‘అంతిమ’ బాంధవులు

ABN , First Publish Date - 2021-05-06T08:46:17+05:30 IST

పక్కింట్లో కరోనా రోగి ఉంటే ముందుంటి తలుపులు మొత్తం మూసేసుకుంటున్నారు. ఇక ఆస్పత్రుల్లో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారు అనాథలుగానే శ్మశానాలకు తరలిపోతున్నారు

‘అంతిమ’ బాంధవులు

కొవిడ్‌ మృతదేహాలకు మానవత్వంతో సంస్కారాలు

సెకండ్‌వేవ్‌లో శ్మశానాలకు గుట్టలుగా మృతదేహాలు

ఆప్తులు వెంట లేకుండానే చితులపైకి ఎందరో..

చలించి కదులుతున్న సంస్థలు, వ్యక్తులు

మతాచారాలు పాటిస్తూ గౌరవప్రదంగా క్రతువు

తరలించడానికి వాహనాలనూ కొన్న వైనాలెన్నో..

కడపలో ఒక్కరే 200 మందికి అంత్యక్రియలు

తిరుపతిలో రెండు అంబులెన్స్‌లతో సేవలు..

‘ఫేస్‌బుక్‌’ వేదికగా విజయనగరం కుర్రాళ్ల  కృషి


పది మంది ఉన్నా పలకరించలేని పరిస్థితి. కన్నెత్తి చూస్తే ‘కాటు’ పడుతుందేమోనన్న భయం. కరోనా తీసుకొచ్చిన పోకడలివి. బతికుండగానే అందరూ ఉన్న బాధితులను సైతం అది ‘అనాథ’లను చేసేస్తోంది. ఇక చనిపోతేనో? ఆ మృతదేహాలకు దిక్కెవరు? తలుచుకొంటేనే హృదయాన్ని మెలిపెట్టే ఈ ప్రశ్నకు మనసున్న వారంతా సమాధానమై నిలుస్తున్నారు. తమకు ఏమీ కాకపోయినా.. తుది వీడ్కోలులో తోడుంటూ.. దగ్గరుండి అంతిమ సంస్కారాలు జరిపిస్తున్నారు. ఇంత కష్టంలోనూ ఒకింత ఊరటనిస్తున్న అంశం ఇది!


(ఆంధ్రజ్యోతి - న్యూస్‌నెట్‌వర్క్‌)

