సమ్మర్‌ క్యాంపుల్లో సరదాగా

ABN , First Publish Date - 2022-05-08T05:26:20+05:30 IST

ఎండాకాలం సెలవులు వచ్చాయంటే చాలు పిల్లలు ఆటాపాటలతో సరదాగా గడుపుతారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఆట, పాట, నృత్యాల్లో రాణించాలని ఆసక్తి చూపుతారు.

సమ్మర్‌ క్యాంపుల్లో సరదాగా
ఈత నేర్చుకుంటున్న చిన్నారులు

  వివిధ అంశాలపై  చిన్నారులకు శిక్షణ

 సెలవుల్లో పిల్లలకు నేర్పించేందుకు తల్లిదండ్రుల ఆసక్తి


సిద్దిపేట కల్చరల్‌, మే 7: ఎండాకాలం సెలవులు  వచ్చాయంటే చాలు పిల్లలు ఆటాపాటలతో సరదాగా గడుపుతారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఆట, పాట, నృత్యాల్లో రాణించాలని ఆసక్తి చూపుతారు. వారి ఆసక్తి మేరకు వేసవి సెలవుల్లో వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు వివిధ సంస్థలు ముందుకు వస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను శిక్షణ సంస్థలకు పంపిస్తున్నారు. ఉచిత, ప్రైవేటు శిక్షణ సంస్థలు వివిధ అంశాల్లో మెలుకువలు నేర్పిస్తున్నాయి.


ఫుట్‌బాల్‌లో శిక్షణ


జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో ఉచిత ఫుట్‌బాల్‌ శిక్షణ శిబిరాన్ని సిద్దిపేటలోని ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్నారు. ఈ నెల 5 నుంచి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్ననాటి నుంచే క్రీడల్లో మెలకువలు నేర్చుకొని ఉత్తమమైన క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ కృషి చేస్తున్నది. ఇందులో భాగంగానే స్థానిక ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో ఈ సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌ను నిర్వహిస్తున్నారు.


స్విమ్మింగ్‌ క్యాంప్‌


చిన్నారులకు స్విమ్మింగ్‌ నేర్పించేందుకు జిల్లా క్రీడాధికారులు, జిల్లా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో సమ్మర్‌ స్విమ్మింగ్‌ క్యాంపును ఏర్పాటు చేశారు. సిద్దిపేటలోని మినీ స్టేడియంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్‌పూల్‌లో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 14 సంవత్సరాలలోపు బాలబాలికలకు స్విమ్మింగ్‌లో శిక్షణను అందిస్తున్నారు. ఉదయం 6 నుంచి 7గంటల వరకు బాలురకు, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు బాలికలకు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం వీరికి సర్టిఫికెట్లు ఇవ్వనున్నారు. 




చేతిరాతపై శిక్షణ


సిద్దిపేటలోని పీఆర్టీయూ భవన్‌లో అజాజ్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో చిన్నారులకు చేతిరాతలో శిక్షణను అందిస్తున్నారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు మూడు గంటల పాటు శిక్షణ ఇస్తున్నారు. చిన్నారులకు మొదటగా డ్రాయింగ్‌ షీట్లు ఇచ్చి ఏకాగ్రత పెంచుతున్నారు. ఆ తర్వాత హిందీ, ఇంగ్లీష్‌, తెలుగు భాషల్లో చేతిరాత శిక్షణనిస్తున్నారు. చిన్ననాటి నుంచే చేతి రాతలో మెళకువలను నేర్పిస్తే చక్కగా రాయగలుగుతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడే పీఆర్టీయూ ఆధ్వర్యంలో స్పోకెన్‌ ఇంగ్లీ్‌షతో పాటు యోగా శిక్షణకు ఏర్పాట్లు చేస్తున్నారు. 


వెస్టర్న్‌ డాన్స్‌లో  మెలకువలు 


సిద్దిపేటలోని సహస్ర పాఠశాలలో విద్యార్థులకు వెస్టర్న్‌ డాన్స్‌లో మెలకువలను నేర్పిస్తున్నారు. పాటకు తగినట్లు స్టెప్పులు వేసేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. పాఠశాల యాజమాన్యం, డాన్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.  


 

Read more