తుంగభద్ర పుష్కరాలకు నిధుల మంజూరు

ABN , First Publish Date - 2020-09-30T17:06:48+05:30 IST

తుంగభద్ర పుష్కరాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. పుష్కరాలకు..

తుంగభద్ర పుష్కరాలకు నిధుల మంజూరు

నేడు పుష్కర ఘాట్లపై సమావేశం


కర్నూలు(ఆంధ్రజ్యోతి): తుంగభద్ర పుష్కరాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. పుష్కరాలకు గడువు దగ్గర పడుతున్న నిధులు మంజూరు కాని వైనం, ఏర్పాట్లు ఇంకా చేపట్టక పోవడంపై ఈనెల 26న ఆంధ్రజ్యోతిలో ‘ఇక రెణ్నెల్లే’ అన్న శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో ప్రభుత్వం పుష్కర నిధుల విడుదలపై దృష్టి సారించింది. రోడ్ల కోసం తొలి దశలో ఆర్‌అండ్‌బీ శాఖకు రూ.100.80 కోట్లను మంజూరు చేస్తూ రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు మంగళవారం ఉత్వర్వులు జారీ చేశారు. వాస్తవంగా రూ.వెయ్యి కోట్లు కావాల్సి ఉండగా ఇందులో 50 శాతం నిధులే మంజూరు కావచ్చని అధికారులు చర్చించుకుంటున్నారు. ఘాట్ల మరమ్మతుల కోసం ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన రూ.44 కోట్లు పూర్తిగా విడుదల చేయనున్నారు. నవంబరు 20 నుంచి డిసెంబరు 1 వరకు జరగనున్నా తుంగభద్ర పుష్కరాలకు మునిసిపల్‌, కార్పొరేషన్‌, ఇరిగేషన్‌, దేవదాయ, విద్యుత్‌, ఆర్‌డబ్ల్యూ ఎస్‌ వంటి శాఖలు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నాయి.


ఆర్‌అండ్‌బీ శాఖకు తొలుత నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.. తర్వాత ఇరిగేషన్‌శాఖతో బుధవారం సమావేశం కానుంది. రూ.59.16 కోట్ల ప్రతిపాదనలతో ఎస్‌ఈ శ్రీరామచంద్రమూర్తి అమరావతికి చేరుకున్నారు. గురువారం ఆ శాఖకు నిధుల కేటాయింపుపై ఉత్తర్వులు జారీ చేస్తారు. ఆర్థిక పరిస్థితిని చూపిస్తూ పుష్కరాలకు నిధుల కేటాయింపుల్లో కోత విధిస్తారని సమాచారం. వాస్తవానికి ప్రధాన రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారుల మరమ్మతులకు, నిర్మాణాలకు రూ.202 కోట్లతో ప్రతిపా దనలు ఆర్‌అండ్‌బీ ప్రభుత్వానికి ఇటీవలే సమర్పించింది. ఇందులో దక్కింది రూ.100.80 కోట్లే. మిగిలిన శాఖలకూ ఇదే తరహాలో కేటాయింపు ఉంటుందని తెలుస్తోంది. కీలకమైన రోడ్ల వ్యవహారంలోనే 34 పనులకు 50 శాతం నిధులు కేటాయించడం నిధుల కోతకు అద్దం పడు తోంది. ఈ పనుల్లో 26 ఎండీఆర్‌(జిల్లాలోని ప్రధాన రహదారులకు) రూ.67.70 కోట్లు, 8 రాష్ట్ర రహదారుల పనులకు రూ.33.10కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.


రూ.150 కోట్లతో ప్రతిపాదనలు

ఘాట్ల వద్ద బారికేడ్లు, మరుగుదొడ్ల నిర్వహణ, తాత్కాలిక మరుగుదొడ్లు, మంచినీరు, పారిశుధ్యం, ఆక్రమణలు తొలగించడం, మురుగు నీరు తుంగభద్ర నదిలో కలవకుండా అడ్డుకట్ట వేయడం,  పారిశుధ్య కార్మికుల నిర్వహణ, సుందరీకరణలకు  కేఎంసీ, ఎమ్మిగనూరు మునిసిపాలిటీ నుంచి రూ.150 కోట్లతో ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందులో  కేఎంసీ నుంచే రూ.78.10 కోట్ల ప్రతిపాదనలు ఉన్నాయి. కర్నూలు పరిధిలో తొలుత 63 ఘాట్లను ప్రతిపాదించాలని అనుకున్నా 33 ఘాట్లకు రూ.59.16 కోట్లతో జలవనరులశాఖ ప్రతిపాదించింది. ఇందులో ఎమ్మెల్యేలు 28 ఘాట్లకు రూ.44 కోట్లకు పైగా ప్రతిపాదించగా ఆ మొత్తం విడుదలకు ప్రభుత్వం సుముఖంగా ఉందని తెలుస్తోంది. ఇరిగేషన్‌ ప్రతిపాదించిన 5 ఘాట్లకుగాను రూ.14.30 కోట్ల మంజూరు అనుమానమే. 


Updated Date - 2020-09-30T17:06:48+05:30 IST