ప్రాథమిక హక్కులు - ఆదేశిక సూత్రాలు.. పోటీ పరీక్షల ప్రత్యేకం!

ABN , First Publish Date - 2022-07-06T20:10:31+05:30 IST

ఈ టాపిక్‌ అత్యంత కీలకమైన అంశం. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల అంశాలను రెండు, మూడుసార్లు చదివి అర్థం చేసుకున్న తరవాత ఈ టాపిక్‌ చదవడం పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు

ప్రాథమిక హక్కులు - ఆదేశిక సూత్రాలు.. పోటీ పరీక్షల ప్రత్యేకం!

ఆదేశిక సూత్రాలు

ప్రాథమిక హక్కులు - ఆదేశిక సూత్రాల 

మధ్య సంబంధం - వివాదాలు

ఈ టాపిక్‌ అత్యంత కీలకమైన అంశం. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల అంశాలను రెండు, మూడుసార్లు చదివి అర్థం చేసుకున్న తరవాత ఈ టాపిక్‌ చదవడం పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు లాభదాయకంగా ఉంటుంది. ఈ టాపిక్‌ను చదివే క్రమంలో అభ్యర్థులు సుప్రీంకోర్టు తీర్పులు, ఆ     తీర్పుల పర్యవసానంగా జరిగిన రాజ్యాంగ సవరణలు, న్యాయస్థానాల తీర్పులు, రాజ్యాంగ సవరణల మధ్య సంబంధాన్ని సునిశితంగా పరిశీలించాలి.


విభేదాలు/ వివాదాలు: 

ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య వివాదం న్యాయశాఖ, పార్లమెంట్‌ మధ్య వివాదంగా మారింది. న్యాయశాఖ ప్రాథమిక హక్కులకు మద్దతు ఇస్తుంది. పార్లమెంటు ఆదేశిక సూత్రాలకు మద్దతు తెలుపుతుంది.


ప్రాథమిక హక్కులకు ప్రాధాన్యం ఇస్తే ఆదేశిక సూత్రాలు అమలు కావు. ఆదేశిక సూత్రాలకు ప్రాధాన్యం ఇస్తే ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురవుతాయి. 

ఉదా: సంపద వికేంద్రీకరణ(ఆదేశిక సూత్రం) అమలుచేయడం కోసం ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించాల్సి వచ్చింది.


ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య  వివాదాలకు ఉదాహరణలు

1. గోపాలన్‌ వర్సెస్‌ మద్రాస్‌ రాష్ట్రం కేసు- 1950 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వ్యక్తి స్వేచ్ఛ అన్నిటికంటే ముఖ్యమైంది. అయితే రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే వ్యక్తి స్వేచ్ఛను హరించే అవకాశం ఉంది.

2. 1951 జూన్‌లో పార్లమెంట్‌ 1వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 9వ షెడ్యూల్‌ను చేర్చి దానిలో పొందుపరిచిన అంశాలపై న్యాయసమీక్షను మినహాయించింది.

3. చంపకం దొరై రాజన్‌ వర్సెస్‌ మద్రాస్‌ రాష్ట్రం కేసు- 1951 డిసెంబరు. ఈ తీర్పు ప్రకారం ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులకు మధ్య వివాదం ఏర్పడితే ప్రాథమిక హక్కులే ఉన్నతమైనవిగా పరిగణించాలి. ప్రాథమిక హక్కులను అధిగమించాలంటే రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.

4. పార్లమెంట్‌ 1964లో 17వ రాజ్యాంగ సవరణ ద్వారా  సంపద వికేంద్రీకరణకు సంబంధించిన చట్టాలను రూపొందించింది.

5. గోలక్‌నాథ్‌ వర్సెస్‌ పంజాబ్‌ రాష్ట్రం కేసు- 1967: ఈ తీర్పు ప్రకారం పార్లమెంటు ఆదేశిక     సూత్రాలను అమలుచేసే ఉద్దేశంతో ప్రాథమిక హక్కులను సవరించకూడదు. ఇవి అత్యంత పవిత్రమైనవి.

