ఖననం..గగనం..!

ABN , First Publish Date - 2020-07-04T10:51:22+05:30 IST

జిల్లాలో కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలు నిర్వహించడం అధికారులకు కష్టతరంగా మారింది.

ఖననం..గగనం..!

కరోనా మృతుల అంత్యక్రియలకు అవస్థలు

తలలు పట్టుకుంటున్న అధికారులు


ఒంగోలు (క్రైం), జూలై 3 : జిల్లాలో కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలు నిర్వహించడం అధికారులకు కష్టతరంగా మారింది. పలు ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు ఎదురుకావడంతో వారికి కత్తి మీద సాములా మారింది. నాలుగురోజులుగా ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తి మృతదేహం ఖననం చేయడం వివాదాస్పదంగా మారింది. ఆ మృతదేహాన్ని ఇప్పటికే నాలుగు ప్రాంతాలకు తీసుకెళ్లగా అక్కడ స్థానికులు అడ్డుకోవడం, తిరిగి రిమ్స్‌ మార్చురీకి తరలించడం జరిగింది. కరోనా బాధిత మృతదేహాలు రెండు ఇంకా రిమ్స్‌లో ఉన్నాయి. యర్రజర్ల వద్ద ఖననం చేసేందుకు మృతదేహాన్ని తీసుకెళ్లడంతో అక్కడ నాలుగు గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. దీంతో గురువారం రాత్రి ఒంగోలులోని శ్రీనివాస థియేటర్‌ సమీపంలోని శ్మశానవాటికలో ఖననం చేయాలని తాలుకా సీఐ లక్ష్మణ్‌ అక్కడకు చేరుకున్నారు. ఆ ప్రాంత ప్రజలూ రోడ్డెక్కారు. అర్ధరాత్రి వరకు అక్కడ పరిస్థితి అనుకూలించకపోవడంతో అక్కడ నుంచి వెనుదిరిగారు. ఇ లా నాలుగు రోజులుగా ఒక మృతదేహం ఖననం చేయడం అధికారులకు కష్టతరంగా మారింది. ఇంకా రిమ్స్‌లో ఉన్న మరో రెండు మృతదేహాల పరిస్థితి ఏమిటని అధికార యంత్రాంగం తర్జనభర్జనపడుతోంది. కరోనాతో మృతి చెందిన వారిని ప్రభుత్వమే ఖననం చేయాల్సి ఉంది.  ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో కరోనా వచ్చిన వారికి చికిత్సలు చేయడం ఒక ఎత్తు అయితే, అలాంటి వారు మరణిస్తే అంత్యక్రియలు కష్టతరంగా మారడం పెద్ద తలనొప్పిగా మారింది. మృతి చెందిన వారికి ఘన వీడ్కోలు పలకాల్సిన సమాజం ఖననం చేసేందుకు అంగీకరించకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


తూర్పుపాలెం వాసులు రాస్తారోకో

కొత్తపట్నంరోడ్డులోని ఖబరస్థాన్‌లో ఓ మృతదేహాన్ని శుక్రవారం ఖననం చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న తూర్పుపాలెంవాసులు కొత్తపట్నం వెళ్లే రోడ్డుపై కొద్దిసేపు రోస్తారోకో నిర్వహించారు. తమ ప్రాంతంలో కరోనా బాధిత మృతదేహాలను ఖననం చేయవద్దని, నిబంధనల ప్రకారం 9 అడుగులు గొయ్యి తీయాల్సి ఉంటే కనీసం మూడు అడుగులు తీసి ఖననం చేయడం వల్ల ఇబ్బంది కలిగే ప్రమాదం ఉందని వాపోయారు. సంఘటనా స్థలానికి  సీఐ రాజేష్‌ వెళ్లి ఆందోళనకారులతో చర్చించి రాస్తారోకోను విరమింపజేశారు.

Updated Date - 2020-07-04T10:51:22+05:30 IST