పక్కింట్లో కరోనా రోగి ఉంటే ముందుంటి తలుపులు మొత్తం మూసేసుకుంటున్నారు. ఇక ఆస్పత్రుల్లో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారు అనాథలుగానే శ్మశానాలకు తరలిపోతున్నారు. రక్త సంబంధీకులు చివరి చూపునకూ ముందుకు రావడం లేదు. ఇటువంటి మృతదేహాలకు వారంతా ఆత్మబంధువులవుతున్నారు. ధార్మిక సంస్థలు, స్వచ్ఛంద సంఘాలు ఇప్పటికే కొవిడ్‌ మృతదేహాలను ఆస్పత్రుల నుంచి స్వీకరించి గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిపిస్తున్నాయి. కొవిడ్‌ తొలి దశలో శ్మశానవాటికల్లో ఈ సంస్థలే ప్రధానంగా అన్నీ అయి సేవలు అందించాయి. అయితే, కొవిడ్‌ తొలిదశతో పోల్చలేనివిధంగా సెకండ్‌ వేవ్‌ ఉధృతి భయపడుతోంది. పాజిటివిటీ మాత్రమే కాదు.. పోతున్న ప్రాణాల సంఖ్యా అత్యధికమే. దీంతో పట్టణాలు, నగరాలు, చిన్న టౌన్లు.. ఇలా రాష్ట్రమంతా కొత్త కొత్త సంఘాలు, యువకుల బృందాలు ముందుకొస్తున్నాయి. అలాంటి ఒక బృందమే ‘విజయవాడ హెల్పింగ్‌ హ్యాండ్స్‌’. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఫొటోగ్రాఫర్‌ చందన వెంకట్‌ తన స్నేహితులతో కలిసి ఏర్పాటు చేసిన సంస్థ ఇది. తమ పేరుతో ఫేస్‌బుక్‌ పేజీని ఈ బృందం నిర్వహిస్తోంది. హోమ్‌ ఐసొలేషన్‌లో ఉండి చనిపోయినవారి మృతదేహాలకు సాయం పట్టేందుకు సాధారణంగానే ఎవరూ ముందుకు రారు. అంతిమయాత్ర రథం ఎక్కించడానికి, శ్మశానవాటికలకు తరలించడానికి ముందుకొచ్చే వారి కోసం వెతుక్కోవాల్సి వస్తోంది. ఇంట్లో సాధారణ స్థితిలో మరణించినా కరోనాతో చనిపోయారన్న భయంతో పక్కింట్లో వాళ్లూ బయటకు రావడం లేదు. కరోనా కాటుకు బలైపోయిన వారికి, అనాథలుగా కన్నుమూసిన వారికి ‘హెల్పింగ్‌ హ్యాండ్స్‌’ దగ్గరుండి దహన సంస్కారాలను జరిపిస్తోంది. కొంతమంది ఆస్పత్రుల్లో మరణిస్తే, వారి కుటుంబీకులు మృతదేహాన్ని శ్మశానవాటిక వరకు వాహనాల్లో పంపేస్తున్నారు. అంతిమసంస్కారాలు నిర్వహణకు రావడానికి నిరాకరిస్తున్నారు. ఆపై జరగాల్సిన పనులను ఈ బృందం పూర్తి చేస్తోంది. సెకండ్‌ వేవ్‌ మొదలయ్యాక ఇప్పటిదాకా 45 మృతదేహాలకు అంతిమ సంస్కారాలు జరిపిందీ ఈ బృందం. ‘‘కరోనాతో చనిపోయిన వారికి వెనుక కుటుంబ సభ్యులు ఉంటున్నారు. ఆయనకు ఎవరూ లేరు.. అనాథ అని వాళ్లే మాకు ఫోన్‌ చేస్తున్నారు. కనీసం మరణించిన వ్యక్తిపై కడసారిగా వస్త్రం కప్పడానికీ ముందుకు రావడం లేదు’’ అని వెంకట్‌ వాపోయారు. 

   

‘రక్త’ బంధువే ఆత్మబంధువై..

కరోనా సమయంలో పాజిటివ్‌ వ్యక్తులకు సేవ చేయాలంటే పెద్ద మనసుండాలి. కానీ, పాజిటివ్‌ అని తేలిన క్షణం నుంచీ అన్నీ తానే అయి సంజీవని సంస్థ సభ్యులు సేవలందిస్తారు. కొవిడ్‌ మృతదేహాలకు మతాచారాలతో అంత్యక్రియలు జరుపుతారు. ఈ సంస్థను నిర్వహిస్తున్న రమణారెడ్డికి ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తే చాలు.. బాధితుల సమస్య ఆయనదవుతుంది. 2005లో అనంతపురంలో ప్రారంభమైన సంజీవని...తొలుత రక్తదానం కార్యక్రమాలు నిర్వహించేది. ఇప్పటివరకూ 5వేల మందికిపైగా రక్తదాతల నుంచి రక్తదానం చేయించామని రమణారెడ్డి తెలిపారు. అయితే, 2020 మార్చి నెలలో కరోనా వైరస్‌ విజృంభణ మొదలవ్వడంతో రమణారెడ్డి దృష్టి మరింత విశాలమయింది. రక్తదానాలకు పరిమితమైన ‘సంజీవని’ సేవలు కరోనా బాధితుల మంచిచెడ్డలు చూడటం నుంచి మరణిస్తే జరగాల్సిన అంత్యక్రియలు జరిపేంతవరకూ విస్తృతమయ్యాయి. ఇప్పటివరకూ 200 అనాథ మృతదేహాలకు సంజీవని బృందం అంతిమ సంస్కారాలు నిర్వహించింది. 


