ఆందోళనల నడుమ అంత్యక్రియలు

ABN , First Publish Date - 2020-10-17T06:15:47+05:30 IST

అత్యాచారయత్నానికి గురై కామాంధుడి పెట్రో మంటలకు తీవ్ర గాయాలపాలైన బాలిక 28 రోజులపాటు మృత్యువుతో

ఆందోళనల నడుమ అంత్యక్రియలు

బాలిక మృతదేహాన్ని సందర్శించిన మంత్రి పువ్వాడ

రూ. రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేత 

రూ. 25 లక్షలు, మూడెకరాల భూమి ఇవ్వాలంటూ మహిళా సంఘాల ఆందోళన

28 రోజులపాటు మృత్యువుతో పోరాడి కన్నుమూత

కామంధుడి అఘాయిత్యానికి బలైన చిన్నారి


ఖమ్మం రూరల్‌, అక్టోబరు 16: అత్యాచారయత్నానికి గురై కామాంధుడి పెట్రో మంటలకు తీవ్ర గాయాలపాలైన బాలిక 28 రోజులపాటు మృత్యువుతో పోరాడి హైదరాబాద్‌లో మృతిచెందిన ఖమ్మానికి చెందిన బాలిక అంత్యక్రియలు ఆందోళన నడుమ సాగాయి. మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, మూడెకరాల భూమి ఇవ్వాలంటూ  మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు మృతదేహం అంత్యక్రియలు నిర్వహించకుండా నిరసన తెలిపారు. కాగా బాలిక మృతదేహాన్ని మంత్రి పువ్వాడ, ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ సందర్శించి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులకు అంత్యక్రియలకు రూ. 25వేలు, ఎక్స్‌గ్రేషియాగా రూ. రెడు లక్షల చెక్కును అందించారు.  వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలం పల్లెగూడేనికి చెందిన దంపతులకు ఆరుగురు కుమార్తెలు.


కరోనా కారణంగా ఉపాధి కోల్పోవడంతో కుటుంబం ఆర్థికంగా కష్టాల్లో పడింది. దీంతో ఎలాగూ పాఠశాలలు కూడా లేవన్న భావనతో ఆ దంపతులు తమ 12ఏళ్ల రెండో కూతురిని ఖమ్మం నగరంలోని ముస్తాఫానగర్‌ పార్శీబంధం ప్రాంతానికి చెందిన అల్లం సుబ్బారావు అనే వ్యక్తి ఇంట్లో పనికి కుదిర్చారు. దీంతో ఆ బాలిక ఆ ఇంట్లోనే ఉంటూ పని చేస్తోంది. ఈ క్రమంలో గత నెల 18న ఆ బాలికకు నిప్పు అంటుకోవడంతో ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చామని బాలిక తల్లిదండ్రులకు యజమాని కుటుంబం నుంచి ఫోన్‌లో సమాచారం అందింది. అప్పటి నుంచి చికిత్స పొందుతూ కోలుకున్న ఈనెల 5న జరిగిన ఘటనను తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఖమ్మం వన్‌టౌన్‌ పోలీసులు ఫిర్యాదు చేశారు. 

 

ఆందోళన నడుమ స్వగ్రామంలో అంత్యక్రియలు

28 రోజులుగా మృత్యువుతో పోరాడిన బాలిక చివరికి ఓడిపోయి మృత్యవు ఒడిలోకి చేరింది.. మృతిచెందిన బాలిక మృతదేహన్ని శుక్రవారం మధ్యాహానికి తన స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. బాలిక మృతదేహాన్ని  రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డి,  కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌, ఎంపీపీ బెల్లం ఉమా, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్‌, జడ్పీటీసీ వరప్రసాద్‌  బాలిక మృత దేహన్ని సందర్శించి నివాళులర్పించారు. బాలిక అంత్యక్రియలకు రూ. 25వేలు, రూ. రెండు లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం తరపున అందించారు. ప్రభుత్వం తరుపున బాధిత కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో పలువురు మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలు అడ్డుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. బాధిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి, రూ. 25 లక్షల ఎక్స్‌గేషియా ఇవ్వాలని నినాదాలు చేశారు. కాగా బాలిక మృతిలో గ్రామంలో విషాదఛాయలు అలుముకోగా... కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

Updated Date - 2020-10-17T06:15:47+05:30 IST