్రశ్నిస్తే వారిపై ప్రతిపక్షం వారన్న ముద్ర వేసి చేతులు దులిపేసుకుంటున్నారు.

- చిట్టినగర్‌/ఎ.కొండూరు


స్థలమిచ్చారు సరే.. ఇల్లు కట్టేదెలా?

మాజీమంత్రి వెలంపల్లి, మేయర్‌ భాగ్యలక్ష్మిని నిలదీసిన మహిళ

పశ్చిమ నియోజకవర్గంలోని 46వ డివిజన్‌ 143వ సచివాలయ పరిధిలో సోమవారం గడప గడపకూ మన ప్రభుత్వం జరిగింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి హాజరుకాగా, ఓ మహిళ అడ్డుపడింది. ‘ఇళ్ల స్థలం ఇచ్చారు. బాగానే ఉంది కానీ.. మమ్మల్నే ఇళ్లు కట్టుకోమంటున్నారు. ఇప్పుడున్న ధరల్లో మీరిచ్చే డబ్బుకు ఇల్లు ఎలా కడతాం..?’ అంటూ ప్రశ్నించింది. దీనిపై వెలంపల్లి స్పందిస్తూ ‘ప్రభుత్వం కొంత డబ్బు ఇస్తుంది. దాంతో కట్టుకోండి’ అని సమాధానమిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరో మహిళ మాట్లాడుతూ రేషన్‌కార్డు కోసం వెళ్తే సచివాలయ వీర్వో పేపర్లను విసిరి పడేశారని ఫిర్యాదు చేయగా, ‘నేను చూస్తానులే..’ అంటూ ఎమ్మెల్యే అక్కడి నుంచి జారుకున్నారు. ఇంకో మహిళ మాట్లాడుతూ పింఛన్‌ కోసం రేషన్‌ బియ్యంలో కోత పెట్టారంటూ ఫిర్యాదు చేసినా.. ఎమ్మెల్యే, మేయర్‌ పెద్దగా స్పందించలేదు. పథకాల వివరాలతో ఉన్న పుస్తకాన్ని ఆమె చేతిలో పెట్టి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమం అయిపోయాక ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ కార్యక్రమం బాగా జరుగుతోందని, ప్రజల స్పందన బాగుందన్నారు. కొద్దిమంది టీడీపీ మద్దతుదారులు కార్యక్రమాన్ని సక్రమంగా జరగనీయకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.

మీడియాపై అక్కసు

ఎమ్మెల్యే, మేయర్‌ను మహిళలు పెద్ద ఎత్తున నిలదీయడంతో కంగుతిన్న వారు ఆ ఆక్రోశాన్ని మీడియాపై వెళ్లగక్కారు. మేయర్‌  భర్త నరేంద్ర మాట్లాడుతూ మీడియానే ప్రజలను రెచ్చగొడుతోందన్నారు. ఎమ్మెల్యే వెనుక తిరుగుతూ రియల్‌ ఎస్టేట్‌ దందాలు చేసే మరో వ్యక్తి కూడా మీడియా వారిపై దురుసుగా ప్రవర్తించాడు. 


అభివృద్ధి లేని సంక్షేమమెందుకు?

ఎమ్మెల్యే రక్షణనిధిని నిలదీసిన మహిళలు 

‘మూడేళ్లుగా రోడ్లు, పక్కా గృహాలు, తాగునీటి సౌకర్యాలు లేవు. ఉపయోగం లేని పథకాలకు డబ్బులు ఖర్చుచేస్తూ అప్పు చేయడం ఎందుకు..?’ అని ఓ మహిళ గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్యెల్యే రక్షణనిధి, వైసీపీ నేతలను ప్రశ్నించింది. ఏ.కొండూరు మండలంలోని కోడూరులో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది. స్థానిక ఎస్సీ కాలనీలో పర్యటించగా, అక్కడి కుటుంబాలకు అందిన లబ్ధి గురించి వివరించారు. కోట వరమ్మ అనే మహిళ మాట్లాడుతూ ఎంతో అభివృద్ధి చేస్తారని వైసీపీకి ఓట్లు వేశామని, మూడేళ్లుగా అభివృద్ధి లేదని, ఉపయోగపడని సంక్షేమ పథకాలకు డబ్బు ఖర్చు చేస్తూ రాష్ర్టాన్ని అప్పులపాలు చేయడం ఎందుకని ప్రశ్నించింది. ఎస్సీ కాలనీకి చెందిన బంక వనజ, కోట సావిత్రి, కంభంపాటి బేబీ మాట్లాడుతూ అమ్మఒడి పథకం కోసం సచివాలయం చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 



కృష్ణా..ర్పణం

మచిలీపట్నం ‘గడప గడపకూ..’లో పేర్ని నాని కుమారుడు 

ఆయన వెంటే నడిచిన మేయర్‌, అధికారులు

ఏ హోదాలో వచ్చి సమస్యలు విన్నారని స్థానికుల్లో ప్రశ్న

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : మచిలీపట్నం నియోజకవర్గంలోని గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం వివాదాస్పదమైంది. కార్పొరేషన్‌ పరిధిలోని 31వ డివిజన్‌లో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది. మాజీమంత్రి పేర్ని నాని కుమారుడు కృష్ణమూర్తి ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మేయర్‌ మోకా వెంకటేశ్వరమ్మ, మున్సిపల్‌ ఇంజనీర్లు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ఆయన వెంట నడవడం విమర్శలకు దారితీసింది. ప్రభుత్వంలో, పార్టీలో ఎలాంటి పదవి లేని పేర్ని కృష్ణమూర్తి అధికారులతో కలిసి ఇంటింటికీ తిరగడం ఏమిటనే ప్రశ్నలు వచ్చాయి. ఇది అధికార దుర్వినియోగమనే విమర్శలూ వినిపించాయి. ఏ హోదాలో ఆయన ప్రజల సమస్యలు అడిగి తెలుసుకు న్నారని, ఏ హోదాతో పరిష్కారానికి అభయమిచ్చారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా పేర్ని నాని ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని, అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించవచ్చని, ఆయన కుమారుడు పాల్గొంటే ఎంతమేర ఉపయోగం ఉంటుందనే వాదన ప్రజల నుంచి వినిపించింది. కాగా, మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 31వ డివిజన్‌లో సోమవారం మధ్యాహ్నం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని భోజన విరామం కోసం ఆపారు. ఈ సమయంలో మాజీమంత్రి పేర్ని నాని సచివాలయం వద్దకు వచ్చారు. ముగ్గురు వలంటీర్ల పరిధిలోని క్లస్టర్లలో ప్రజలు చెప్పిన సమస్యలపై సమీక్షించారు. 



Updated Date - 2022-05-17T06:20:03+05:30 IST