ఉగ్రసింహాలు!

ABN , First Publish Date - 2022-07-15T10:36:22+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏం చేసినా విపక్షాలు తప్పుబడుతూనే ఉంటాయని బీజేపీ నాయకుల బాధ. కొత్త పార్లమెంటు భవనంమీద మోదీ ఆవిష్కరించిన జాతీయచిహ్నం...

ఉగ్రసింహాలు!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏం చేసినా విపక్షాలు తప్పుబడుతూనే ఉంటాయని బీజేపీ నాయకుల బాధ. కొత్త పార్లమెంటు భవనంమీద మోదీ ఆవిష్కరించిన జాతీయచిహ్నం రూపురేఖలపై విపక్షాలు మండిపడుతున్నాయి. సమాజంలో పేరున్న పెద్దలు కూడా మోదీ కొత్తసింహాలమీద విమర్శలు చేశారు. సారానాథ్ స్తూపంలోని సింహాలు ఉన్నతంగా, గంభీరంగా ఉంటే, మోదీ ఆవిష్కరించిన జాతీయచిహ్నంలోని మృగరాజులు రౌద్రంగా, పళ్ళూ కోరలూ చాచి క్రూరంగా కనిపిస్తున్నాయని, మోదీ పాలనావిధానానికీ, బీజేపీ ఆలోచనారీతికీ ఇది తార్కాణమని విమర్శలు వస్తున్నాయి. అశోకస్తంభంలోని సింహాల రూపాలను, వ్యక్తీకరించే గుణగణాలనూ మార్చడం జాతీయచిహ్నాన్ని అవమానించడమేన్నది ఈ వాదనల సారాంశం.


‘సత్యమేవ జయతే నుంచి సింహమేవ జయతే’ వరకూ పరిస్థితులు మారిన సంకేతమిది అని తృణమూల్ ఎద్దేవా చేస్తుంటే, ‘గాంధీ నుంచి గాడ్సే’ వరకు అని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు. బీజేపీ నాయకులకు మాత్రం ఈ నాలుగు సింహాల్లో మార్పు వీసమెత్తు కూడా లేనట్టు కనిపిస్తున్నది. అసలుకూ ప్రస్తుత నిర్మాణానికీ కొలతల్లో తేడా ఉన్నందున, కొత్త విగ్రహం చాలా రెట్లు పెద్దది కావడం వల్ల మార్పున్నట్టు అనిపించవచ్చునని వారి వాదన. జాతీయ చిహ్నానికి సంబంధించి తనకు ఇచ్చిన డిజైన్లలో తాను వీసమెత్తు మార్పుచేయలేదనీ, టాటాకంపెనీ ఇచ్చిన మట్టి డిజైన్లనుంచి తాను కాంస్య విగ్రహాన్ని తయారుచేశానని చెప్పి, ఈ చిహ్నం రూపకల్పనతో ప్రభుత్వానికి సంబంధం లేదని శిల్పి తేల్చేశారు. విగ్రహరూపురేఖల్లో కొన్ని తేడాపాడాలున్నంత మాత్రాన జాతీయ చిహ్నాన్ని అవమానించినట్టుగా కాదన్నది మోదీ భక్తుల వాదన.


