పరారైన ఖైదీ పట్టివేత

ABN , First Publish Date - 2022-05-21T07:55:59+05:30 IST

సబ్‌జైలు వద్ద నుంచి తప్పించుకుని పరారైన ఖైదీని తిరుపతి వెస్ట్‌ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు.

పరారైన ఖైదీ పట్టివేత
ఈనెల 14న తప్పించుకెళ్లిన మూర్తి నవీన్‌

తిరుపతి(నేరవిభాగం), మే 20: సబ్‌జైలు వద్ద నుంచి తప్పించుకుని పరారైన ఖైదీని తిరుపతి వెస్ట్‌ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. వెస్ట్‌ సీఐ శివప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం యశ్వంతపూర్‌కు చెందిన నరసింహమూర్తి కుమారుడు మూర్తి నవీన్‌ అలియాస్‌ అశోక్‌ (28) చిన్నప్పటినుంచే దొంగతనాలకు అలవాటు పడ్డాడు. తిరుపతితోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సుమారు 20కి పైగా దొంగతనాలు చేశాడు. ఆయా కేసుల్లో శిక్ష అనుభవించి వచ్చాక కూడా చోరీలు ఆపలేదు. పట్టపగలే ఇళ్లల్లో దొంగతనాలు చేయడంలో దిట్టయిన ఇతను తిరుపతి ఎంఆర్‌పల్లె పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని టీటీడీ ఫ్లాట్స్‌లో ఈనెల 14వ తేదీన చోరీకి ప్రయత్నించాడు. అయితే ఎల్‌హెచ్‌ఎంఎస్‌ (లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌)ద్వారా పోలీసులకు పట్టుబడ్డాడు. అనంతరం రాత్రి 7.30 సమయంలో నిందితుడిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు పంపే సమయంలో ఎస్కార్ట్‌ పోలీసుల కన్నుగప్పి తిరుపతి సబ్‌జైలు వద్ద నుంచి పరారయ్యాడు. అప్పటినుంచి పోలీసులు గాలిస్తున్నారు. ఎట్టకేలకు స్థానిక మహతి ఆడిటోరియం వద్ద ఆ ఖైదీని గుర్తించి పట్టుకున్నట్లు సీఐ వెల్లడించారు. 

Updated Date - 2022-05-21T07:55:59+05:30 IST