పండ్లు తింటున్నారా మీరు?

ABN , First Publish Date - 2021-03-15T21:09:54+05:30 IST

పండ్లు తింటే మంచిదని అందరికీ తెలుసు. కానీ తినేవాళ్లు ఎంతమంది? బిర్యానీ, స్వీట్లు, ఐస్‌క్రీమ్‌లు తినడానికి చూపించినంత ఆసక్తి తాజాపండ్లు తినేందుకు ఇష్టపడరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యే ఇది. అందుకే ఈ ఏడాదిని ఐక్యరాజ్యసమితి... పండ్ల సంవత్సరంగా ప్రకటించింది...

పండ్లు తింటున్నారా మీరు?

పండ్లు తింటే మంచిదని అందరికీ తెలుసు. కానీ తినేవాళ్లు ఎంతమంది? బిర్యానీ, స్వీట్లు, ఐస్‌క్రీమ్‌లు తినడానికి చూపించినంత ఆసక్తి తాజాపండ్లు తినేందుకు ఇష్టపడరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యే ఇది. అందుకే ఈ ఏడాదిని ఐక్యరాజ్యసమితి... పండ్ల సంవత్సరంగా ప్రకటించింది... 


మనిషి పుట్టుకకు కారణం? భూమాత. ఆ మట్టిలోని ఖనిజాలు, లవణాలు, పోషకాలన్నీ మానవ దేహ నిర్మాణంలోనూ ఉన్నాయి. అంటే - జీవం పుట్టుక ప్రకృతిసిద్ధం అన్నమాట. మన మనుగడకు అవసరమైన ఆహారం కూడా మట్టి, చెట్టు నుంచే పుట్టింది. ఆకులు అలమలు, పండ్లు కాయలు, పంటలు, ఆహార ధాన్యం, దినుసులు, ఆకుకూరలు కూరగాయలు... ఇలా అన్నీ నేలతల్లి ప్రసాదించిన వరాలే! అందులో ముఖ్యమైనవి పండ్లు. ఒక్కో ఫలానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. రంగు, రుచి, వాసన, పోషక విలువల్లో దేనికదే సాటి! ఏదీ తక్కువ కాదు, ఏదీ ఎక్కువ కాదు. అడవుల్లోని ఆదిమానవుడి తొలి ఆహారం పండ్లు. ఆ తరువాతే ధాన్యం, గింజలు, మాంసం జత కలిశాయి. ఆధునికత విస్తరించే కొద్దీ ఆహార చైతన్యం పెరిగింది. అయితే ఇప్పుడు గుట్టలు గుట్టలుగా వచ్చి పడుతున్న జంక్‌ఫుడ్‌ మాయలో పడిపోయిన తరం.. పండ్లను తినడం తగ్గించింది. వీటి విలువ తెలిసిన వాళ్లే క్రమం తప్పకుండా రకరకాల పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ప్రకృతి మనిషికి ప్రసాదించిన అద్భుత వరం రుచికరమైన మధుర ఫలాలు. ఆ సహజమైన రుచికి మరేదీ సాటి లేదు. పండ్లు తిన్న తరువాత దొరికే సంతృప్త అనుభూతి ఖరీదైన మిఠాయిలు తిన్నా రాదు.


పండ్లు ఎందుకు తినాలి?

