నిధులు సరే.. నిర్వహణేదీ?

ABN , First Publish Date - 2022-08-04T07:18:32+05:30 IST

నిధులు సరే.. నిర్వహణేదీ?

నిధులు సరే.. నిర్వహణేదీ?
నగరంలోని ఓ ప్రాంతంలో ఖాళీస్థలాలిలా..

క్షేత్రస్థాయిలో కానరాని పారిశుధ్య చర్యలు 

పట్టణాలే కాదు గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి

పొంచి ఉన్న సీజనల్‌ వ్యాధుల ప్రమాదం

ఏటా రూ.కోట్లు ఖర్చుచేస్తున్నా ఫలితం సున్నా 

తనిఖీల్లో ఉన్నతాధికారుల నుంచి వ్యక్తమవుతున్న ఆగ్రహం

నిధుల స్వాహాపై ఆరోపణలు.. ఆడిట్‌లోనూ అభ్యంతరాలు

ఖమ్మం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : ‘వర్షాకాలం.. వ్యాధులు ప్రబలే కాలం. సంబంధిత శాఖల వారు అప్రమత్తంగా ఉండాలి. వ్యాధులు ప్రబలడానికి కారణం పారిశుద్ధ్యం నిర్వాహాణ సక్రమంగా ఉండాలి.’ ఇది ఉన్నతాధికారులు సంబంధిత శాఖల సిబ్బందికి ఇచ్చే ఆదేశాలు. అంతేకాదు ఓ వైపు సమీక్షలు నిర్వహిస్తూనే.. మరోవైపు డ్రేడే కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. పల్లెల నుంచి పట్టణాల వరకు పారిశుధ్య నిర్వహణ కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ చర్యలు కనిపించడం లేదన్న విమర్శలున్నాయి. పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా పట్టణాలు, గ్రామాల్లో అపరిశుభ్రత ఏర్పడి వ్యాధుల ముప్పు పొంచి ఉంది. సీజనల్‌ వ్యాధులు రాకుండా ఎప్పటికప్పుడు పారిశుధ్య చర్యలు చేపట్టాల్సి ఉన్నా దాని నిర్లక్ష్యం చేస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల సిబ్బంది నుంచి మండల స్థాయి అధికారుల వరకు డ్రైడే కార్యక్రమాలకు వెళ్లిన అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందన్న ఆరోపణలున్నాయి. 


బ్లీచింగ్‌ పేరిట బిల్లుల స్వాహా?

పారిశుధ్య నిర్వహణకు గాను ప్రతీ పంచాయతీకి బడ్జెట్‌ నుంచి నిధులను ఉపయోగించుకునే వీలుంది. ఈ క్రమంలోనే ఏటా రూ. కోట్లలోనే ఖర్చు చేస్తుండగా.. అందులో సగం సామగ్రి కొనుగోలుకే ఉపయోగిస్తారు. ప్రతీ పంచాయతీలోనూ బ్లీచింగ్‌, సున్నం, ఫినాయిల్‌ లాంటి వాటిని ఉపయోగించి మురుగుకాల్వలను శుభ్రం చేయడం, నీరు నిల్వ ఉన్న చోట బ్లీచింగ్‌, ఫినాయిల్‌ చల్లడం, తాగునీటి ట్యాంకులను బ్లీచింగ్‌తో శుభ్రం చేయడం, దోమలు వ్యాప్తి చెందకుండా ఫాగింగ్‌ చేయాల్సి ఉంటుంది. కానీ కక్కుర్తి పడుతున్న కొందరు బ్లీచింగ్‌, సున్నం, ఫినాయిల్‌ లాంటివి కొనుగోలు చేయకుండానే చేసినట్టు రికార్డుల్లో చూపి నిధులు స్వాహా చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. చిన్న పంచాయతీల్లో సైతం ఏడాదికి రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నా అపరిశుభ్రత మాత్రం అలాగే ఉంటోంది. అధికారులు తూతూమంత్రంగా చర్యలు చేపడుతున్నారని, గ్రామాల్లో తాగునీటి ట్యాంకులను శుభ్రం చేస్తున్నా పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఎమ్మెల్యేనో, ఎంపీ, మంత్రో గ్రామంలో పర్యటిస్తే అప్పటికప్పుడు పారిశుధ్య చర్యలు చేపట్టి.. వీఐపీ టూర్‌ పేరుతో అదనంగా బిల్లులు డ్రా చేస్తున్నట్టు సమాచారం. కొన్ని చోట్ల అదనంగా రోజువారీ కూలీ కింద కార్మికులను ఉపయోగించుకున్నట్టుగా లెక్కల్లో రాస్తున్నట్టు ఆరోపణలున్నాయి.  పంచాయతీకి మూడు నెలలకు ఐదు బస్తాల సున్నం, బ్లీచింగ్‌ అవసరమైతే రెండు బస్తాలే కొని.. లెక్కల్లో మాత్రం ఐదు బస్తాలు చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫినాయిల్‌, ఫాగింగ్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 


ఆడిట్‌లో వచ్చిన అభ్యంతరాల్లో అత్యధికం అవే.. 

