ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాకే గరుడ వారధికి నిధులు

ABN , First Publish Date - 2020-11-29T05:28:41+05:30 IST

ఆర్థిక పరిస్థితులు మెరుగుపడిన తర్వాత నిధులు మంజూరు చేస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాకే గరుడ వారధికి నిధులు

పద్మావతీ దేవి సూర్యప్రభ వాహనానికి 11 కేజీల బంగారంతో తాపడం

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి


తిరుమల, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న గరుడవారధి ఫ్లై ఓవర్‌ పనులకు  ఈసారీ టీటీడీ నుంచి నిధులు లభించలేదు.పనులను వేగవంతం చేయాలని ఆదేశించామని, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడిన తర్వాత నిధులు మంజూరు చేస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.తిరుమలలో శనివారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం బోర్డు నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు.ఆనంద నిలయం అనంతస్వర్ణమయం పథకాన్ని తిరిగి ప్రారంభించే ఆలోచన లేదని, బంగారం విరాళంగా ఇచ్చిన దాతలకు తిరిగి ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. తిరుచానూరు పద్మావతీ దేవి ఆలయంలో సూర్యప్రభవాహనానికి 11.766 కేజీల బంగారంతో తాపడం పనులు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.తిరుమలలోని ప్రైవేట్‌ సెక్యూరిటీ సిబ్బంది రూ.2 వేలు యూనిఫాం అలవెన్స్‌ మంజురు చేశామన్నారు. టీటీడీ ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్‌ పథకం అమలును వాయిదా వేశామన్నారు. దీనిపై ఉద్యోగులకున్న సందేహాలను నివృత్తి చేసి మరికొన్ని ఆస్పత్రులను దీని పరిధిలోకి తెసుకొచ్చి మెరుగైన వైద్యసేవలు అందిస్తామన్నారు.కొవిడ్‌ కారణంగా కార్యక్రమాలు లేక ఇబ్బంది పడుతున్న అన్నమచార్య ప్రాజెక్ట్‌ కళాకారులకు రూ.10 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చే ప్రతిపాదనను ఆమోదించామన్నారు.తిరుపతి ఎస్వీ బాలమందిరంలో రూ.10 కోట్లతో అదనపు హాస్టల్‌ బ్లాక్‌ నిర్మాణానికి ఆదేశాలిచ్చామన్నారు.తమిళనాడులోని ఊలందూరుపేటలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి బోర్డు సభ్యులు కుమారగురు 4 ఎకరాల భూమి, రూ.10 కోట్ల నగదు విరాళంగా ఇచ్చారన్నారు.టీటీడీ డిపాజిట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీ పఽథకాల్లో పెట్టి అధిక వడ్డీ లభించేలా గతంలో ఆలోచించామన్నారు. అయితే ప్రస్తుతం జాతీయ బ్యాంకులు, కొన్ని షెడ్యూల్డ్‌ బ్యాంకులతో చర్చలు జరిపి డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ లభించేలా చూడాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.  అలాగే గతంలో పేదవాళ్ల కోసం అమలు చేసిన కల్యాణమస్తు కార్యక్రమాన్ని సీఎం చేతుల మీదుగా తిరిగి ప్రారంభిస్తామన్నారు. 

Updated Date - 2020-11-29T05:28:41+05:30 IST