నిధులొచ్చి.. నిర్మాణాలు పూర్తయ్యేనా?

ABN , First Publish Date - 2021-10-18T05:48:16+05:30 IST

షెడ్యూల్‌ కులాల అభివృద్ధి విభాగం (ఎస్‌సీడీడీ) కింద జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు గందరగోళానికి దారితీస్తున్నాయి.

నిధులొచ్చి.. నిర్మాణాలు పూర్తయ్యేనా?
ఏపీలింగోటంలో పిల్లర్లకే పరిమితమైన ఎస్‌సీ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణ పనులు(ఫైల్‌)

 ఎస్‌సీ కమ్యూనిటీ హాళ్లకు నిధుల గ్రహణం
 ఆమోదం లేకుండానే భవనాలకు టెండర్ల నిర్వహణ
ఎంబీ రికార్డ్‌ చేసినా మంజూరు కాని నిధులు
నార్కట్‌పల్లి, అక్టోబరు 17 :
షెడ్యూల్‌ కులాల అభివృద్ధి విభాగం (ఎస్‌సీడీడీ) కింద జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు గందరగోళానికి దారితీస్తున్నాయి. పనులకు ఆర్థిక శాఖ ఆమోదం లేకనే కాంట్రాక్టర్లకు నిధు లు మంజూరు కావట్లేదని తెలుస్తోంది. ఇటీవల జరిగిన జడ్పీ సమావేశంలోనూ ఈ సమస్యపై చర్చకు వచ్చినట్లు సమాచారం. ఎస్‌సీడీడీ కింద జిల్లాలో దాదాపు 125 కమ్యూనిటీ హాళ్లకు 2019లోనే మంజూరు లభించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఐతే రూ.7.5లక్షలు, మండల కేంద్రాల్లో ఐతే రూ.25లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. కమ్యూనిటీ హాళ్ల కోసం దరఖాస్తులు వచ్చిన గ్రామాల్లో తొలుత సాంఘీక సంక్షేమ శాఖ విభాగం అధికారులు క్షేత్రస్థాయి నివేదికలను తెప్పించుకున్నారు. నివేదికల ఆధారంగా అవసరాన్ని గుర్తించి రెవెన్యూ శాఖా అధికారుల సహకారంతో స్థల సమీకరణ చేసి పంచాయితీరాజ్‌ విభాగం అధికారులకు స్వాధీనపర్చారు. ఈ ప్రకారం 83 గ్రామాల్లో పనులు ప్రారంభం కాగా మిగతా వాటికి స్థల సేకరణ జరగలేదు. వీటి నిర్మాణానికి పంచాయతీరాజ్‌ ఈఈ పర్యవేక్షణలో టెండర్లు పిలిచారు. తక్కువ కోట్‌తో టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్లు కమ్యూనిటీ హాళ్లను నిర్మించారు. ఐతే వివిధ దశల్లో ఉన్న భవనాల నిర్మాణానికి సంబంధించి మండల స్థాయి పీఆర్‌ ఏఈఈలు ఎంబీ రికార్డు చేసి బిల్లులు పంపినా పాస్‌ కావడం లేదని తె లుస్తుంది. వీటి నిర్మాణానికి సంబంధించి ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లేదని అధికారులు చెబుతున్నారని కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నా రు. నార్కట్‌పల్లి మండలంలో ఎస్‌సీడీడీ కింద పల్లెపహాడ్‌, నక్కలపల్లి, మాండ్ర, ఏపీలింగోటం, అమ్మనబోలు, చౌడంపల్లి, బెండల్‌పహాడ్‌, నార్కట్‌పల్లి, తొండ్లాయి గ్రామాల్లో ఎస్‌సీ కమ్యూనిటీ హాళ్లు మం జూరవగా అమ్మనబోలు, నార్కట్‌పల్లి, మాండ్రలో భూమి అందుబాటులో ఉన్నా వివిధ కారణాలతో నిర్మాణాలు ప్రారంభించలేదు. మిగతా గ్రామాల్లో నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. టెండర్ల సమయానికి మించి సమయం కావడంతో ప్రస్తుతం పాత ఎస్టిమేషన ధరల్లో కమ్యూనిటీ హాళ్లు పూర్తయ్యేలా లేవని పలువురు కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు.
బిల్లులు రాకుంటే.. ఆత్మహత్యే శరణ్యం

-  గడ్డం వేణుగోపాల్‌రెడ్డి, కాంట్రాక్టర్‌
 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణ పనులకు ఇప్పటి వరకు దాదాపు రూ18లక్షలు వెచ్చించా. కానీ రెండేళ్లవుతున్నా ఒక్క పైసా  బిల్లు రాలేదు. జడ్పీ కార్యాలయానికి వెళ్లి అడిగితే మీరు కడుతున్న ఎస్‌సీ కమ్యూనిటీ హాళ్లకు అసలు ఆర్థిక శాఖ ఆమోదమే లేదని నిధుల మంజూరే లేదని జవాబిచ్చారు. అధికారులు పిలిచిన టెండర్‌తోనే పనులు దక్కించుకుని అప్పులు చేసి కడుతున్నా. నాకు రావాల్సిన బిల్లులు చెల్లించకపోతే ఆత్మహత్యే శరణ్యం.


డీడీ దృష్టికి తీసుకెళ్లాం

- పీఆర్‌ ఈఈ తిరుపతయ్య
ఎస్‌సీడీడీ కింద జిల్లాలో చేపట్టిన ఎస్‌సీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి మండల స్థాయిలో ఏఈలు నమోదు చేసిన ఎంబీలను బిల్లుల కోసం పంపాం. పనులకు ఆర్థికశాఖ ఆమోదం లభించకపోవడంతో నిధులు మంజూరు కాలేదు. దీంతో సాంఘీక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి ఎస్‌సీడీడీ కింద మండలంలో చేపట్టిన భవనాలకు నిధులు మంజూరయ్యేలా ప్రయత్నిస్తాం.


బిల్లుల చెల్లింపు మా బాధ్యత కాదు
 కమ్యూనిటీ హాళ్లకు స్థలాన్ని సేకరించి పంచాయతీరాజ్‌ విభాగం అధికారులకు స్వాధీనపర్చడం వరకే మా బాధ్యత. నిర్మాణం, బిల్లుల చెల్లింపు బాధ్యత పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులదే. జడ్పీ స్థాయి సంఘం సమావేశంలోనూ ఈ సమస్యపై చర్చకు రాగా క్షేత్రస్థాయిలో భవనాల నిర్మాణ ప్రగతి నివేదికను తెప్పించాం. బిల్లుల గందరగోళం సమస్యపై నేను కూడా మా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తా.
- సల్మాభాను, డిప్యూటీ డైరెక్టర్‌



Updated Date - 2021-10-18T05:48:16+05:30 IST