శోకసంద్రంగా గంట్యాడ

ABN , First Publish Date - 2021-04-17T05:37:44+05:30 IST

గంట్యాడ శోకసంద్రంగా మారింది. గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విశాఖలో అనుమానాస్పదంగా మృతిచెందిన సంగతి తెలిసిందే. వారి మృతదేహాలకు శుక్రవారం గంట్యాడలో అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామస్థులు, బంధువులు, వివిధ రాజకీయ పక్ష నేతలు

శోకసంద్రంగా గంట్యాడ
మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న దృశ్యం




ఎన్‌ఆర్‌ఐ కుటుంబసభ్యులకు అంత్యక్రియలు

కన్నీరుమున్నీరైన గ్రామస్థులు, కుటుంబసభ్యులు

గంట్యాడ, ఏప్రిల్‌ 16: గంట్యాడ శోకసంద్రంగా మారింది. గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విశాఖలో అనుమానాస్పదంగా మృతిచెందిన సంగతి తెలిసిందే. వారి మృతదేహాలకు శుక్రవారం గంట్యాడలో అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామస్థులు, బంధువులు, వివిధ రాజకీయ పక్ష నేతలు,  పరిసర గ్రామ ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఘన నివాళులర్పించారు. వారి విషాదాంతాన్ని తలచుకొని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గంట్యాడ సమితి మాజీ అధ్యక్షుడు, దివంగత సుంకరి శ్రీరాములనాయుడు నాలుగో కుమారుడు సుంకరి బంగారునాయుడు. ఆయన భార్య డాక్టర్‌ నిర్మల, పెద్ద కుమారుడు దీపక్‌, చిన్నకుమారుడు కశ్యప్‌ విశాఖలోని మధురవాడలో గురువారం అనుమానాస్పదంగా మృతిచెందారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం శుక్రవారం సాయంత్రం గంట్యాడకు తీసుకొచ్చారు. గ్రామ సమీపంలోని సొంత కల్లంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. గజపతినగరం మాజీ ఎమ్మెల్యే డాక్టరు కెఏ నాయుడు, మాజీ ఎంపీపీలు కొండపల్లి కొండలరావు, వర్రి నర్సింహమూర్తి, గజపతినగరం ఏఎంసీ చైర్మన్‌ వేమలి ముత్యాలునాయుడు తదితరులు హాజరయ్యారు. మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం కావడంతో పరిసర గ్రామాల ప్రజలు పెద్దఎత్తున హాజరయ్యారు. గంట్యాడ ఎస్‌ఐ బి.గణేష్‌తో పాటు సిబ్బంది వారిని అదుపుచేసే  ప్రయత్నం చేశారు. మృతదేహాలను చూసిన వెంటనే గ్రామస్థులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. బంగారునాయుడు సోదరుడు రామునాయుడు చితికి నిప్పంటించారు.





Updated Date - 2021-04-17T05:37:44+05:30 IST