డాక్టర్లు మందుల చీటిలో మందుల్ని రాసి పంపే ముందు... ‘మీరు పండ్లు ఎక్కువగా తినండి’ అని నోటిమాటగా చెబుతారు. కానీ, ఆస్పత్రి నుంచి ఇంటికి రాగానే ఆ మాట మరిచిపోయి మళ్లీ మందుల్నే నమ్ముకుంటాం. పండ్లు తినడం మరిచిపోతాం. ఏ వేడుకకు వెళ్లినా పండ్లు చేతిలో పెట్టి పంపడం భారతీయ సంప్రదాయం. అయినా సరే అందులోని పరమార్థం గ్రహించం. పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిది అని మనందరికీ తెలుసు. కానీ మాంసాహారం తినడానికి చూపే ఆసక్తి పండ్లు తినడానికి చూపించం. ఆ అలవాటును జీవనశైలిలో భాగం చేసుకోం. తమ రోజువారీ ఆహారంలో భాగంగా పండ్లు, ఆకు కూరలు, కూరగాయలు తినేవాళ్లలో మొండివ్యాధులు అంత త్వరగా రావని పలు అధ్యయనాల్లో తేలింది. మన శరీర పోషణకు, నిర్వహణకు కావాల్సిన కీలకమైన పోషకాలను పండ్లు అందిస్తాయి. ప్రతి ఆహారంలోనూ కొవ్వులు ఉంటాయి కానీ పండ్లలో ఉండవు. ప్రకృతి సహజంగా దొరికే పండ్లలో కొవ్వులు, సోడియం, కేలరీలు చాలా తక్కువ. కొలెస్ట్రాల్‌ ఉండనే ఉండదు. రోజూ మూడు పూటలా భోజనం చేస్తే శరీరానికి శక్తి వస్తుందనుకుంటాం. అయితే సాధారణ భోజనం వల్ల అవసరమైన సూక్ష్మ పోషకాలన్నీ లభించవు. పొటాషియం, పీచుపదార్థాలు, విటమిన్‌ సి, పోలికామ్లం.. ఇలాంటివన్నీ పండ్ల వల్లే అందుతాయి. శరీరంలో రక్తప్రసరణ సవ్యంగా సాగేందుకు, గుండె బలిష్టంగా ఉండేందుకు పొటాషియం అవసరం. అరటి, రేగు, గంగరేగు, యాపిళ్లు, కర్భూజ, పంపర పనస, కమలా తదితర పండ్లతో పొటాషియం లభిస్తుంది.


ఆరోగ్యానికి అవే కీలకం

మనం ఆరోగ్యంగా ఉండాలంటే జీర్ణక్రియ చురుగ్గా పనిచేయాలి. అందుకు అవసరం- డైటరీ పైబర్‌, అంటే పీచుపదార్థాలు. పేగుల్ని శుభ్రం చేసేది ఈ పైబరే! ఆధునిక జీవనశైలి అనుసరిస్తున్న వాళ్లు తినే తిండిలో లోపిస్తోందీ పదార్థం. పీచు కలిగిన తిండి తినకపోవడం వల్లే జీర్ణకోశ వ్యాధులు వస్తున్నాయి. అధిక బరువు, ఊబకాయం బారిన పడుతున్నారు. డైటరీ పైబర్‌ అనేది శరీరానికి కావాల్సిన సమతుల్య ఆహారంలో ముఖ్యమైనది. పీచు ఎంత గొప్ప పనిచేస్తుందంటే - ఆహారనాళ వ్యవస్థను శుభ్రం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. మలబద్దకాన్ని తొలగిస్తుంది. డైవర్టిక్యులోసిస్‌లాంటి ఆహారనాళ వ్యాధులు రాకుండా నిరోధించడానికి ఉపయోగపడుతుంది. పీచు పదార్థాలు అధికంగా ఉన్న పండ్లు తినడం వల్ల తక్కువ కేలరీలతోనే కడుపు నిండినట్లు అవుతుంది. పండ్లను సహజంగా లేదా ముక్కలుగా కోసుకుని తినడం వల్ల మాత్రమే డైటరీపైబర్‌ ప్రయోజనాలను పూర్తీగా పొందవచ్చు. పండ్లను రసం తీసి తాగితే ఇన్నేసి లాభాలు కలగవు. ఇక, పేవుల్ని శుభ్రం చేసేందుకు పైబర్‌ ఎంత అవసరమో... శరీరంలోని అన్ని రకాల కణజాలాల మరమ్మతుకు విటమిన్‌ సి అంతే అవసరం. శరీర పెరుగుదలకు, గాయాలు, పుండ్లు మానడానికి, దంతాలు, చిగుళ్ల ఆరోగ్యానికి సి-విటమిన్‌ తప్పనిసరి. అన్నిటికంటే ముఖ్యంగా వ్యాధినిరోధక శక్తిని పెంచుకునేందుకూ ఉపకరిస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల వృద్ధికి పోలికామ్లం కూడా కీలకమైనది. ఇది పండ్లలో విరివిగా లభిస్తుంది. 


