Abn logo
Mar 26 2020 @ 00:00AM

మౌలిక ప్రశ్నలు

కరోనా మీద యుద్ధం–4


కరోనా కలిగిస్తున్న కలవరాన్ని, కనీవినీ ఎరుగని ఉద్రిక్త నిర్బంధ పరిస్థితిని అనుభవిస్తున్నప్పుడే, కొన్ని నేపథ్య అంశాలను కూడా తరచిచూడవలసిన అవసరం ఉన్నది. ఇది ప్రకృతి వైపరీత్యం వంటిదిగా, మనిషి చేతిలో లేని పరిణామంగా చూస్తున్నాము. ఏదో ఒక దేశం కుట్రచేసి సృష్టించిన జీవాయుధం అన్న సిద్ధాంతాలను ఇక్కడ ప్రస్తావించడం లేదు. ప్రమాదం ఎక్కడ నుంచి, ఎట్లా వచ్చినా, ఎదుర్కొనడానికి కావలసిన శక్తి ఇంత పరిమితంగా ఎందుకున్నది అన్నది ఒక ముఖ్యమైన ప్రశ్న. మొత్తంగా వైద్య, ఆరోగ్యరంగంలో మనదేశం తాహతు ఏమిటి? అన్నది మౌలిక ప్రశ్న.


ఎంతో అభివృద్ధి చెందిన దేశాలే విలవిలలాడుతున్నప్పుడు వైద్యఆరోగ్య శక్తిసంపన్నత గురించిన చర్చ అప్రస్తుతం అనిపించవచ్చు. 2018 సంవత్సరం లెక్కల ప్రకారం అమెరికా తన స్థూల జాతీయోత్పత్తిలో 16.6 శాతం ప్రజారోగ్యం మీద ఖర్చు పెట్టింది. ఇప్పుడు కరోనా దెబ్బకు విలవిలలాడుతున్న ఇటలీ 8.8 శాతం, స్పెయిన్‌ 8.9 శాతం ఖర్చుపెట్టాయి. భారతదేశం ఆ సంవత్సరం 3.6 శాతం మాత్రమే ఖర్చు పెట్టింది. ఆయా దేశాలు ఆరోగ్యరంగానికి ఇస్తున్న ప్రాధాన్యం, వారికి ఉన్న పట్టింపు ఈ లెక్కల వల్ల తెలుస్తాయి. ఆ దేశాలే, పడకలు సరిపోక, వైద్యులు సరిపోక, మాస్కులు మందులు లేక బాధపడుతుంటే, నిజంగా భారతదేశానికి నిపుణులు హెచ్చరిస్తున్న ప్రమాదమే ఎదురయితే ఎదుర్కొనగలమా? వచ్చే మే 15 నాటికి కనీసంలో కనీసంగా 22 లక్షల మందికి మనదేశంలో కరోనా సోకుతుందని ఒక అంచనా. భయపెట్టే పెద్ద పెద్ద అంచనాలను ఈ తరుణంలో నమ్మనక్కరలేదు కానీ, ఆ పరిస్థితే ఎదురయితే ఏమిటన్న చర్చ అధికారవర్గాలలో ఉంటుంది, ఉండాలి కూడా. జబ్బు సోకినవారిలో 5–10 శాతం మందికి తీవ్రమైన చికిత్స అవసరమవుతుందనుకుంటే లక్ష నుంచి రెండు లక్షల దాకా వెంటిలేటర్లు అవసరమవుతాయి. మనదేశంలో ప్రభుత్వాసుపత్రులలో ఎన్ని వెంటిలేటర్లు ఉన్నాయో లెక్క తెలియదు. దేశంలో ప్రభుత్వాసుపత్రుల్లో పడకల సంఖ్య 7 లక్షల చిల్లర ఉంటుంది. వీటిలో 5–8 శాతం ఐసియు పడకలు అనుకుంటే, అందులో సగం పడకలకు వెంటిలేటర్లు ఉన్నాయనుకుంటే, 18000–25000 వెంటిలేటర్లు ఉండి ఉంటాయి. అంటే, అవసరమైన వాటిలో సుమారు పదిశాతం మాత్రమే వెంటిలేటర్లు అందుబాటులో ఉంటాయి. ఇది ఒక ప్రమాదకర పరిస్థితి.


