మౌలిక భావుకుడు

ABN , First Publish Date - 2020-09-25T06:19:35+05:30 IST

ఏ దృష్టి నుంచి చూచినా, లోహియా విలక్షణ వ్యక్తి. ఆయన గాంధేయత్వాన్ని కొన్ని ముఖ్యాంశాలలో త్రోసివేసిన గాంధేయవాది...

మౌలిక భావుకుడు

ఏ దృష్టి నుంచి చూచినా, లోహియా విలక్షణ వ్యక్తి. ఆయన గాంధేయత్వాన్ని కొన్ని ముఖ్యాంశాలలో త్రోసివేసిన గాంధేయవాది, మార్క్స్‌ను కొన్ని ప్రాథమిక సూత్రాలలో ఖండించిన మార్క్సిస్ట్, సోషలిస్ట్ నెహ్రూ ప్రభుత్వ విధానాలను పెక్కింటిని ప్రతిఘటించిన సోషలిస్ట్. చిన్న, పెద్ద విషయాలన్నింటిలో ఆయన భావాలు ఆయనవే, ఆయన మార్గాలు ఆయనవే.


వాక్కు పరుషమైనా డాక్టర్ లోహియా హృదయం ఎంతో ఆర్ద్ర మైంది. స్నేహానికి అది కరిగేది, సౌజన్యానికి కరిగేది; సౌందర్యోపాసన ఆయనలో ప్రత్యేకించి చెప్పుకోదగు విశేషం. ఆకుచాటు పువ్వును చూచినా, తల్లి వొడిలో బిడ్డను చూచినా, ఆయన కన్నులు వెలుగులను చిందేవి. కోణార్క శిల్పాన్ని చూచినా, కోయపడుచును చూచినా ఆయన ముగ్ధుడయ్యేవాడు. సౌందర్యాన్ని గురించిన ఆయన భావాలు, తక్కిన పెక్కింటి వలే విలక్షణమైనవే. నల్లనివారిలో చాలా మందికి కనబడేది అందం కాదు, అంద వికారమే. ఇది మనలో జితించిన వర్గ వివక్ష ఫలితమని ఆయన విశ్వసించేవాడు. ఆయన కళ్లకు నల్లని రాముడు, నల్లని కృష్ణుడు, నల్లని ద్రౌపది అందాలన్నింటిని పుణికి పుచ్చుకున్నవారుగా కనబడేవారు. ఇక సాంచి వనదేవతో, ఖజురహో సురసుందరిలో, కోణార్క నర్తకిలో భారతనారి సౌందర్య శోభ మూర్తీభవించినట్టు ఆయన భాసిస్తూ వుండేవాడు. ఏ భక్తుడు తీర్థయాత్రలను సేవించనంత భక్తిశ్రద్ధలతో ఆయన కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి కామరూప్ వరకు, అఖిల భారతం లోని కళాక్షేత్రాలన్నింటిని సేవించాడు. తన డాక్టర్లు వలదని శాసించినా, కోణార్క నర్తకిని మరొకసారి చెంత నుంచి చూడ్డానికై అక్కడికి రెండవతూరి తీర్థయాత్రకు వెళ్లినప్పుడు, ఎత్తైన సూర్య దేవాలయ మండపం పైకి నిచ్చెన లేకుండా ఆయన ఎగబాకాడు. 


డాక్టర్ లోహియా కళా ప్రియుడు మాత్రమేకాదు, సాహిత్యాభిమాని కూడా. అన్నిదేశాల సాహిత్యాన్ని, అన్నికాలాల సాహిత్యాన్ని ఆయన అభిమానించేవాడు. ఆధునిక దృష్టి గల వారికి, విప్లవవాదులైన వారికి పౌరాణిక సాహిత్యం పట్ల వైముఖ్యం వుండడం కద్దు. కాని, డాక్టర్ లోహియా మాత్రం హిందూ పురాణాల పట్ల, భక్తి గౌరవాలను చూపుతూ వుండేవాడు. రాముడు, కృష్ణుడు, శివుడు - ఈ పురాణ పురుష త్రయాన్ని గురించి ఆయన ఎంతో భావగర్భితమైన రచన చేశాడు. ఆయన చిత్రణ ప్రకారం ఈ ముగ్గురి వ్యక్తిత్వాలు పరాకాష్ఠను అందుకొన్నట్టివే. రాముని వ్యక్తిత్వం పరిమితత్వంలో, కృష్ణునిది ప్రాగల్భ్యంలో, శివునిది దేశ కాలాలను అధిగమించడంలో వీరు చారిత్రక వ్యక్తులు కావచ్చు, కాకపోవచ్చు. అయినా ఆ చారిత్రక పురుషుల కంటే డాక్టర్ లోహియా దృష్టిలో వీరు హిందువుల జీవితాన్ని, వారి సంస్కృతిని, వారి చరిత్రను ప్రభావితం చేశారు, చేస్తున్నారు. 

1967 అక్టోబర్ 14 ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకీయం

‘డాక్టర్ రామమనోహర్ లోహియా’ నుంచి

Updated Date - 2020-09-25T06:19:35+05:30 IST