ఐదుగురు.. 170 అంత్యక్రియలు

ఆస్పత్రుల్లో పడకలు ఖాళీ లేవు! చనిపోతే శ్మశానవాటికలు ఖాళీ లేవు...ఎటుచూసినా మండుతున్న చితిమంటలు! కారుచీకట్లు! అంత చీకటిలోనూ ఒక అడుగు ముందుకుపడింది. ఆ అడుగుకు మరో నాలుగు అడుగులు జతకలిశాయి. ఈ ఐదుగురు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇప్పుడు మానవత్వానికి నిలువెత్తు మూర్తులుగా నిలిచారు. కరోనా బారినపడి మృతిచెందినవారు అనాథలుగా పడి ఉండటం చూసి అమీర్‌ పాషా చలించిపోయారు. తొలిరోజుల్లో ఒక్కడే వాటికి అంత్యక్రియలు జరిపించేవారు. క్రమంగా భరత్‌ రాఘవ మల్లిశెట్టి, ఎండీ అక్రమ్‌, జమ్మి కుమార్‌బాబు, ఎండీ రమీజ్‌ అనే నలుగురు మిత్రులు ఒక్కొక్కరుగా ముందుకొచ్చారు. ఈ పనిలో అమీర్‌పాషా వెంట నిలుస్తున్నారు. వీరు ఇప్పటికి 170 కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు జరిపించారు. ఒక్క సెకండ్‌ వేవ్‌లోనే 60 మృతదేహాలు వీరి చేతుల మీదుగా అంతిమ సంస్కారాలు జరుపుకొన్నాయి. మృతి చెందినవారు హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు... ఎవరైనా వారి మత సంప్రదాయాల ప్రకారమే అంత్యక్రియలు జరిపిస్తారు. మృతదేహాలను టాటా ఏస్‌ వాహనంలో శ్మశానవాటికకు తరలిస్తారు. ప్రస్తుతం రోజుకు నాలుగుకి తగ్గకుండా కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు జరుపుతున్నట్టు అమీర్‌ పాషా తెలిపారు. పీపీఈ కిట్లు ధరించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని చెప్పారు. 


మానవత్వానికి టెక్నాలజీ జోడించి..

విజయనగరం పట్టణంలో ఉంటున్న 20 మంది కలసి విజయనగరం యూత్‌ ఫేస్‌బుక్‌ సభ్యులుగా ఏర్పడ్డారు. విజయనగరం పట్టణం, చుట్టుపక్కల మండలాల్లో ఎక్కడ... ఎవరు మృతి చెందినా తమకున్న నెట్‌వర్క్‌ ద్వారా సమాచారం తెలుసుకొని స్పందిస్తున్నారు. అక్కడకు చేరుకొని మృతదేహాలను స్వాధీనపరుచుకొని విజయనగరంలోని దాసన్నపేట స్మర్గధామానికి చేర్చుతున్నారు.  సెకండ్‌వేవ్‌లో 21 మృతదేహాలకు అంత్యక్రియలు జరిపించినట్టు అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఈ బృందం సభ్యుడు నడుకూరి ఈశ్వరరావు తెలిపారు. 


సంప్రదాయం చెదరకుండా..

తిరుపతిలోని యునైటెడ్‌ ముస్లిం అసొసియేషన్‌ ప్రతినిధులు కొవిడ్‌-19 జేఏసీ పేరిట అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. కరోనా తొలి విడతలో ఈ జేఏసీ పురుడు పోసుకుంది. కొవిడ్‌తో చనిపోయిన ముస్లింలకు తమ మతానికి విరుద్ధంగా అంత్యక్రియలు చేస్తున్నారని అప్పట్లో కొందరు మతపెద్దలు అసంతృప్తి చెందారు. దీనిపై ఆలోచించి తిరుపతి యునైటెడ్‌ ముస్లిం అసొసియేషన్‌గా ఏర్పడిన కొందరు యువకులు.. ఎస్వీ మెడికల్‌ కాలేజీ మార్చురీ విభాగాన్ని సంప్రదించారు. తమ మతాచారం ప్రకారం అంత్యక్రియలు చేసుకోవడానికి మృతదేహాలను అప్పగించాలని కోరారు. అందుకు కలెక్టర్‌ అనుమతించడంతో.. నిబంధనలను పాటిస్తూ ఈ సంస్థ సభ్యులు మతాచారాలతో మృతదేహాలను ఖననం చేస్తున్నారు. మృతదేహాలను తరలించడంలో కొంతకాలానికి ఆర్థిక సమస్యలు తలెత్తాయి. ఈ సంస్థను ప్రారంభించిన జేఎం గౌస్‌, నలుగురు ఆయన మిత్రులు చిరువ్యాపారులు. అయితే,  దాతల సాయంతో ఈ సమస్యను అధిగమించారు. విరాళాలుగా అందిన రూ. 22లక్షలతో రెండు అంబులెన్సులను సమకూర్చుకొన్నారు. బుధవారం ఒక్కరోజే 21మంది కొవిడ్‌ మృతులకు అంత్యక్రియలు జరిపించారు. 