ఏ దేశమైనా జనాభాలో ఒకటి రెండు శాతానికి అనారోగ్యం వస్తే ఎదుర్కొనడానికి అవసరమైన వ్యవస్థలను ఏర్పరచుకుంటుంది తప్ప, పెద్ద మహమ్మారులు వచ్చి, జనాభాలో గణనీయమైన భాగం రోగగ్రస్తులైతే ఎదుర్కొనడానికి కావలసిన వ్యవస్థలను ఏర్పరచుకోదు. స్పెయిన్‌లోను, ఇటలీలోను ఆస్పత్రి పడకలు, వెంటిలేటర్లకు కూడా కొరత ఏర్పడింది అంటే, అభివృద్ధి చెందిన దేశాల స్థాయి సన్నద్ధత కూడా కరోనా తీవ్రత ముందు సరిపోలేదు. కాబట్టి, భారతదేశం వంటి దేశం పూర్తి స్థాయి సన్నద్ధతతో లేదని బాధపడనక్కరలేదు. కానీ, కనీస సన్నద్ధత కూడా లేదేమోనని భయపడక తప్పదు. అందుకు మన బడ్జెట్‌ కేటాయింపులే రుజువు. ప్రతి సమాజపు ఆర్థిక, సామాజిక, రాజకీయ ఆరోగ్యాలకు– భౌతిక ఆరోగ్యం ఒక మౌలిక సదుపాయం. ఆరోగ్యానికి ఇచ్చే బడ్జెట్‌ ఖర్చుపద్దు కాదు. దాని ప్రతిఫలం, ఆర్థిక వ్యవస్థలో వ్యక్తమవుతుంది. 2015లో భారతదేశం చేసిన తలసరి ఆరోగ్య ఖర్చు 16 డాలర్లు కాగా, మాల్దీవులు 770, థాయ్‌లాండ్‌ 166, చివరకు భూటాన్‌ కూడా 66 డాలర్లు ఖర్చుచేశాయి. కరోనా సంగతి పక్కన బెట్టినా, దేశానికి ఆరోగ్యరంగంలో ఏ సవాల్‌ ఎదురయినా, సరైన సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో భారత్‌ ఉంటూ వచ్చింది. భారతదేశ జనాభాకూ ప్రభుత్వాసుపత్రుల్లో పడకలకూ ఉన్న నిష్పత్తిని చూస్తే భయపడిపోతాము. ప్రతి వెయ్యిమందికి 0.3 పడకలు మాత్రమే ఉన్నాయి. అందులోనూ వెనుకబడిన ఉత్తరాది రాష్ట్రాల సగటు మరీ తక్కువ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో ఈ పడకల శాతం దేశసగటు తో సరిసమానంగా అంటే, 0.3 శాతం మాత్రమే ఉన్నది. మన దేశంలో ప్రైవేటు ఆస్పత్రులలో ఎన్ని పడకలు ఉన్నాయో, ఎన్ని ఐసియు పడకలు ఉన్నాయో, ఎన్ని వెంటిలేటర్లు ఉన్నాయో తెలియదు. ప్రధానంగా నగరాలలో, పట్టణాలలో సేవలు అందించే ఈ ఆస్పత్రుల్లో కూడా ఈ సదుపాయాల సంఖ్యను భారీగా ఊహించలేము. 30 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో ప్రభుత్వ, ప్రయివేట్‌ ఆస్పత్రులన్నిటిలోనూ కలిపి, 3 కోట్ల 60 లక్షల పడకలు అందుబాటులో ఉన్నాయి. అంటే పదిశాతం.