ఎప్పుడు తింటే మంచిది?

భోజనం చేసిన వెంటనే పండ్లను తినడం చాలామందికి అలవాటు. అయితే ఇలా తింటే మంచిది కాదు అనే అపోహ ఉంది. ఆయుర్వేద ఆహార సిద్ధాంతాల ప్రకారం- పండ్లను ఆహారంతో పాటు తీసుకోవడం కంటే విడిగా తింటేనే తేలిగ్గా జీర్ణం అవుతాయి. ఏ రోజులో ఏ సమయంలో అయినా పండ్లను తినొచ్చు. శరీరానికి అవసరమైన కీలక విటమిన్లు, ఖనిజ లవణాలు అందుతాయి. కాబట్టి పండ్లను ఎప్పుడు తిన్నా కూడా మంచి పోషకాహారం తీసుకున్నట్లే. భోజనం తర్వాత కానీ, భోజనంతోపాటు కానీ పండ్లు తినేప్పుడు ఎన్ని తింటున్నాం? ఎంత పరిమాణంలో తింటున్నాం? అనేది గమనించాలి. భోజనానంతరం చిరుతిళ్లుగా తీసుకునే మిఠాయిలు, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్స్‌, కేకులు, కుకీస్‌ వంటి అదనపు చక్కెర వేసిన తీపి పదార్థాల వల్ల బరువు పెరుగుతారు. తద్వారా గుండె జబ్బులు ఎక్కువయ్యే ప్రమాదం ఉందని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ పేర్కొంది. అనారోగ్యకరమైన తీపి పదార్థాలకు ఆరోగ్యకరమైన, రుచికరమైన ప్రత్యామ్నాయంగా పండ్లను ఎంచుకోవడం తెలివైన పని. దీనివల్ల చక్కెర మోతాదు నియంత్రణలో ఉంటుంది. భోజనానికీ- భోజనానికీ మధ్యలో ఆకలి నియంత్రణకు తీసుకునే అల్పాహారంగా కూడా పండ్లను ఎంచుకోవచ్చు. వీటిని తినడం తేలిక. ప్రయాణాల్లోనూ వెంట తీసుకెళ్లవచ్చు. అరటి, కమలా పండ్ల తొక్క తీసి తింటాం కాబట్టి, కడగకుండా తినే వెసులుబాటు ఉండటం సౌకర్యమే!.


ఎలాంటి పండ్లు తినాలి?

సాధారణంగా పండ్లు ఆయా రుతువులను బట్టి లభిస్తాయి. కానీ, వ్యవసాయంలో వస్తున్న శాస్త్రీయ అభివృద్ధి వల్ల నేడు అన్ని రుతువుల్లోనూ అన్ని రకాల పండ్లు దొరుకుతున్నాయి. అయితే సహజంగా ఆయా రుతువుల్లో కాసే పండ్లే తాజాగా, చౌకగా లభించే అవకాశం ఉంది. ఇక, స్థానికంగా పండే పండ్లు అయితే చెట్టు నుంచి కోసిన వెంటనే తక్కువ సమయంలోనే మన చేతికి వస్తాయి. అందువల్ల వాటిలోని పోషకాల మోతాదు, స్వభావం, రంగు, రుచిలో తేడా రాదు. ఉదాహరణకు పుచ్చకాయలు వేసవిలోనే విస్తారంగా దొరుకుతాయి. ఈ కాలంలో మనకు కావాల్సిన నీరు, పొటాషియం, చమట ద్వారా కోల్పోయే లవణాలు ఆ పండుతో భర్తీ చేసుకోవచ్చు. వర్షాకాలం ప్రారంభంలో లభించే నేరేడు పండ్లు రోగనిరోధక శక్తిని పునరుత్తేజం చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఎంతో మేలు చేస్తాయి. శీతాకాలం మొదట్లో దొరికే రేగుపండ్లు కూడా విటమిన్‌ సి తో పాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్లను పుష్కలంగా కలిగి ఉండటంతో... మన శరీరం వాతావరణ మార్పును తట్టుకునే శక్తిని సహజంగా పొందుతుంది. ఇలా రుతువులలో మాత్రమే దొరికే పండ్లతో పాటు ఏడాది పొడవునా అందుబాటులో ఉండే యాపిల్‌, అరటి, కర్భూజ లాంటి పండ్లను తరచూ తీసుకోవచ్చు. రోజూ ఒకే రకమైన పండు తినడం కంటే వేర్వేరు రకాల పండ్లను తినడమే ఉత్తమం. 