అనాథ శవాలకు ఎమ్మెల్యే అంతిమ సంస్కారాలు

కరోనాతో పోరాడి మృత్యు ఒడికి చేరిన 21 మంది.. అంతిమ సంస్కారాలకు నోచుకోకపోవడంతో మార్చురీలో అనాథ శవాలుగా మిగిలిపోయాయి. వీరికి బుధవారం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి స్వయంగా దగ్గరుండి అంతిమ సంస్కారాలు జరిపించి మానవత్వం చాటుకున్నారు. 


ఊరికో మనసున్న మారాజు..

మనిషి చనిపోతే చివరి చూపుకంటూ దగ్గరి వారే కాక, తెలిసిన ప్రతి ఒక్కరూ వెళతారు. కరోనా ఇప్పుడు ఇలాంటివేమీ లేకుండా చేసింది. ఆఖరి చూపుకు కాదు కదా.. అంత్యక్రియలు జరపడానికీ మనుషులు కరువయిన స్థితి.  అలా అనాథల్లా మిగిలిపోతున్న కరోనా బాధితుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ.. కర్నూలు జిల్లావ్యాప్తంగా ఏర్పడిన పలు స్వచ్ఛంద సంస్థలు మానవత్వం చాటుకొంటున్నాయి. కరోనాతో మృతి చెంది, అంత్యక్రియలు చేయడానికి ఎవరూ లేరని ఫోన్‌ చేస్తే చాలు.. సోషల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఎ్‌సడీపీఐ) సభ్యులు ముందుకు వస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ సంస్థ ఆధ్వర్యంలో 11 బృందాలు పనిచేస్తున్నాయి. ఒక్కొక్క బృందంలో 15 మంది ఉంటూ, విడతలవారీగా పనిచేస్తున్నారు. మొదటి వేవ్‌లో ఈ సంస్థ మొత్తం 118 మందికి అంత్యక్రియలు నిర్వహించగా, సెకండ్‌ వేవ్‌లో ఇప్పటి వరకు 27 మృతదేహాలకు అంతిమ సంస్కారాలు  జరిపించింది. డోన్‌ పట్టణం కేంద్రంగా పనిచేస్తున్న స్ఫూర్తి సేవా సమితి.. మొదటి వేవ్‌లో ఆరుగురికి అంత్యక్రియలు జరిపింది. ఇక.. పాపులర్‌ ఫ్రంట్‌ఆఫ్‌ ఇండియా ఎమ్మిగనూరు శాఖ అధ్యక్షులు జాహీర్‌ అహ్మద్‌ పదిరోజుల క్రితం ఎమ్మిగనూరు పట్ణణంలో నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. ‘మేమున్నాం’ అంటూ పలువురు వ్యక్తులూ ముందుకు వస్తున్నారు. ఆళ్లగడ్డకు చెందిన ఈపనగండ్ల శ్రీనివాసులు మొదటి వేవ్‌లో 10 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు.


పెరిగిన మరణాలతో చలించి..

‘‘సెకండ్‌వేవ్‌లో పెరిగిపోయిన మృతుల సంఖ్య చలింపచేస్తోంది. వారికి గౌరవంగా అంత్యక్రియలు జరిగేందుకు మా తోడ్పాటును అందిస్తున్నాం. ఏ అవసరమొచ్చినా 7989474725 నంబరులో మమ్మల్ని సంప్రదించవచ్చు’’

- మధు, స్ఫూర్తి సేవా సమితి నిర్వహకుడు, డోన్‌


పీపీఈ కిట్లు ఇస్తే మరింత సేవ..

‘‘కరోనాబారిన పడి దిక్కులేని వారి మృతదేహాలను శ్మశాన వాటికకు చేర్చుతున్నాం. పీపీఈ కిట్లు సొంతంగా సమకూర్చుకొని  అంతిమ సంస్కారాలు చేస్తున్నాం. పీపీఈ కిట్లు సర్కారు అందిస్తే మరింత మందికి సాయం చేయగలుగుతాం’’ 

- షేక్‌ ఇల్తమాశ్‌, విజయనగరం

Updated Date - 2021-05-06T08:46:17+05:30 IST