Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

హిట్‌లిస్ట్‌లో నా పేరుందని ఒకాయన ఫోన్‌ చేశాడు

twitter-iconwatsapp-iconfb-icon
హిట్‌లిస్ట్‌లో నా పేరుందని ఒకాయన ఫోన్‌ చేశాడు

ప్రజలు ఆశించింది జరగట్లేదు

ఉద్యమాల్లో అప్‌ అండ్‌ డౌన్స్‌ ఉంటాయి

మా అమ్మ నన్ను కాంగ్రెస్‌ అని పిలిచేది

ఓపెన్ హార్ట్‌ విత్ ఆర్కేలో ప్రొఫెసర్‌ హరగోపాల్‌


మానవ హక్కుల కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న చైతన్యం ప్రొఫెసర్‌ హరగోపాల్‌. రాద్ధాంతాలకు దూరంగా ఉండే ఈ సిద్ధాంతకర్త.. ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కేలో తన జీవిత విశేషాలను ఓపెన్‌గా పంచుకున్నారు. చిన్నతనంలో అమ్మచేత కాంగ్రెస్‌ అని పిలిపించుకున్న ముచ్చట్లు, వామపక్షభావజాలానికి అకర్షితుడైన వైనం.. హక్కుల పోరాటంలో ఎదురైన చిక్కులు.. ఇలా ఎన్నో విశేషాలను మన ముందుంచారు. 18-5-2015న ఏబీఎనలో ప్రసారమయిన ఈ కార్యక్రమ వివరాలు... 


ఆర్కే: వెల్కం టు ద ఓపెన్‌ హార్ట్‌. నమస్కారం హరగోపాల్‌ గారు..

హరగోపాల్‌: నమస్కారమండి.


ఆర్కే: మీ బాల్యం గురించి చెప్పండి..

హరగోపాల్‌: నేను మహబూబ్‌నగర్‌ జిల్లా మొగిలిగిద్దలో పుట్టాను. మేం పది మంది పిల్లలం. నేను అందరికంటే పెద్దవాణ్ని. నలుగురు చెల్లెళ్లు, ఐదుగురు తమ్ముళ్లు. మాది ఉమ్మడి కుటుంబం. మాకు పదిహేను ఎకరాల భూమి ఉండేది. 1948లో నేను స్కూల్‌కి వెళ్లడం ప్రారంభించాను. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలితరం విద్యార్థులం మేం.


ఆర్కే: చిన్నప్పుడు అందరిలాగానే అల్లరిచిల్లరిగా ఉండేవారా?

హరగోపాల్‌: చిన్నప్పుడు నేను కాంగ్రెస్‌. మా అమ్మ నన్ను కాంగ్రెస్‌ అని పిలిచేది. కాంగ్రెస్‌ అంటే సాఫ్ట్‌, తక్కువ ప్రాబ్లమాటిక్‌ అని అర్థం. ఒక తమ్ముని సోషలిస్ట్‌ అని పిలిచేది. ఎక్కువ సమస్యలను క్రియేట్‌ చేసేవారిని కమ్యూనిస్ట్‌ అనేది.


ఆర్కే: పిల్లలకు అలా పేరు పెట్టారా మీ అమ్మగారు..?

హరగోపాల్‌: కోపం వచ్చినపుడు వాళ్ల మనస్తత్వాలు ఏయే కేటగిరీలకి వస్తాయో.. ఆయా పేర్లు పెట్టేది. మా అమ్మకు రాజకీయ పరిజ్ఞానం ఉండేది. అందుకని సరదాగా అలా పిలిచేది.


ఆర్కే: మీ నాన్న గారు చదువుకున్నారా?

హరగోపాల్‌: ఆయన ఏడో తరగతిలో ఫెయిలయ్యారట. తర్వాత గ్రామంలోనే వ్యవసాయం పనులతో బిజీ అయ్యారు. అయితే మా నాన్నగారికి నన్ను చదివించాలనే కోరిక బలంగా ఉండేది. బయటికి పంపించాలి అనేవారు.


ఆర్కే: మీ బ్రదర్స్‌ అందరూ చదివారా..?

హరగోపాల్‌: ఒకాయన లాయర్‌, ఇంకొకాయన ప్రిన్సిపాల్‌, ఇంకొకరు ఓల్డేజ్‌ హోమ్‌ చూసుకుంటున్నాడు. ఇంకో అబ్బాయి కంప్యూటర్‌ సెంటర్‌ పెట్టాడు. చివరి తమ్ముడు మాత్రం మా ఊర్లోనే ఉండిపోయాడు.


