శంషాబాద్‌ టూ కొత్తూర్‌

ABN , First Publish Date - 2022-01-26T04:20:55+05:30 IST

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న

శంషాబాద్‌ టూ కొత్తూర్‌
ఆరు లేన్ల రహదారిగా మారనున్న రోడ్డు ఇదే..

  • ఆరు లేన్ల రహదారికి నిధులు మంజూరు
  • 12 కిలోమీటర్లు.. రూ.500 కోట్లు
  • 45 మీటర్ల వెడల్పుతో రహదారి నిర్మాణం
  • సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు
  • భూసేకరణకు రెవెన్యూ అధికారుల కసరత్తు


కొత్తూర్‌, జనవరి 25: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శంషాబాద్‌-కొత్తూర్‌ ఆరు లేన్ల రహదారికి త్వరలో మోక్షం లభించనుంది. రహదారి విస్తరణ కోసం రెవెన్యూ అధికారులు ఇప్పటికే భూసేకరణ చేయడానికి కసరత్తు ప్రారంభించారు. నష్టపరిహారం విషయమై భూములు కోల్పోయే వారితో కూడా చర్చలు జరుపుతున్నారు. శంషాబాద్‌ సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటైన తర్వాత 44వ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ పెరిగింది. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్‌ను అధిగమించడానికి  ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్ల హైదరాబాద్‌-బెంగుళూరు 44వ జాతీయ రహదారిని ఆరు లేన్ల రహదారిగా మార్చాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించింది. మొదటివిడతగా ఆరాంఘర్‌ నుంచి శంషాబాద్‌ వరకు ఆరు లేన్ల రహదారి నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. రెండో విడతలో శంషాబాద్‌ సమీపంలోని తొండుపల్లి నుంచి కొత్తూర్‌ వై జంక్షన్‌ వరకు (12 కిలోమీటర్లు) ఆరు లేన్ల రహదారిగా మార్చేందుకు ఎన్‌హెచ్‌ఏఐ రూ. 500 కోట్ల నిధులను మంజూరు చేసింది. భూములు కోల్పోతున్న వారికి నష్టపరిహారంతోపాటు రహదారి నిర్మాణానికి ఈ నిధులను వినియోగించనున్నారు. 12కిలోమీటర్ల రహదారిలో 5 భారీ బ్రిడ్జిలు, 4 మైనర్‌ బ్రిడ్జిలను గుర్తించారు. వాటి స్థానంలో అండర్‌పా్‌సతో కూడిన ఫ్లైఓవర్‌ బ్రిడ్జిలను నిర్మాణం చేయనున్నారు. భూసేకరణ కార్యక్రమం పూర్తికాగానే ఆరు లేన్ల రహదారి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ రహదారి పూర్తయితే ఈ ప్రాంతానికి మరింత డిమాండ్‌ పెరగనుంది.  


45 మీటర్లతో ఆరు లేన్ల రహదారి

45మీటర్ల వెడల్పుతో ఆరు లేన్ల రహదారిని నిర్మించనున్నారు. రహదారి మధ్యలోని డివైడర్‌ నుంచి అటు 22.5 మీటర్లు, ఇటు 22.5మీటర్లు రహదారి వేయనున్నారు. 45మీటర్ల వెడల్పులోనే సర్వీసురోడ్లు నిర్మిస్తారు. మురుగు నీటి కాలువల నిర్మాణాలతోపాటు పలు సదుపాయాలు కల్పిస్తారు.


సర్వాంగ సుందరంగా..

ఆరు లేన్ల రహదారిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ప్రత్యేక డిజైన్‌ రూపొందించారు. రహదారి మధ్యలో సెంట్రల్‌ లైటింగ్‌తోపాటు సర్వీస్‌ రోడ్లపై ప్రత్యేకమైన లైటింగ్‌ ఏర్పాటు చేయనున్నారు. వాహనచోదకులు హైవే పైకి రావాలంటే సర్వీసు, అండర్‌పాస్‌ రహదారి నుంచి స్లిప్‌ రోడ్డుకు కనెక్ట్‌ అయి హైవే ఎక్కాల్సి ఉంటుంది. ప్రజలు, పశువులు రహదారి లోపలికి రాకుండా ప్రత్యేకంగా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయనున్నారు. అవుటర్‌ రింగ్‌రోడ్డు మాదిరిగా ఈ రోడ్డునూ డిజైన్‌ చేసినట్లు తెలిసింది. 


సర్వే పనులు పూర్తి

44వ జాతీయ రహదారిపై ఆరు లేన్ల రహదారి విస్తరణ కోసం సర్వే పనులు పూర్త య్యాయి. 45మీటర్ల వెడల్పుతో రహదారి విస్తరణ జరుగనుంది. కొత్తూర్‌ మండల పరిధిలోకి దాదాపు రెండు కిలోమీటర్ల రహదారి రానుండగా, మిగాతది శంషాబాద్‌ మండల పరిధిలోకి వస్తుంది. భూసేకరణ కోసం భూ యజమానులతో మాట్లాడుతున్నాం. 

- రాజేశ్వరి, ఆర్డీవో, షాద్‌నగర్‌



Updated Date - 2022-01-26T04:20:55+05:30 IST