కాబోయే అధ్యక్షుడు సజిత్‌ ప్రేమదాస?

ABN , First Publish Date - 2022-07-14T07:22:43+05:30 IST

విధి వైచిత్రి అంటే ఇదేనేమో? దేశ అధ్యక్షుడిగా ఉన్న తండ్రి..

కాబోయే అధ్యక్షుడు సజిత్‌ ప్రేమదాస?

మాజీ అధ్యక్షుడు రణసింఘె కుమారుడు!

అధ్యక్ష తరహా పాలన, జాత్యహంకార వ్యతిరేకి


కొలంబో, జూన్‌ 13: విధి వైచిత్రి అంటే ఇదేనేమో? దేశ అధ్యక్షుడిగా ఉన్న తండ్రి.. జాత్యహంకారాన్ని భరించలేక ఉద్భవించిన, మైనారిటీ వర్గానికి చెందిన ఉగ్రవాద సంస్థ చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఇప్పుడదే దేశానికి.. మైనారిటీల హక్కులపై గళమెత్తే, జాత్యహంకార వ్యతిరేకి అయిన ఆయన కుమారుడు అధ్యక్షుడు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాక అధ్యక్ష తరహా పాలన ఉండొద్దని వాదించే వ్యక్తే.. అధ్యక్షుడు కాబోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఇదంతా శ్రీలంకలో జరుగుతోంది. ఆ దేశ అధ్యక్ష పదవికి సజిత్‌ ప్రేమదాస(55) పేరు వినిపిస్తోంది. దివంగత అధ్యక్షుడు రణసింఘె ప్రేమదాస కుమారుడే ఈయన. రణసింఘెను 1993 మేలో లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ ఈలం (ఎల్టీటీఈ) దారుణంగా హత్య చేసింది. ఇక 2000 ఎన్నికల్లో హంబన్‌టోటా నుంచి సజిత్‌ ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కొలంబో జిల్లా నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. అయితే, శ్రీలంక పార్లమెంటులో 225 సీట్లున్నాయి. కనీస మెజార్టీ 113. రాజపక్సె సోదరుల యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ (యూఎన్‌పీ) రెండేళ్ల కిందటి ఎన్నికల్లో మరికొన్ని పార్టీలతో కలిసి యునైటెడ్‌ పీపుల్స్‌ ఫ్రీడమ్‌ అలయన్స్‌ (యూపీఎ్‌ఫఏ)గా పోటీ చేసి 145 స్థానాల్లో గెలిచింది. తర్వాత మరో స్థానంలోనూ నెగ్గింది. ఈ కూటమి నుంచి 43 మంది ఎంపీలు స్వతంత్ర వర్గంగా ఏర్పడ్డారు. ఇక సజిత్‌ ప్రేమదాస పార్టీ సమగి జన బలవేగయ(ఎస్‌జేబీ)కి 53, తమిళ్‌ నేషనల్‌ అలయన్స్‌(టీఎన్‌ఏ)కి 10, సమతా విముక్తి పెరమున(ఎస్‌జేపీ)కు ముగ్గురు సభ్యులున్నారు. వీరికి యూపీఎ్‌ఫఏ 43 మంది ఎంపీలను కలుపుకొంటే సజిత్‌ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే అవకాశం ఉంది. కాగా, యూపీఎ్‌ఫఏ నుంచి సమాచార మంత్రిగా ఉన్న దుల్లాస్‌ దహం కుమార అలహప్పెరుమ, ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న ప్రధాని రణిల్‌ విక్రమసింఘె పోటీ పడుతున్నారు. విప్‌ లేకుండా రహస్య బ్యాలెట్‌ పద్ధతిన.. ఈ నెల 20న తదుపరి అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. 


విభిన్నం సజిత్‌ రాజకీయ నేపథ్యం

సజిత్‌ ప్రేమదాసకు మచ్చలేని నాయకుడిగా పేరుంది. దేశంలో అధ్యక్ష తరహా పాలన వద్దని తొలిగా గళమెత్తిన నాయకుల్లో ఈయన ఒకరు. సమ్మిళిత రాజకీయం ఉండాలనేది ఈయన దృక్పథం. జాతి వివక్ష, మైనారిటీలను వేరుగా చూడడాన్ని సజిత్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అసలు మైనారిటీలను పరాయివారుగా చూడడమే లంక భద్రతకు పెనుముప్పని ఓ సందర్భంలో చెప్పారు. ఈ కోణంలోనూ ఆయనకు అధ్యక్ష ఎన్నికలో టీఎన్‌ఏ మద్దతిస్తుందనేది విశ్లేషకుల భావన. లండన్‌ స్కూ ల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌(ఎల్‌ఎ్‌సఈ)లో చదువుకున్న సజిత్‌.. ద్వీపదేశాన్ని సామాజిక, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించగల సమర్థుడిగా అంచనా వేస్తున్నారు.

Updated Date - 2022-07-14T07:22:43+05:30 IST