ఆర్కే: ఎందుకలా జరిగింది..?

హరగోపాల్‌: చదువుల కోసం అందరూ బయటకు వెళ్లారు. తోడుగా వాడు ఉంటాడని మా అమ్మానాన్నలు భావించారేమో. అయితే మా తమ్ముడు మాత్రం ‘మీరు చదివే రోజుల్లో మంచి టీచర్లున్నారు.. మేం చదివేటప్పుడు బాగా చెప్పే టీచర్లు లేరు’ అని అంటుంటాడు.


ఆర్కే: అందరూ చదువుకున్నారు. నాకేమో వ్యవసాయం అప్పజెప్పారని అంటాడా?

హరగోపాల్‌: అంటాడు. అయితే తను చదువుకోకున్నా అందరికీ మంచి విద్య కావాలంటాడు. ఆ దిశగా ప్రయత్నిస్తున్నాడు.


ఆర్కే: చిన్నప్పుడు కాంగ్రెస్‌ అనిపించుకున్న మీరు వామపక్ష భావజాలానికి ఎలా ఆకర్షితులయ్యారు ?

హరగోపాల్‌: నేను ఎమ్‌.ఎ పబ్లిక్‌ అడ్మినిస్ర్టేషన్‌ చదివా. ఐడియాలజికల్‌ బుక్స్‌ చదివేవాన్ని. వామపక్ష భావజాలం విషయానికొస్తే నేను ఉస్మానియాలో లెక్చరర్‌గా ఏడాది పనిచేశాక వచ్చింది.


ఆర్కే: విద్యార్థిగా ఉన్నపుడు వామపక్ష ప్రభావం లేదన్నమాట

హరగోపాల్‌: లేదు. వరంగల్‌ వెళ్లిన తర్వాత 1970 ప్రాంతంలో ఉత్తర తెలంగాణలో నక్సలిజం ప్రభావం పెరిగింది. విశ్వవిద్యాలయంలోని క్లాస్‌రూమ్స్‌ వైబ్రెంట్‌గా ఉండేవి. ఇంజినీర్లు, డాక్టర్లు ఇలా చాలామంది ప్రభావితమయ్యారు. ఉస్మానియాలో పనిచేసే రోజుల్లో ఎవరికైనా వరంగల్‌లో పోస్టింగ్‌ అంటే భయపడేవారు. ఓసారి ‘నీకు పెళ్లికాలేదు కదా వరంగల్‌ పోస్టింగ్‌ ఇచ్చాం. కొన్నాళ్లు అక్కడ చేసిరా’ అన్నారు. ఎమ్‌.ఎలో నాకు చదువు చెప్పిన ప్రొఫెసర్‌ రామ్‌రెడ్డి, వరంగల్‌లో హెచ్‌వోడీ కావటంతో.. ఆయనతో కలసి పనిచేయాలని వెళ్లా. ఏడాది కాగానే ఆయన తిరిగి వచ్చారు. నేను మాత్రం 1970 నుంచి 1980 వరకు పదేళ్లు అక్కడే ఉండిపోయా.


ఆర్కే: ఆ దశాబ్ద కాలంలో చాలా నేర్పించి, నేర్చుకున్నారన్నమాట..!

హరగోపాల్‌: విద్యార్థుల ప్రభావం నా మీద ఎక్కువే.


ఆర్కే: విద్యార్థులే ప్రభావితం చేశారన్నమాట..

హరగోపాల్‌: విద్యార్థుల నుంచీ నేర్చుకోవచ్చు. వాళ్లకు మంచి భావాలుంటాయి. మంచి సందేహాలు అడుగుతారు. కోదండరాం వరంగల్‌లో నా విద్యార్థి.


ఆర్కే: విద్యార్థుల నుంచి కొంచెం నేర్చుకున్నానని అంటున్నారు కనుక ఒక రకంగా మీరు అదృష్టవంతులే. ఎందుకంటే ఇప్పటి పరిస్థితులు అలా లేవు.

హరగోపాల్‌: ఈ మధ్య వీళ్లు చెప్పడం తగ్గింది, వాళ్లూ అంతే. అప్పట్లో వరంగల్‌లో ఉద్యమ ప్రభావం ఉన్నా క్లాస్‌లు సీరియ్‌సగా చెప్పేవాళ్లం.

