నాలుగునెలలుగా నిధులు బంద్‌

ABN , First Publish Date - 2021-08-04T04:15:00+05:30 IST

స్థానిక సంస్థల బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని గతంలో సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లా పరిషత్‌లకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్న సర్కారు నాలుగు నెలలుగా ఒక్క పైసా ఇవ్వలేదనే విమర్శలున్నాయి.

నాలుగునెలలుగా నిధులు బంద్‌
సంగారెడ్డి జిల్లా పరిషత్‌ కార్యాలయం

ఏప్రిల్‌ నుంచి నిలిచిన 15వ ఆర్థిక సంఘం, ఏఎ్‌ఫసీ నిధులు

మూడేళ్లుగా విడుదల కాని తలసరి, సీనరేజీ గ్రాంటు నిధులు

సంగారెడ్డి జిల్లా పరిషత్‌పై 11 శాఖల నిర్లక్ష్యం

సమాచారమే ఇవ్వని ప్రధాన శాఖలు

ఈసారైనా ప్రజా సమస్యలపై చర్చ జరిగేనా ?

నేడు జిల్లా పరిషత్‌ సమావేశం

హాజరుకానున్న శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డి


 సంగారెడ్డిటౌన్‌, ఆగస్టు 3: స్థానిక సంస్థల బలోపేతానికి ప్రత్యేక చర్యలు  తీసుకుంటామని గతంలో సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లా పరిషత్‌లకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్న సర్కారు నాలుగు నెలలుగా ఒక్క పైసా ఇవ్వలేదనే విమర్శలున్నాయి. సంగారెడ్డి జిల్లా పరిషత్‌కు ప్రతినెలా 15వ ఆర్థిక సంఘం, ఎస్‌ఎఫ్‌సీ ద్వారా రూ.50లక్షలు విడుదల కావాల్సి ఉంది. ఈ నిధులు ఏప్రిల్‌ నుంచి జూలై వరకు నాలుగునెలలకు సంబంధించి రూ.2కోట్లు విడుదల కాలేదు. ఫలితంగా జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. కాగా ప్రతి యేటా జడ్పీకి రావాల్సిన తలసరి గ్రాంటు, సీనరేజీ గ్రాంటు నిధులు కూడా ప్రభుత్వం మూడేళ్లుగా విడుదల చేయడం లేదు. గత మార్చి  వరకు 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.3 కోట్లు, ఎస్‌ఎ్‌ఫసీ కింద రూ.1.52 (మొత్తం రూ.4.55)కోట్లు విడుదల కాగా పూర్తయిన వివిధ అభివృద్ధి పనులకు రూ.కోటి చెల్లింపులు జరిగాయి. మిగిలిన రూ.3.55 కోట్లు ఫ్రీజింగ్‌ కారణంగా చెల్లింపులు నిలిచిపోవడంతో కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు.

 ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే జిల్లా పరిషత్‌ సమావేశంపై 11 శాఖలు నిర్లక్ష్యం చేశాయనే విమర్శలున్నాయి. జిల్లాలో నెలకొన్న వివిధ సమస్యలపై జడ్పీటీసీలు, ఎంపీపీలు అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు జడ్పీ సమావేశం వేదికవుతుంది. అయితే అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి వివరాలను జడ్పీకి 15 రోజుల ముందే ఇవ్వాల్సి ఉంటుంది. ఆయా శాఖలు పంపిన సమాచారాల(వివరాల)ను ఎజెండాలో పొందుపర్చి ప్రజాప్రతినిధులకు అందజేయడం ఆనవాయితీ. అయితే జిల్లాలో మొత్తం 47 ప్రభుత్వ శాఖలుండగా 11 శాఖలు జడ్పీకి ఎలాంటి వివరాలనూ ఇవ్వలేదు. అందులో ప్రధానంగా నీటిపారుదలశాఖ, జిల్లా పరిశ్రమల శాఖ, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌, గృహ నిర్మాణశాఖ, ఆర్టీఏ, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ, ఆర్టీసీ, జిల్లా ప్రణాళిక, దేవాదాయశాఖలతో పాటు ఆరోగ్యశ్రీ, 104, 108 సర్వీసుల ద్వారా జరుగుతున్న పురోగతి పనుల వివరాలను జడ్పీకి ఇవ్వకపోవడం శోచనీయం. 


ఈసారైనా  చర్చించేనా?

జిల్లాపరిషత్‌ పాలకవర్గం ఏర్పడి రెండేళ్లవుతున్నది. ప్రతి మూడు నెలలకోసారి జిల్లాపరిషత్‌ సాధారణ సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి హరీశ్‌రావు, కలెక్టర్‌ హన్మంతరావు, జడ్పీ చైర్‌పర్సన్‌ మంజూశ్రీ హాజరై ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. రెండేళ్లుగా జరుగుతున్న సమావేశాల్లో జడ్పీటీసీలు, ఎంపీపీలు ప్రజా సమస్యలపై చర్చించడం లేదనే విమర్శలున్నాయి. ఈసారైనా ప్రజా సమస్యలపై చర్చ జరపాలని పలువురు కోరుతున్నారు.


సమావేశాలపై ఆసక్తి చూపని ప్రజాప్రతినిధులు!

సంగారెడ్డి జిల్లాలో నెలకొన్న సమస్యలపై చర్చించి, వాటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి జనరల్‌ బాడీ మీటింగ్‌లను ఏర్పాటు చేస్తుంటారు. అయితే జడ్పీ జనరల్‌బాడీ (సర్వసభ్య సమావేశాలు) మీటింగులపై ప్రజాప్రతినిధులు ఆసక్తి చూపడం లేదనే విమర్శలున్నాయి. జిల్లాపరిషత్‌ పాలకవర్గం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశాలకు రాష్ట్రమంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి హరీశ్‌రావు కేవలం నాలుగుసార్లు మాత్రమే హాజరయ్యారు. 2019 జూలైలో జిల్లాపరిషత్‌ నూతన పాలకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొవిడ్‌ వల్ల, లాక్‌డౌన్‌ విధించడంతో రెండుసార్లు స్థాయీ సంఘ సమావేశాలు, రెండు సార్లు సర్వసభ్య సమావేశం రద్దయిన విషయం తెలిసిందే. రెండేళ్లలో లాక్‌డౌన్‌ను మినహాయించి ఇప్పటి వరకు ఐదు జనరల్‌ బాడీ మీటింగ్‌లు జరిగాయి. 


జడ్పీచైర్‌పర్సన్‌ మంజూశ్రీ అధ్యక్షతన సమావేశం

సంగారెడ్డి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం బుధవారం (నేడు) ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో ఎల్లయ్య తెలిపారు. జడ్పీ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల మంజూశ్రీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డి హాజరుకానున్నారని పేర్కొన్నారు. సమావేశానికి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరు కావాలని ఎల్లయ్య కోరారు. 

Updated Date - 2021-08-04T04:15:00+05:30 IST