స్టిరాయిడ్స్‌తో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌!

ABN , First Publish Date - 2021-05-11T05:30:00+05:30 IST

కొవిడ్‌ నుంచి కోలుకున్న కొందర్లో ‘బ్లాక్‌ ఫంగస్‌’ అనే పేరున్న, మ్యూకోర్‌మైకోసిస్‌ అనే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ బయల్పడుతోంది. ఈ ఫంగస్‌ మన పర్యావరణంలోనే కలిసి ఉంటున్నా...

స్టిరాయిడ్స్‌తో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌!

కొవిడ్‌ నుంచి కోలుకున్న కొందర్లో ‘బ్లాక్‌ ఫంగస్‌’ అనే పేరున్న, మ్యూకోర్‌మైకోసిస్‌ అనే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ బయల్పడుతోంది. ఈ ఫంగస్‌ మన పర్యావరణంలోనే కలిసి ఉంటున్నా, ఆరోగ్యకరమైన వ్యక్తుల శరీరంలోకి ప్రవేశించలేవు. అయితే ఏదైనా వ్యాధి బారిన పడి ఆరోగ్యం సన్నగిల్లి, సూక్ష్మక్రిములతో పోరాడే శక్తి లేనివాళ్లకు, వ్యాధినిరోధకశక్తి తగ్గినవాళ్లకు ఈ ఫంగస్‌ తేలికగా సోకుతుంది. మరీ ముఖ్యంగా కొవిడ్‌ సోకి, చికిత్స తీసుకుని ఆరోగ్యం సన్నగిల్లిన వారికి కూడా ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశాలు ఎక్కువ. ఇందుకు కారణం కొవిడ్‌ చికిత్సలో భాగంగా స్టిరాయిడ్లు తీసుకోవడంతో, వాటి వల్ల శరీరంలో వ్యాధినిరోధకశక్తి సన్నగిల్లడమే! ఫలితంగా కొవిడ్‌ నుంచి కోలుకోగలిగినా, ఈ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకడానికి అనువైన వాతావరణం శరీరంలో నెలకొంటోందని వైద్యులు అంటున్నారు. కాబట్టే కొవిడ్‌ నుంచి కోలుకున్న కొందరిలో ఈ ఇన్‌ఫెక్షన్‌ బయల్పడుతోంది. ముఖంలో స్పర్శ కోల్పోవడం, ముక్కులో అడ్డంకి ఏర్పడినట్టు అనిపించడం, కళ్లు వాపులు, లేదా నొప్పి ఈ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ ప్రధాన లక్షణాలు. స్ట్టిరాయిడ్‌ చికిత్సతో పాటు, కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌తో సన్నగిల్లిన ఆరోగ్యం, ఇతరత్రా రుగ్మతలు, బలహీనతల కారణంగా ఈ ఫంగస్‌ వీరి శరీరంలోకి ప్రవేశిస్తున్నట్టు వైద్యులు భావిస్తున్నారు. కాబట్టి కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్న బాధితులు ఈ ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించిన లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లడం అవసరం.


Updated Date - 2021-05-11T05:30:00+05:30 IST