6. 1971లో పార్లమెంట్‌ 24, 25 రాజ్యాంగ సవరణలు చేసింది. 24వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏ ప్రాథమిక హక్కును అయినా రాజ్యాంగ    సవరణ ద్వారా ఉల్లంఘించే అధికారం      పార్లమెంటుకు ఉంది. 25వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆదేశిక సూత్రాల్లోని 39(బి), 39(సి) నిబంధనలను అమలు చేయడానికి రూపొందించే చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నా వాటిని న్యాయస్థానాల్లో సవాల్‌ చేయకూడదు.

7. కేశవానంద భారతి కేసు 1973- (నిర్దేశిక నియమాల ప్రాధాన్యాన్ని తెలియజేసే కేసు) ఈ తీర్పు ప్రకారం పార్లమెంటు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించేవిధంగా రాజ్యాంగ సవరణ చేయకూడదు.

8. 1976లో పార్లమెంటు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా న్యాయసమీక్ష అధికారంపై పార్లమెంటు గణనీయమైన పరిమితులు విధించి, ఆదేశిక సూత్రాలను అమలుచేసే చట్టాల విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకుండా చేసింది.

9. 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్‌-31లో ఉన్న ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు.

10. మినర్వామిల్స్‌ కేసు- 1980: ఈ తీర్పు ప్రకారం భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య సమతౌల్యత అనే పునాదిపై నిర్మించారు. ఈ రెంటినీ రాజ్యాంగానికి రెండు రథచక్రాలుగా పరిగణించాలి. ఈ రెండింటి మధ్య సమతౌల్యత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. ఆదేశిక సూత్రాల లక్ష్యాలను ప్రాథమిక హక్కులను ఉల్లంఘించకుండా సాధించాలి.

11. వామన్‌రావు వర్సెస్‌ భారతప్రభుత్వ కేసు(1981): రాజ్యాంగ మౌలిక స్వరూపం అన్న భావన 1973 ఏప్రిల్‌ 24 తరవాత వచ్చిన తీర్పులకు వర్తిస్తుంది. 

గమనిక: ఆదేశిక సూత్రాలు అమలుపరిచే సందర్భంలో 39(బి), 39(సి) ఆర్టికల్స్‌ అమలుపర్చడానికి చేసే చట్టాలకు మాత్రమే న్యాయ సంరక్షణ ఉంటుంది.


ఆదేశిక సూత్రాలు - చేర్చిన అంశాలు

రాజ్యాంగ సవరణ(సంవత్సరం), చేర్చిన నిబంధన, వివరించిన అంశం కింది విధంగా ఉన్నాయి.

42(1976)- ఆర్టికల్‌(39ఎఫ్‌): బాల్యం, యవ్వనం, వృద్ధాప్యంలో ఎలాంటి దోపిడీకి, పీడనానికి గురికాకుండా చూడటం.

42(1976)- ఆర్టికల్‌-39(ఏ): పేదలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం.

42(1976)- ఆర్టికల్‌-43(ఏ): పరిశ్రమల నిర్వహణ, యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించడం.

42(1976)- ఆర్టికల్‌-48(ఏ): పర్యావరణం, అడవులు, వన్యమృగాల పరిరక్షణకు కృషి చేయడం.

86(2002): ఆర్టికల్‌-45లో(అదనంగా చేర్చిన అంశం): ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు ఆరోగ్య రక్షణ, ప్రాథమిక పూర్వవిద్యను అందించడం.

97(2011) (2012 నుంచి అమలు): ఆర్టికల్‌-43(బి): భారతదేశంలో సహకార సంస్థలను నెలకొల్పేందుకు ప్రభుత్వాలు కృషిచేయాలి.







-వి.చైతన్యదేవ్‌

పోటీ పరీక్షల నిపుణులు



Updated Date - 2022-07-06T20:10:31+05:30 IST