ప్రాణం తీసిన సరదా

ABN , First Publish Date - 2022-07-03T05:00:35+05:30 IST

ఆ విద్యార్థికి ఫొటోలు తీయడమంటే సరదా. కెమెరా మెడలో వేసుకుని పక్షులు, అందమైన ప్రకృతిని ఫొటోలు తీస్తుంటాడు.

ప్రాణం తీసిన సరదా

రైలు ఢీకొని విద్యార్థి దుర్మరణం

ఫొటోలు తీస్తుండగా ఘటన


మహబూబ్‌నగర్‌, జూలై 2: ఆ విద్యార్థికి ఫొటోలు తీయడమంటే సరదా. కెమెరా మెడలో వేసుకుని పక్షులు, అందమైన ప్రకృతిని ఫొటోలు తీస్తుంటాడు. ఆ అలవాటుతోనే రైల్వే పట్టాల సమీపంలో ఫొటోలు తీస్తుండగా రైలు ఢీకొట్టి శుక్రవారం మృతి చెందాడు. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ఏనుగొండకు చెందిన రామకృష్ణ(17)  ఐటీఐ చదువుతున్నాడు. శనివారం సాయంత్రం ఇంటి నుంచి కెమెరా తీసుకుని ఏనుగొండ సమీపంలో ఉన్న రైలు పట్టాల వద్దకు వెళ్లాడు. సెల్ఫీస్టిక్‌తో ఫొటోలు తీస్తూ హైదరాబాద్‌ నుంచి కర్నూల్‌వైపు వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలును గమనించ లేదు. రామకృష్ణ పట్టాలకు దగ్గరగా ఉండటంతో గమనించిన రైలు లోకో పైలెట్‌ ఆపేందుకు ప్రయత్నించినా రైలు ఆగలేదు. అతన్ని ఢీకొనడంతో తీవ్ర గాయలతో అక్కడికక్కడే మరణించాడు. రైలు ఆగడంతో స్థానికులు ఏం జరిగిందోనని అక్కడికి వెళ్ళారు. లోకో పైలెట్‌ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు నర్సింహులు, నర్సమ్మ రామకృష్ణ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. నర్సింహులు, నర్సమ్మలకు ముగ్గురు కొడుకులు, కూతురు సంతానం. రామకృష్ణ చిన్నవాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2022-07-03T05:00:35+05:30 IST