Abn logo
Sep 27 2021 @ 01:03AM

గాలి.. వాన..

జిల్లాపై గులాబ్‌ ప్రభావం

పగలంతా ముసురు వాతావరణం

రాత్రి నుంచి ఈదురుగాలులతో భారీ వర్షం

సముద్ర తీర మండలాల్లో అప్రమత్తం

చేపలవేటకు దూరంగా మత్స్యకారులు

నదులు, వాగుల్లో పెరిగిన వరద ఉధృతి

సిద్ధంగా ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు

తహసీల్దార్‌ కార్యాలయల్లో కంట్రోల్‌ రూమ్‌లు

ముంపు ప్రాంతాల్లో పంటల పరిస్థితిపై వ్యవసాయ శాఖ ఆరా


విశాఖపట్నం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి):

బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆదివారంసాయంత్రం శ్రీకాకుళం జిల్లా భావనపాడు సమీపంలో తుఫాన్‌ తీరం దాటే ప్రక్రియ ప్రారంభంకాగా, రాత్రి ఎనిమిది గంటల తరువాత ఈదురు గాలులు, వర్షం పెరిగాయి. రాత్రి తొమ్మిది గంటల నుంచి గాలుల ఉధృతి మరింత పెరిగింది. అంతకుముందు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా అంతటా ముసురు వాతావరణం నెలకొంది. సాయంత్రం తరువాత వర్షం జోరందుకుంది. రాగా జిల్లాలో తీరం వెంబడి ఈదురు గాలుల తీవ్రత పెరగడంతో ఆయా ప్రాంతాల అధికారులను జిల్లా యంత్రాంగం అప్రమత్తంచేసింది. భీమిలి నుంచి పాయకరావుపేట వరకు తీర ప్రాంత మండలాల అధికారులు మండల కేంద్రాల్లోనే వుండాలని ఆదేశించారు. అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. వీఆర్వోలు గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మత్స్యకారులు చేపలవేటకు వెళ్లకుండా హెచ్చరికలు జారీచేశారు. అంతేకాక ఆయా ప్రాంతాల్లో పోలీసులు గస్తీ ఏర్పాటుచేశారు. సముద్ర తీర ప్రాంతాలతోపాటు, నదీ తీర ప్రాంత గ్రామాల ప్రజలకు ఇబ్బందులు వస్తే సహాయం కోసం జాతీయ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థకు చెందిన బృందాలు సిద్ధంగా ఉన్నాయి. బోట్లు, ఇతర పరికరాలు అందుబాటులో ఉంచారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కమిషనర్‌ కన్నబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చి ఆదివారం విశాఖ జిల్లా యంత్రాంగంతో సమావేశం నిర్వుహించారు. ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. 


నదులు, గెడ్డల్లో వరద

గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి ముసురు వాతావరణం నెలకొంది. ఎడతెరిపిలేకుండా జల్లులు పడుతుండడంతో సాధారణ జనజీవనానికి ఆటంకం కలిగింది. రహదారుల్లోని గోతుల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈదురు గాలుల కారణంగా మునగపాక మండలంలో పలుచోట్ల చెరకు తోటలు    నేలకొరిగాయి. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు గెడ్డలు, వాగులు పొంగాయి. శారదా, వరహా, సర్పా, బొడ్డేరు నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. శారదా నదిపై కశింకోట మండలం కాశీమదుం వద్ద వున్న  గ్రోయన్‌కు గండిపడింది. రావికమతం మండలంలోని కల్యాణపులోవ జలాశయానికి 350 క్యూసెక్కులకుపైగా వరద నీరు చేరుతుండడంతో  ఇరిగేషన్‌ అధికారులు నాలుగు స్పిల్‌ గేట్లు ఎత్తి సుమారు 250 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. దేవరాపల్లి మండలంలోని రైవాడ జలాశయంలోకి 400 క్యూసెక్కుల వరద నీరు చేరుతున్నది. గరిష్ఠ నీటిమట్టం 114 మీటర్లుకాగా ఆదివారం సాయంత్రం 110.7 మీటర్లుగా నమోదైంది. మాడుగుల మండలంలోని పెద్దేరు జలాశయంలోకి 501 క్యూసెక్కుల వరద నీరు చేరుతున్నది. ఇరిగేషన్‌ అధికారులు స్పిల్‌వే గేట్ల నుంచి 391 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. కాగా పలుగ్రామాల్లో చెరువులు నిండాయని, గండ్లు పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్‌ అధికారులకు ఆదేశాలు అందాయి. లోతట్లు ప్రాంతాల్లో పంటలు నీటి మునిగే అవకాశం వుందని, ఇటువంటి పరిస్థితి ఏర్పడితే వెంటనే వివరాలను పంపాలని మండల, గ్రామసచివాలయ వ్యవసాయ సిబ్బందిని వ్యవసాయ శాఖ జేడీ లీలావతి ఆదేశించారు.