నగరం!..ఫ్రై డే 45.1

ABN , First Publish Date - 2020-05-23T08:52:17+05:30 IST

గడచిన ఏడాది మార్చి మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు అల్లాడించేశాయి

నగరం!..ఫ్రై డే  45.1

విజయవాడ, మే 22 (ఆంధ్రజ్యోతి) :

 గడచిన ఏడాది మార్చి మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు అల్లాడించేశాయి. ఈ ఏడాది మాత్రం మే నెల మొదటివారం నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. వరుసగా నగరంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటి నమోదయ్యాయి. గురువారం 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా, శుక్రవారం అది 45.1 డిగ్రీలుగా ఉంది. వరుసగా రాబోయే మూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు ఈవిధంగానే ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. లాక్‌డౌన్‌ కారణంగా ఇన్నాళ్లూ ఖాళీగా ఉన్న రహదారులు సడలింపులు ఇచ్చిన రెండో రోజు నుంచే మళ్లీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవ్వడమే దీనికి ప్రధాన కారణం. గ్రీన్‌, ఆరెంజ్‌, రెడ్‌జోన్లలో వ్యాపారాలకు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వెసులుబాటు ఇచ్చినప్పటికీ ఎండల కారణంగా మధ్యాహ్నం 12 గంటలకే దుకాణాలను మూసివేస్తున్నారు. ఎండల తీవ్రత కారణంగా నగర రహదారులపై లాక్‌డౌన్‌ పరిస్థితులే కనిపిస్తున్నాయి. 


అందుకే ఇలా..

వేసవిలో పవనాలు ఉత్తరాది నుంచి దక్షిణాదికి వీస్తాయి. ముఖ్యంగా రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతం నుంచి తెలుగు రాష్ట్రాల్లో వేసవిలో పవనాలు వీస్తాయి. ఈ పవనాలు ప్రతి ఏడాది మే 22, 23 తర్వాత ఇటు వైపునకు రావడం మొదలుపెడతాయి. నగరంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడానికి ఆంఫన్‌ తుఫాన్‌ ఓ కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తుఫాన్‌ తీరం దాటే క్రమంలో ద్రోణి ప్రభావం వాతావరణంపై పడుతుందని, ఈ కారణంగానే వేడి గాలులు వీయడంతోపాటు ఉష్ణోగ్రతలు గరిష్ఠస్థాయిలో నమోదవుతున్నాయని కేఎల్‌ వర్సిటీ వాతావరణ శాఖ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సత్యనారాయణ ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. 

Updated Date - 2020-05-23T08:52:17+05:30 IST