హిట్‌లిస్ట్‌లో నా పేరుందని ఒకాయన ఫోన్‌ చేశాడు

ఉద్యమాల్లో అప్‌ అండ్‌ డౌన్స్‌ ఉంటాయి


ఆర్కే: ఒకప్పుడు ఏ ఇష్యూ వచ్చినా కన్నబీరన్‌, బాలగోపాల్‌, హరగోపాల్‌.. ఈ మూడు పేర్లు వినిపించేవి. ఇప్పుడు మీరొక్కరే ఉన్నారు. ఒంటరి పోరాటం అనిపిస్తోందా?

హరగోపాల్‌: బరువు పెరిగినట్లు అనిపిస్తుంది. గుర్తేడులో కిడ్నాప్‌ జరిగినపుడు కన్నబీరన్‌ గారు వెళ్లారు. 1992లో కొయ్యూరులో కిడ్నాప్‌ జరిగినపుడు నేనూ, కన్నబీరన్‌ గారు వెళ్లాం. అనుభవం ఉంది కాబట్టి ఆయన ఈజీగా హ్యాండిల్‌ చేశారు. తీరా ఒడిశాలో కిడ్నాప్‌ జరిగిన టైంలో కన్నబీరన్‌గారు లేరు. బాలగోపాల్‌ లేడు. నేనొక్కడినే వెళ్లాను. తర్వాత ఛత్తీ్‌సఘడ్‌ వెళ్లిననపుడు కూడా చాలా సమస్యలు ఎదురయ్యాయి. 


ఆర్కే: మీకు నిరాశ కలగట్లేదా?

హరగోపాల్‌: ఉద్యమాల్లో అప్‌ అండ్‌ డౌన్స్‌ ఉంటాయి. సమాజం కొందరిని తయారు చేస్తుంది. మళ్లీ బాలగోపాల్‌ లాంటివాళ్లు రావాలంటే టైం పడుతుంది. సమాజంలోని సమస్యలకు సమాజమే పరిష్కారాలు వెతుక్కుంటుంది.


ఆర్కే: మీ సుదీర్ఘ ప్రయాణంలో రాజీ పడకుండా మీరు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. ఎక్కువగా బాధితుల తరఫున పోరాడారు. వాటి వల్ల మీరు ఇబ్బందులు పడ్డారా?

హరగోపాల్‌: ‘పాలమూరు కరువు పోరాట కమిటీ’ పెట్టిన తర్వాత ఒక దశలో కమిటీ సభ్యులను చంపేస్తాం అని వార్నింగులిచ్చారు. కొందరిని చంపేశారు కూడా. హిట్‌లి్‌స్టలో నా పేరు ఉందని ఒకాయన ఫోన్‌ చేశాడు. ‘రోజూ నేను యూనివర్సిటీ వెళ్తాను. ఎక్కడైనా నీకు దొరుకుతాను. ఇదేం హీరోయిజమయ్యా..! అసలు ఇప్పుడు మేమేం చేస్తున్నాం’ అని అడిగాను. అతనేదో మాట్లాడాడు. ఇలాంటి సందర్భాలెన్నో ఎదురయ్యాయి.


ఆర్కే: మరి మీ కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి వచ్చిందా ? ఇక ఉద్యమం చాల్లేండి అనే సందర్భాలు ఎదురయ్యాయా?

హరగోపాల్‌: మా ఇద్దరు అబ్బాయిలూ రాజకీయ విశ్వాసాలు, వామపక్ష భావజాలం ఉన్నవాళ్లే. ఇక నా ఇంటికి ఫోన్స్‌ చేసి కొందరు బెదిరిస్తే మా ఆవిడ భయపడకుండా వాళ్ల మీదే కోప్పడేది. అప్పుడప్పుడు ‘ఎందుకిదంతా..?’ అని అడిగేది.


ఆర్కే: అప్పట్లో సమైక్యవాదం వినిపించినట్టున్నారు..

హరగోపాల్‌: 1969లో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకిని. ఉమ్మడి రాష్ట్రంతోనే అభివృద్ధి సాధ్యమని, మన వాయిస్‌ కేంద్రంలో గట్టిగా వినిపించొచ్చనేది నా అభిప్రాయం. ఓసారి బాలగోపాల్‌ గారు కృష్ణాజలాలకి సంబంధించిన రిపోర్టుతో పరిష్కారం కోసం వెళ్తే రాజకీయ నాయకులు సీరియ్‌సగా తీసుకోలేదు. మేం రాజశేఖర్‌రెడ్డి దగ్గరకు వెళ్లి మాట్లాడితే నీళ్లే లేవు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చాలా సమస్యలకు పరిష్కారం లేకపోయింది. తర్వాత తెలంగాణ కోసం ఉద్యమం ఊపందుకుంది. తెలంగాణ వస్తేనే ప్రజలు బాగుపడతారని నేను ఏకీభవించాను.


