కాబోయే సీఎం చంద్రబాబు

ABN , First Publish Date - 2022-05-20T06:52:12+05:30 IST

రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని తెలుగుదేశం పార్టీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

కాబోయే సీఎం చంద్రబాబు

టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి,  సంక్షేమం  

సోమిశెట్టి, గౌరు 


కర్నూలు (అగ్రికల్చర్‌), మే 19:  రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని తెలుగుదేశం పార్టీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ రెండేళ్లల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పని చేసి అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలమైన శక్తిగా సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం కర్నూలు నగరంలోని నందికొట్కూరు రోడ్డులో కమ్మ సంఘం కమ్యూనిటీ హాలు ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు  కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో పాటు ఎమ్మెల్సీలు కేఈ ప్రభాకర్‌, ఎన్‌ఎండీ ఫరూక్‌, బీటీ నాయుడుతో పాటు 14 నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జిలు హాజరయ్యారు. ఈ సమావేశంలో సోమిశెట్టి, గౌరు వెంకటరెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధ్ది, ప్రజా సంక్షేమం సాధ్యమన్నారు.  గ్రామస్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకు  పార్టీ బలమైన పునాదితో  ఉందని, ఇటువంటి శక్తి దేశంలో ఏ పార్టీకి లేదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న వైసీపీకి కూడా టీడీపీలాగా   బలమైన యంత్రాంగం లేదని స్పష్టం చేశారు.   చంద్రబాబు నాయుడు కర్నూలు  నగరంలో కాలు పెట్టగానే  ఏమి చెబుతారోనని ఆసక్తిగా  ప్రజలు సభాస్థలికి తరలివచ్చారని అన్నారు. తెలుగుదేశం పార్టీ బ్యానర్లను తొలగించడం చూస్తే వారి దుర్బుద్ధి ఏ స్థాయిలో ఉందో ప్రజలు అర్థం చేసుకున్నారని గౌరు వెంకటరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నాగేంద్ర కుమార్‌, పోతురాజు రవికుమార్‌, నరసింహ యాదవ్‌, సత్రం రామకృష్ణుడు, హనుమంతరావుచౌదరి, అబ్బాస్‌, నారాయణ రెడ్డి, గున్నా మార్క్‌, రాజు, జేమ్స్‌, గట్టు తిలక్‌, బజారన్న, రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-20T06:52:12+05:30 IST