ఆటలకు నిధుల కటకట

ABN , First Publish Date - 2022-08-09T06:12:29+05:30 IST

జిల్లాలో క్రీడా పోటీల నిర్వహణపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఒకటి కాదు..రెండు కాదు అయిదేళ్లుగా ఆటల బిల్లులు రావడం లేదు.

ఆటలకు నిధుల కటకట

- అయిదేళ్లుగా అందని బిల్లులు

 అప్పుల కుప్పలతో తలలు పట్టుకుంటున్న ఎస్‌జీఎఫ్‌ బాధ్యులు

- తప్పని ఎదురుచూపులు

జగిత్యాల, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో క్రీడా పోటీల నిర్వహణపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఒకటి కాదు..రెండు కాదు అయిదేళ్లుగా ఆటల బిల్లులు రావడం లేదు. ఇప్పటికే ఆడించిన ఆటలకు భరించిన బిల్లులు చేతికందక పోవడంతో ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శులకు అప్పులు కుప్ప లు అవుతున్నాయి. దీంతో ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటు న్నారు. జగిత్యాల జిల్లాకు సుమారు రూ. 10.50 లక్షల ఎస్‌జీఎఫ్‌ క్రీడా బిల్లులు రావాల్సి ఉంది. 

స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో...

పాఠశాలల్లో చదువుతో పాటు క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి, గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు అవి తోడ్పడతాయి. వారిలో పోటీతత్వాన్ని పెంపొం దిస్తాయి. ప్రభుత్వం ప్రతీ సంవత్సరం స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీ ఎఫ్‌) ఆధ్వర్యంలో మండల, జిల్లా, జోనల్‌ రాష్ట్ర జాతీయ స్థాయిలో 14, 17, 19 సంవత్సరాల వయస్సుల వారిగా, బాల బాలికలకు వివిధ రకాల ఆటల పోటీలను నిర్వహణకు జిల్లా స్థాయిలో ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శులు రూ. లక్షల నిధులు వెచ్చిస్తున్నారు. 

జగిత్యాల జిల్లాలో ...

జగిత్యాల జిల్లాలో 2018-19 విద్యా సంవత్సరంలోని అక్టోబర్‌లో స్థానిక వివేకానంద స్టేడియంలో రాష్ట్ర ఖోఖో పోటీలు నిర్వహించారు. ఇందులో గెలుపొందిన విద్యార్థులను కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో జరిగిన జాతీయ స్థాయి పోటీలకు తీసుకువెళ్లారు. అదేవిధంగా 2018 నవంబరు లో జిల్లాలోని కోరుట్ల పట్టణంలో రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు నిర్వహిం చారు. ఇందులో గెలుపొందిన క్రీడాకారులను మద్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీలకు తీసుకెళ్లి ఆడించారు. 2019- 20 విద్యాసంవత్సరంలో కరాటే పోటీలు, పెన్సింగ్‌ టోర్నమెంట్‌లను రాష్ట్ర స్థాయిలో నిర్వహించారు. విజేతలను నేషనల్స్‌ పోటీలకు తీసుకెళ్లి ఆడించారు. ఇందులో పెన్సింగ్‌ టోర్నమెంట్‌కు మాత్రమే దాత లభించడంతో ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శికి వ్యయం తప్పింది. మిగిలిన మూడు టోర్నమెంట్‌లకు సొంతంగా వ్యయం చేశాడు. కరోనా వంటి పరిస్థితుల కారణంగా 2020-21, 2021-22 విద్యా సంవత్సరంలో ఎస్‌జీఎఫ్‌ క్రీడా పోటీలను నిర్వహించలేదు. 

ఆర్థిక ఇబ్బందుల్లో నిర్వహణాధికారులు..