చైనా తన స్థూల జాతీయోత్పత్తిలో కేవలం 5 శాతం మాత్రమే ఆరోగ్యం మీద ఖర్చుపెడుతుంది కానీ, అక్కడి ప్రభుత్వానికి సంకల్పశక్తి అధికంగా ఉన్నది. కరోనా రోగుల కోసం కొన్ని రోజుల్లో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించగలిగిన శక్తి అక్కడి ప్రభుత్వానికి, సమాజానికి ఉన్నది. ఈ కష్టకాలంలో స్పెయిన్‌ సాహసమైన నిర్ణయం తీసుకుని ప్రయివేట్‌ ఆస్పత్రుల న్నిటిని జాతీయం చేసింది. ఇటువంటి కీలకనిర్ణయాలు తీసుకోవలసిన అగత్యం ఏర్పడుతుంది. భారతదేశంలో ప్రైవేటు రంగంలో కరోనా పరీక్షలు నిర్వహించడానికి కొన్ని ఆస్పత్రులకు, లాబ్‌లకు అనుమతులు మంజూరు చేశారు. కానీ, అక్కడ పరీక్షల రుసుము 4–5 వేల రూపాయలు ఉన్నది. కరోనా చికిత్సను కూడా ప్రైవేటు ఆస్పత్రులు చేపడితే, వాటికి వెళ్లగలిగే శక్తి సాధారణ పేషంట్లకు ఉండదు. ఇది ఒక జాతీయ విపత్తు కాబట్టి, కరోనా చికిత్స భారాన్నంతా ప్రభుత్వమే భరించేట్టుగా ప్రణాళిక రచించాలి. తన దగ్గర ఉన్న వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ, అందుబాటులో ఉండే ఇతర వనరులను తన పరిధిలోకి తెచ్చుకోవాలి. అందుకు తగిన నిర్ణయాలు తీసుకోవడానికి తెగువ అవసరం.


ఈ సందర్భాన్ని ఆసరా చేసుకుని, శాశ్వత ఆరోగ్య మౌలిక వసతులను కూడా కల్పించుకునే ప్రయత్నాలు రాష్ట్రప్రభుత్వాలు చేయవచ్చు. శీఘ్ర నిర్మాణపద్ధతిలో ఎందుకు రెండు తెలుగు రాష్ట్రాలు ఆస్పత్రుల నిర్మాణాన్ని చేపట్టకూడదు? ఉభయరాష్ట్రాల్లో పనిలేక పడావు పడిన అనేక వృత్తివిద్యా కళాశాలల సువిశాల భవనాలను కొద్ది మెరుగులతో ఆస్పత్రులకు అనువుగా ఉపయోగించుకోవచ్చు. బీబీనగర్‌ ఎయిమ్స్‌ యూనివర్సిటీ భవనాన్ని కూడా సద్వినియోగం చేసే ఆలోచన చేయవచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన కొత్తలో అనేక ఆస్పత్రుల నిర్మాణానికి హామీలు ఇచ్చారు. విపత్తు నిధుల సహాయంతో వాటిని చేపడితే, కరోనా అనంతరం కూడా శాశ్వతంగా సేవ చేస్తాయి. ఇవన్నీ కేవలం సూచనలు. ఇవే కాకపోయినా, ఇటువంటివే ఆలోచనలు చేస్తే ప్రస్తుతానికి, రేపటికి కూడా ఉభయతారకంగా ఉంటుంది. ప్రస్తుతం మనం అదనంగా ఎంతో ముందు జాగ్రత్తతో ఉండవలసి రావడానికి కారణం– ఇంతకాలం మనం ఆరోగ్యరంగాన్ని అలక్ష్యం చేయడం. దాన్నుంచి పాఠం నేర్చుకోవాలి. కరోనా వ్యాప్తిని మన కఠిన ఆచరణతో నియంత్రణలో ఉంచడం వల్ల సమయం చిక్కుతుంది. ఆ చిక్కే సమయంలో అదనపు హంగులు, సదుపాయాలు కల్పించుకోవాలి. అప్పుడే, యుద్ధంలో బలాబలాలు మనకు అనుకూలంగా మారతాయి.

Advertisement
Advertisement
Advertisement