కాంగ్రెస్‌కు పట్టని ‘మౌలిక’ ప్రగతి

ABN , First Publish Date - 2021-10-19T05:53:07+05:30 IST

సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం అనేది భారతదేశం తన అభివృద్ధిపథంలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. దీని వల్ల స్వదేశీ పరిశ్రమలు అభివృద్ధి చెందడం నుంచి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం వరకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి...

కాంగ్రెస్‌కు పట్టని ‘మౌలిక’ ప్రగతి

సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం అనేది భారతదేశం తన అభివృద్ధిపథంలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. దీని వల్ల స్వదేశీ పరిశ్రమలు అభివృద్ధి చెందడం నుంచి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం వరకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న ఆర్థికవ్యవస్థ అవసరాలకు తగ్గట్లుగా మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందడం లేదు. విశ్వనగరం అని నేతలు చెప్పుకున్న హైదరాబాద్‌లో ప్రతి ఏడాది భారీ వర్షాల మూలంగా ఏర్పడుతున్న దౌర్భాగ్య పరిస్థితి మనకు తెలియనిది కాదు. అయిదు దశాబ్దాలకు పైగా దేశంలో పాలనను సాగించిన కాంగ్రెస్ హయాంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై అవసరమైనంత మేరకు దృష్టిని కేంద్రీకరించలేదు. ఎన్నికల ప్రణాళికల్లో మౌలికసదుపాయాల గురించి పెద్దగా ప్రస్తావనే ఉండేది కాదు. వందలాది ప్రాజెక్టులు ఏళ్ల తరబడి నత్తనడకతో సాగడం మూలంగా వ్యయం భారీగా పెరిగిపోయింది. దీనికి తోడు ప్రతి ప్రాజెక్టులోనూ తీవ్ర అవినీతి చోటు చేసుకోవడం వల్ల నాసిరకం పనులు సాగాయి. పైగా ఒక విభాగం చేసే పనులు మరో విభాగానికి తెలియకపోవడంతో రోడ్డు వేసిన మర్నాడే పైపుల కోసం అదే రోడ్డును తవ్విన దృష్టాంతాలున్నాయి. 


ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ విషయం గమనించినందువల్లే అధికారంలోకి రాగానే మౌలికసదుపాయాలపై దృష్టి కేంద్రీకరించారు. అత్యంత కీలకమైన పలు భారీ ప్రాజెక్టులను గుర్తించి వాటిని పూర్తి చేసేందుకు నిధులను సమకూర్చారు. వీటిలో అంతర్జాతీయ విమానాశ్రయాలు, హైవే, ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టులు, మెట్రోరైళ్లు, బుల్లెట్ రైళ్లు, పారిశ్రామిక కారిడార్లు, సముద్రంపై వంతెనలు, జలమార్గాలు ఉన్నాయి. కేవలం పట్టణాల్లోనే కాదు, గ్రామాల్లో కూడా మౌలికసదుపాయాలను పెంచాలని మోదీ సంకల్పించారు. 2014లో ఆయన అధికారంలోకి రాగానే నిలిచిపోయిన వందలాది ప్రాజెక్టులను సమీక్షించి ఒకే వేదికపైకి తీసుకువచ్చారు. ప్రభుత్వం ఒకటేనని, మంత్రిత్వ శాఖలు వేరువేరు కాదనే దృక్పథంతో వివిధ విభాగాలు కలిసికట్టుగా పనిచేసే సౌలభ్యం కల్పించారు. దాని వల్ల దశాబ్దాల తరబడి పూర్తి కాని వందలాది ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 2014 వరకు కేవలం 1900 కిమీ మేరకు మాత్రమే రైల్వే లైన్ల డబ్లింగ్ జరిగింది. కాని గత ఏడేళ్లలో 9వేల కిలోమీటర్ల రైల్వే లైన్ల డబ్లింగ్ పూర్తి చేశారు. 24వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ల విద్యుద్దీకరణ జరిపారు. 2014కు ముందు కేవలం 250 కిమీ మాత్రమే మెట్రో రైల్వే నడిచేది. ఇప్పుడు 700 కిమీల మార్గంలో మెట్రో రైలు నడుస్తుండగా మరో 1000 కిమీ మేరకు మెట్రో పనులు సాగుతున్నాయి. 1987లో తొలి అంతర్ రాష్ట్ర సహజవాయు పైప్ లైన్‌ను ప్రారంభించారు. 17 సంవత్సరాల తర్వాత మోదీ హయాంలో 15వేల కిమీ మేరకు సహజవాయు పైప్‌లైన్‌ను నిర్మించగా, మరో 16వేల కిమీ మేరకు దేశమంతటా గ్యాస్ పైప్‌లైన్ల పని నడుస్తోంది. 2014లో దేశంలో రెండే మెగా ఫుడ్ పార్క్ లుండగా ఇప్పుడు 19 మెగా ఫుడ్‌పార్కులు పనిచేస్తున్నాయి. నాడు కేవలం 5 జలమార్గాలుండగా, గత ఏడేళ్లలో వీటి సంఖ్య 13కు పెరిగింది. తూర్పు పశ్చిమ ఎక్స్‌ప్రెస్ వే 9 ఏళ్ల ఆలస్యం తర్వాత మోదీ హయాంలోనే పూర్తయింది. 21 సంవత్సరాల ఆలస్యం తర్వాత భారతదేశంలో అతి పెద్ద రైల్‌రోడ్ వంతెన బోగీబీల్ నిర్మాణం జరిగింది. దక్షిణాసియాలోనే అతి పొడవైన చెనానీ-–నశ్రీ సొరంగ మార్గం పూర్తయింది. ఇలా చెప్పుకునేందుకు ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి.


తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ 100లక్షల కోట్ల మేరకు జాతీయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రారంభించిన ‘గతి శక్తి’ మాస్టర్ ప్లాన్, దేశంలోని అన్ని ప్రభుత్వాలు చేసే నిర్మాణ కార్యక్రమాలను, వివిధ లబ్ధిదారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సమష్టిగా మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేయడానికి సంకల్పించింది. దీని వల్ల అనుకున్న సమయం కంటే ముందుగా మౌలికసదుపాయాలను నిర్మించే పని సంస్కృతిని ఆయన ప్రవేశపెట్టారు. పాత వ్యవస్థలను, పద్ధతులను పక్కన పెట్టి భారతీయ పరిశ్రమ, భారతీయ వ్యాపారం, భారతీయ ఉత్పత్తిదారులు, భారతీయ రైతులే కేంద్రంగా పల్లెలనుంచి పట్టణాల దాకా మౌలిక సదుపాయాలను సమగ్ర దృక్పథంతో చేపట్టాలన్నదే ఆయన లక్ష్యం. దీని వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విభాగాలు, కాంట్రాక్టర్ల మధ్య సమన్వయ లోపం అనేదే ఉండదు. ఏ ప్రాజెక్టు ఎంత మేరకు పూర్తవుతుందో ముందస్తు సమాచారం లభ్యమవుతుంది. తద్వారా వనరులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని వృధాను, అవినీతిని అరికట్టేందుకు వీలుపడుతుంది. 


భారత్ మాల, అంతర్ జలమార్గాల పథకాలు, ఆర్థిక మండలాలు, జౌళి, ఫార్మాస్యూటికల్ సముదాయాలు, ఎలెక్ట్రానిక్ పార్క్‌లతో పాటు దేశంలో ఎక్కడ ఏ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు అమలు జరిగినా అది ‘గతి శక్తి’ మాస్టర్ ప్లాన్‌లో భాగమవుతుంది. సరైన అనుసంధానం లేకపోవడం వల్ల ప్రాజెక్టులు నత్తనడకన సాగే ప్రసక్తే ఉండదు. కేంద్రమైనా, రాష్ట్రమైనా మౌలిక సదుపాయాలకు చెందిన మంత్రిత్వశాఖలన్నీ సమష్టిగా పనిచేస్తాయి. ‘గతి శక్తి’ పోర్టల్ లో ప్రతి ప్రాజెక్టూ రికార్డవుతుంది. వచ్చే నాలుగైదు సంవత్సరాల్లో దేశంలో 200 విమానాశ్రయాలు, హెలిపాడ్లు, వాటర్ ఎయిరోడ్రోమ్‌ల నిర్మాణం పూర్తి చేయాలని మోదీ ప్రభుత్వం సంకల్పించింది. క్రియాశీలక పాలన, సకాలంలో కార్యాచరణ కోసం చేపట్టిన పిఎం-ప్రగతి మూలంగా ప్రాజెక్టుల అమలుకు సంబంధించిన సమస్యలు దాదాపు పరిష్కారమవుతాయి. మనుషుల జోక్యం అవసరం లేకుండానే గతిశక్తి పోర్టల్ ద్వారా పనులు పూర్తవుతాయి, ప్రాజెక్టు పర్యవేక్షణా బృందం ఒకటి నిరంతరం ప్రాజెక్టుల పనులను సమీక్షిస్తూనే ఉంటుంది. ఒక రైల్వే లైన్ నిర్మించాలని నిర్ణయించిన వెంటనే అటవీ శాఖ, విద్యుత్ శాఖ, రోడ్ రవాణా శాఖలనుంచి అనుమతులు వెంటవెంటనే లభిస్తాయి. గతి శక్తి ప్లాన్‌లో భాగంగా భారతీయ రైల్వే 500 మల్టీ మోడల్ కార్గో టర్మినల్స్ నిర్మాణాన్ని నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రకటించింది.


ఆత్మనిర్భర్ భారత్ ద్వారా మరో 25 సంవత్సరాల వరకు చెక్కుచెదరని మౌలికసదుపాయాల పునాదిని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న నరేంద్రమోదీ ప్రభుత్వ ఆలోచనలు ఎంత బలమైనవో ప్రతిపక్షాలకు అర్థం కాదు. ప్రైవేట్‌రంగం ప్రవేశించడం ద్వారా దేశంలో అభివృద్ధి ఏ విధంగా జరిగిందో, ప్రజల జీవన నాణ్యత ఏ మేరకు పెరిగిందో తెలిసినవారు మోదీ ప్రభుత్వ చర్యల్ని హర్షించక తప్పదు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ప్రారంభమైన అభివృద్ధి క్రమం వాజపేయి హయాంలో మరింత వేగం పుంజుకుంది. ఇప్పుడు నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వేగం మరింత సత్వర, సమున్నత ఫలితాలు సాధిస్తుందన్న విషయంలో సందేహం లేదు.


వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)


Updated Date - 2021-10-19T05:53:07+05:30 IST