జగిత్యాల జిల్లాలో గడిచిన విద్యా సంవత్సరాల్లో ఖర్చు చేసిన నిధులకు చెందిన బిల్లులను ప్రభుత్వానికి సమర్పించారు. ఎస్‌జీఎఫ్‌ నిర్వహించే ఒక్కో రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌కు సుమారు రూ. 3.50 లక్షల వ్యయం అవుతుందన్న అంచనా ఉంది. జిల్లాలో నిర్వహించిన టోర్నమెంట్‌లకు సంబంధించి బిల్లులను సమర్పించినప్పటికీ అయిదేళ్లుగా మంజూరు కాకపోవడంతో నిర్వహణాధికారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొం టున్నారు. తమ గోడును పట్టించుకునే నాథుడు కానరాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. రానున్న రెండు నెలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి క్రీడా పోటీలను ఎస్‌జీఎఫ్‌ నిర్వహించాల్సి ఉంది. పాత బిల్లులు రాకపోవడంతో సతమతమవుతుంటే ప్రస్తుత యేడాది పోటీలు ఎలా నిర్వహించాలని అధికారులు వాపోతున్నారు.

క్రీడా పోటీలపై నీలి నీడలు..

ఎస్‌జీఎఫ్‌ క్రీడా పోటీల నిర్వహణపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. మండల స్థాయి, జిల్లా స్థాయి ఆటల పోటీలను స్థానిక పాఠశాల యాజమాన్యాలు, దాతల సహకారాలతో నిర్వహిస్తుంటారు. వాటి నిర్వహణకు ఎస్‌జీఎఫ్‌కు ఎటువంటి సమస్య, వ్యయం ఉండదు. వాటిలో గెలుపొందిన విద్యార్థులకు జోనల్‌, జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీలకు పంపాలన్నా, ఆ స్థాయి పోటీలు సందర్భానుసారంగా ఇక్కడ నిర్వహించినా రవాణా, నిర్వహణ, జ్ఞాపికలకు, వేదికల ఏర్పాటు, హాజరైన ప్రముఖులకు సన్మానాలు ఇతర ఖర్చులను ఎస్‌జీఎఫ్‌లు భరించాల్సి వస్తోంది. సంబంధిత డబ్బులను ఎస్‌జీఎఫ్‌ సొంతంగా భరించడం గానీ, అప్పు తీసుకొని ఖర్చుచేసి బిల్లులను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. జిల్లాలో ప్రతీ రెండేళ్ల కొకమారు ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి బాధ్య తలను ఒకరికి ప్రభుత్వం అప్పగిస్తుంది. క్రీడల నిర్వహణ భారం కార్యదర్శి మోయాల్సి ఉంటుంది. బిల్లులు వచ్చినప్పుడు తీసుకొని అప్పులు తీర్చుకుంటారు. ఈ క్రమంలో జిల్లాలో 2018-19, 2019-20 సంవత్సరాల్లో ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన అధికారి చేసిన ఖర్చు రూ. 10.50 లక్షల వరకు నేటికి అందలేదు. సుమారు అయిదేళ్లుగా బిల్లు లు రాకపోవడంతో వడ్డీలు పెరిగి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొం టున్నాడు. ఈనేపథ్యంలో వచ్చే రెండు నెలల నుంచి మండల, జిల్లా స్థాయి పోటీలను ప్రారంభించాల్సి ఉండగా జరుగుతాయా..లేవా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

బిల్లులు రావడం లేదు

- శ్రీనివాస్‌, జగిత్యాల జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి

జిల్లాలో 2018-19, 2019-20 సంవత్సరాల్లో ఎస్‌జీఎఫ్‌ ఆద్వర్యంలో మూడు స్టేట్‌ టోర్నమెంట్‌లను నిర్వహించాం. ఇందుకు ఒక్కో టోర్నమెంట్‌ నిర్వహణకు, అందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలకు తెలంగాణ జట్టు తరఫున తీసుకవెళ్లి రావడానికి రూ. 3.50 లక్షల వరకు వ్యయం అయింది. ఇందు కోసం వ్యక్తిగతంగా సమకూర్చడం, రుణాలు తీసుకోవడం వంటివి చేశాను. ఇప్పటికీ సంబంధిత బిల్లులు రాలేదు. 

Updated Date - 2022-08-09T06:12:29+05:30 IST