ఏ సింహం ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుంది? శాంత సింహమా, రౌద్రసింహమా అని ప్రశ్నించాడో మేధావి. అశోకుడి సింహాలు ధర్మంమీద నిలబడతాయనీ, మోదీ రౌద్రసింహాలు తామే ధర్మమన్నట్టు నిలబడ్డాయని భాష్యం చెప్పాడు మరో పెద్దమనిషి. గుజరాత్ సింహం అని అభిమానులు పిలుచుకొనే మోదీకి సింహాలంటే ప్రీతి అనీ, మేకిన్ ఇండియా విజయవంతం అయినా కాకున్నా దాని చిహ్నం కూడా సింహమేనని కొందరు గుర్తుచేస్తూ అందువల్లనే జాతీయచిహ్నం కూడా ఆయన అభీష్టానికి అనుగుణంగా మారిపోయి ఉండవచ్చునంటున్నారు. విగ్రహరూపం నుంచి ఆవిష్కరణ వరకూ ప్రతిఘట్టమూ ఏకపక్షంగా ఉన్నమాట నిజం. ఆయన తరచూ సాష్టాంగపడే పార్లమెంటు భవనం మీద ఏర్పాటైన ఈ చిహ్నం ఆవిష్కరణ కార్యక్రమంలో కార్యనిర్వాహక వ్యవస్థ అధిపతిగా తనతోపాటు శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థల అధిపతులు కూడా ఉండాలని ఆయనకు తెలియదనుకోలేం. దూరంగా స్పీకర్ తప్ప, పార్లమెంటుకు ఎన్నికయ్యే ఉభయసభ సభ్యులు, రాష్ట్రపతి, రాజ్యసభకు పెద్దగా వ్యవహరించే ఉపరాష్ట్రపతి, విపక్షనేతల జాడే లేకపోయింది. రెండేళ్ళక్రితం కొత్త పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేస్తున్నప్పుడు కూడా ఇంతే. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు, రాజ్యాంగ విలువలకు ప్రతీక అయిన ఓ చిహ్నాన్ని ఆవిష్కరిస్తున్నప్పుడు ఆ కార్యక్రమం అందరి సమక్షంలో జరగడం న్యాయం. అలా జరగకపోగా, రాజ్యాంగ అభీష్ఠానానికి వ్యతిరేకంగా దీనిని ఓ మతకార్యక్రమంలాగా నిర్వహించడం మరో విచిత్రం. కండలు తిరిగి, ఉబ్బిన రక్తనాళాలతో గర్జిస్తున్నట్టు కనిపించే ఈ సింహాలకూ అశోకస్తంభం మీద ఉన్న ఆ సింహాలకూ పోలిక ఉన్నదా లేదా అన్న చర్చ అనవసరం. హుందాగా, రాజసంగా ఆత్మవిశ్వాసాన్ని ప్రతిఫలించే ఆ సింహాలకూ, దూకుడుగా మీద పడి రక్కేట్టుగా ఉన్న ఈ సింహాలకు పోలికయేమిటని వాపోవడం వృధా. ఎంతో ప్రేమగా మీరు తయారుచేసుకున్న అతిపెద్ద పటేల్ విగ్రహం ఎత్తు పెరిగినంతనే పోలికలు కోల్పోయిందా అన్న ప్రశ్నా అక్కరలేదు. ‘సింహానికి దంతాలున్నాయి కనుక అది ఎదుటివారికి చూపిస్తుంది, అది కొరుకుతుంది, దాడిచేస్తుంది’ అని ఒక్కముక్కలో లెక్కతేల్చేశారు ‘కశ్మీర్ ఫైల్స్’ అనుపమ్ ఖేర్. అశోకుడి సింహాలకు కోరలొచ్చాయనీ, కండలొచ్చాయనీ బాధపడుతున్నవారు ఈ కొత్తచిహ్నాన్ని అగ్రభారతానికి కాక ఉగ్రభారతానికి ప్రతీకగా స్వీకరించి సరిపెట్టుకోవాలని ఖేర్ సూచన సారాంశం కావచ్చు. జాతీయజెండాను చేతితో వడికిన నూలుతోనే తయారుచేయాలన్న నిబంధనను మోదీ ప్రభుత్వం ఇటీవల సవరించింది. ఇకపై యంత్రాలతో పాలిస్టర్ జెండాలు తయారుచేసి వాడుకోవచ్చని ప్రకటించడం ద్వారా మహాత్ముడితో జాతీయ జెండాకు ఉన్న ఆ బంధాన్ని కూడా తెంపేసింది. ఇప్పుడు జాతీయచిహ్నం విషయంలోనే కాదు, భవిష్యత్తులో చోటుచేసుకోబోయే విపరిణామాలను కూడా ఇలాగే సరిపెట్టుకోవాలేమో.

Updated Date - 2022-07-15T10:36:22+05:30 IST