గడప గడపకూ సమస్యల ఏకరువు

ABN , First Publish Date - 2022-05-24T05:24:46+05:30 IST

గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో తిరుగుతున్న నాయకులకు గ్రామస్థులు సమస్యల ఏకరువు పెట్టారు. చీమకుర్తి మండలంలోని చండ్రపాడు గ్రామంలో సోమవారం కార్యాక్రమాన్ని నిర్వహించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ,ఎంఎల్‌ఏ టీజేఆర్‌ సుధా

గడప గడపకూ సమస్యల ఏకరువు
వలంటీర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎస్సీ కాలనీ మహిళలు

చండ్రపాడులో నేతలను ప్రశ్నించిన ప్రజలు  

 చీమకుర్తి, మే23 :  గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో తిరుగుతున్న నాయకులకు గ్రామస్థులు సమస్యల ఏకరువు పెట్టారు. చీమకుర్తి మండలంలోని చండ్రపాడు గ్రామంలో సోమవారం కార్యాక్రమాన్ని నిర్వహించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ,ఎంఎల్‌ఏ టీజేఆర్‌ సుధాకర్‌బాబు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్‌ఏ బుర్రా మధుసూదన్‌యాదవ్‌, మాజీ ఎంఎల్‌ఏ బూచేపల్లి శివప్రసాదరెడ్డి పాల్గొన్నారు. తొలుత ఎంఎల్‌ఏలుగా గెలిచి మూడేళ్లయిన సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కేక్‌ కట్‌ చేశారు. అంబేడ్కర్‌ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.తదుపరి నాయకులు ఇంటింటా తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ మేరకు అందాయే వాకబు చేశారు. గ్రామంలో నెలకొన్న కరెంట్‌ సమస్యల చెబితే పట్టించుకునే వారే కరవయ్యారని మోపూరి వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి నాయకుల ముందు వాపోయారు. ఇంటి పట్టాలు మంజూరు కాలేదని,గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలని చిట్టిబోయిన వెంకట్రావు కోరారు. గ్రామంలో డ్రైనేజి సమస్యను పరిష్కరించాలని వల్లంరెడ్డి కోటిరెడ్డి కోరారు. కాగా ఎస్సీ కాలనీలో నాయకులను గడప గడపకు కాకుండా వైసీపీ వారి గడపలకే వలంటీర్లు తీసుకుపోతుండటంపై దళిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను చెప్పుకొనే అవకాశం లేకపోవటంతో అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమకు వితంతు పింఛన్‌ అందటం లేదని, గృహ పట్టాలు ఇవ్వలేదని, నిర్మించుకున్న గృహలకు బిల్లులు వేయలేదని, అమ్మఒడి డబ్బులు పడలేదని, తదితర సమస్యలను దళిత మహిళలు నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. వాటన్నింటిని పరిష్కరించాలని వారు అధికారులకు సూచించారు. 


మంత్రి పదవుల రాకపోవడంపై నిర్వేదం 

తొలుత నాయకులు కేక్‌ కట్‌ చేసిన అనంతరం అక్కడ హాజరైన ప్రజలనుద్దేశించి బుర్రా మధుసూదనయాదవ్‌ మాట్లాడారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ కోటాలో సుధాకర్‌బాబుకు, బీసీ కోటాలో  తనకు మంత్రి పదవులు వస్తాయని భావించామని, కాని  మా ఇద్దరికీ ఛాన్స్‌ దక్కలేదని నిర్వేదం వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, నగరపంచాయతీ చైర్మన్‌ చల్లా అంకులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-24T05:24:46+05:30 IST