ఆర్కే: తెలంగాణ వచ్చాక ఎలా ఫీలవుతున్నారు ?

హరగోపాల్‌: ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ వచ్చింది. అయితే ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య అగాధం ఏర్పడింది. తెలంగాణ వచ్చాక ఉద్యమంలోలా నేతలంతా హార్డ్‌వర్క్‌ చేస్తారని ప్రజలు ఆశపడ్డారు. కాని, ఆది జరగడం లేదు.


ఆర్కే: తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి మేధావుల సలహా మండలి ఏర్పాటు చేస్తా అన్నారు..

హరగోపాల్‌: సలహామండలికి కమిటెడ్‌ వాళ్లు ఉండాలి.


ఆర్కే: వైబ్రెంట్‌ సమాజంలో మేధావులు కూడా సీఎంను ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు?

హరగోపాల్‌: తెలంగాణ పౌరులంత వైబ్రెంట్‌గా రాజకీయ నాయకులు లేరు. సమాజానికి, రాజకీయ వ్యవస్థకి రాబోయే ఏళ్లలో అగాధం ఏర్పడబోతోంది.


ఆర్కే: తెలుగు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు పూడ్చటానికి మీలాంటి వారు ముందుకు రావచ్చు కదా..?

హరగోపాల్‌: చాలామంది మీరు అది చేయొచ్చు కదా.., ఇది చేయొచ్చు కదా.., కేజ్రీవాల్‌లా ఏదైనా చేయొచ్చు కదా అంటారు. విభజన తర్వాత కలసిన వాళ్లు, తిట్టుకున్న వాళ్లను చూస్తే.. సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకునే కల్చర్‌ మనకు లేదనిపిస్తోంది. రెండు రాషా్ట్రల నేతలు ఎవరి కలలు వారు కంటున్నారు. అవి సాకారమైతే మంచిదే. కాకుంటే ఇబ్బందే.


ఆర్కే: ఆంధ్రతో పోలిస్తే తెలంగాణలో అభ్యుదయవాదులు ఎక్కువే. దీంతో పాటు ఇక్కడి ప్రజలు వైబ్రెంట్‌గా ఉంటారు. ఢిల్లీలో ఆప్‌ లాగా ఇక్కడ ప్రయోగం చేయటం కుదరదంటారా ?

హరగోపాల్‌: డెమోక్రటిక్‌ కల్చర్‌ని పొలిటికల్‌ కల్చర్‌ లోకి చొప్పించాలంటే కష్టం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అనుభవం తెలంగాణకు ఉంది. ప్రజాస్వామ్య సంస్కృతి ఉన్నవాళ్లు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లాలని ఎవరూ అనుకోవటం లేదు.


ఆర్కే: మీరు చేయల్సిందేమైనా ఉందనుకుంటున్నారా?

హరగోపాల్‌: పిల్లలందరికీ సమాన విద్య, నాణ్యమైన విద్య కావాలని దేశమంతా ఉద్యమిస్తున్నాను. ప్రస్తుతం నా మనవరాళ్లతో హ్యాపీగా స్పెండ్‌ చేస్తున్నా. వాళ్ల నుంచి కొత్త లర్నింగ్‌ నేర్చుకుంటున్నా.


ఆర్కే: మీ సుదీర్ఘప్రయాణంలో ఆత్మపరిశీలన చేసుకున్నపుడు పొరపాటు చేశామని అనిపించిందా ?

హరగోపాల్‌: చాలా మంది గొప్పవాళ్లలో నేను అనేది లేదు. వారిలో సమాజం ఉంది. నేను నన్ను పట్టుకుని కూర్చుంది. దాన్ని అధిగమించగలిగితే ఆ హ్యాపీనెస్‌ గొప్పగా ఉంటుందేమో. నా బ్యాక్‌గ్రౌండ్‌ వల్ల నాకు ఈ స్థితి సాధ్యమయ్యేది కాదు. అందుకే నేను నాలో ఉంది. భయం కూడా లేకపోతే బావుండేది అనిపిస్తుంది.


ఆర్కే: మీ కోరికలు తీరాలని, మీ మనవలు, మనవరాళ్లు ఎదిగే క్రమాన్ని చూడాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.