పంచాయతీల్లో ప్రతీసారి జరిగే ఆడిట్‌లో ఎక్కువ మొత్తంలో అభ్యంతరాలు పారిశుధ్య నిర్వహణకు సంబంధించినవే ఉంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బ్లీచింగ్‌, సున్నం, ఫినాయిల్‌ మొదలు వీధిలైట్లు, రోడ్లు ఇలా ఒకటా రెండా.. అక్కడ జరిగే చెల్లింపుల్లో అత్యధికంగా అక్రమంగానే సాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ అనుకున్నవారికి అధిక చెల్లింపుల పేరుతో అడ్డంగా దోచిపెట్టడంతోపాటు, జీఎస్టీ, ఐటీ లాంటి వాటి చెల్లింపులు జరపకుండానే పనులన్నీ చేసినట్టు లెక్కలుండటం లాంటి అక్రమాలు పంచాయతీల్లో కొకొల్లలుగా ఉంటున్నాయన్న వాదన ఉంది. గతంలోనే పంచాయతీల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉండగా.. ఆ ఆరోపణలకు ఆడిట్‌ అధికారులు తెలిపిన అభ్యంతరాలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో సంబంధిత అధికారులు ఆడిట్‌ అధికారులకు ఆమ్యామ్యాలు ముట్టజెప్పడం లేదంటే రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి పాస్‌ చేయించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో జరిగిన ఆడిట్‌లో నేలకొండపల్లి, పెనుబల్లి, తల్లాడ లాంటి మండలాల్లో ఒక్కో మండలానికి సంబంధించి సుమారు 200బిల్లులకు గాను అభ్యంతరాలు తెలిపినట్టు సమాచారం. అయితే కల్లూరు, నేలకొండపల్లి, పెద్దతండా లాంటి మేజర్‌ పంచాయితీల్లో ఈ తరహా అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. 


నగరం, పట్టణాల పరిస్థితీ అధ్వానం

ఖమ్మం నగరంతో పాటు మధిర, సత్తుపల్లి, వైరా లాంటి పట్టణ ప్రాంతాల్లోనూ పారిశుధ్య చర్యల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇక ఖాళీ ప్లాట్లను శుభ్రం చేయించడానికి ప్లాట్ల యజవలకు నోటీసులు జారీ చేసిన అధికారులు పట్టించుకోకపోతే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. కానీ వారి మాటలను సంబంధిత పాట్ల యజమానులు పెడచెవిన పెట్టడంతో.. కొన్ని ప్రాంతాల్లో నగరపాలక సంస్థ అధికారులే శుభ్రం చేయించారు. ఒకటి రెండు చోట్ల బోర్డులు పాతి మమ అనిపించారు. కాగా అలాంటి వేలాది ప్లాట్లు ఖమ్మం నగరం నడిబొడ్డున మురుగు, పిచ్చిమొక్కలతో పందులు, దోమలకు ఆవాసమై కనిపిస్తున్నాయి. అంతేకాదు ఒకటి రెండు డివిజన్లు మినహా బ్లీచింగ్‌ చల్లిన సంఘటనలు లేని పరిస్థితి పట్టణాల్లో నెలకొంది. మురికి కాల్వలు లేకపోవడంతో నీరు రోడ్లపైకి చేరడం, పక్కన ఉన్న ప్లాట్లలో చేరి మురికి కూపాలుగా మారడం జరుగుతున్నాయి. ఫలితంగా ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. 


పారిశుధ్యంపై ప్రత్యేక కార్యాచరణ 

హరిప్రసాద్‌, ఖమ్మం జిల్లా పంచాయతీ అధికారి

జిల్లాలో పారిశుధ్య నిర్వహణకు కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. వర్షాకాలం కావడం, అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తాగునీటి సరఫరా, దోమల నివారణ, డ్రెయినేజీలను శుభ్రం చేయించడం, బ్లీచింగ్‌, ఫాగింగ్‌ లాంటి కార్యాక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే వాటికి సంబంధించి సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మండల, పంచాయతీ అధికారులకు ఆదేశాలిచ్చాం. పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తీసుకుంటాం. బిల్లులకు సంబంధించి ప్రతిదానిని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. 

Updated Date - 2022-08-04T07:18:32+05:30 IST