విదేశీ పండ్లు మంచివా?

నగరాలు, పట్టణాల్లోని సూపర్‌మార్కెట్లకు వెళితే అరల్లో పేర్చిన విదేశీ పండ్లు ఊరిస్తాయి. ఒకసారైనా కొని తినాలనిపిస్తుంది. వీటి ధర కూడా ఎక్కువే. అయితే ఇవి దేశీయ పండ్ల కంటే మంచివా? స్ట్రాబెర్రీలు, బ్లూ, బ్లాక్‌ బెర్రీలు, డ్రాగన్‌ ఫ్రూట్‌, చెర్రీ, కివి, లీచ్‌ తదితర విదేశీ పండ్లు ఇతర దేశాల నుంచీ దిగుమతి చేసుకునేవే. వీటిలో కొన్ని మన రాష్ట్రాల్లో పండుతున్నా స్వల్ప దిగుబడే వస్తోంది. స్థానికంగా దొరికే పండ్ల కంటే విదేశీ పండ్లలోనే పోషకాలు అధికం అన్నది కేవలం అపోహ. ప్రతి పండూ దానికంటూ ఒక ప్రత్యేక పోషక లక్షణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఏ పండు విశిష్టత దానిదే!. ప్రత్యేకంగా విదేశాల నుంచీ దిగుమతి చేసుకున్న పండ్లు సుదూర ప్రాంతాల నుంచీ రావడానికి, నిలువ ఉంచడానికి ఎక్కువ రోజులు పడుతుంది. ఇలా రోజుల తరబడి నిలువ ఉంచడం వల్ల సహజంగా ఉండే పోషకాలు క్షీణిస్తాయి. ఇలాంటి విదేశీ పండ్లు చెట్టు నుంచీ కోసిన తరువాత మన చేతికి వచ్చే సరికి కనీసం నెల రోజుల సమయం పడుతుంది. వాటికి పెట్టే ఖరీదుతో స్థానికంగా దొరికే పండ్లను ఎక్కువ మొత్తంలో కొనవచ్చు కదా. 


ఏ రూపంలో తినాలి?

అవకాశం ఉన్నంత వరకు పండును పండులా మొత్తంగా తింటేనే అది అందించే పోషకాల పూర్తీ ప్రయోజనాన్ని పొందవచ్చు. తొక్కతో సహా తినే పండ్లను పదిహేను నిమిషాల పాటు ఉప్పునీటిలో నానబెట్టి, ఆ తరువాత మంచినీళ్లలో కడిగి తినాలి. అప్పుడు పండ్ల మీదున్న రసాయనాలు, సూక్ష్మజీవులు తొలగిపోతాయి. కానీ పండ్లను కోసి, ముక్కలను కడిగి తింటే సంపూర్ణ ప్రయోజనం పొందలేరు. పండ్లను ఆహారంలో భాగం చేసుకునే ప్రయత్నంలో కొందరు వాటి రసాలను తాగేందుకే ఇష్టపడతారు. అది మంచిది కాదు. పండ్ల రసాలు పైకి ఆరోగ్యంగా కనిపించినా వాటిలో పోషకాల కంటే చక్కెరలే ఎక్కువ. సూపర్‌మార్కెట్లలో దొరికే ప్యాకేజీ పండ్ల రసాలలో అయితే చక్కెరలు చాలా అధిక మోతాదులో ఉంటాయన్నది గుర్తించాలి. అందుకే ఆ కృత్రిమ పానీయాలు అనారోగ్యకరం. పండ్ల రసాల దుకాణాల్లో జ్యూస్‌లు తాగినా లాభం అంతంతమాత్రమే. జ్యూస్‌ తయారీ ప్రక్రియలో పీచుపదార్థం, విటమిన్లు, ఖనిజాలు, లవణాలను పోగొట్టుకోవాల్సి వస్తుంది. తాజాపండ్లు తింటే బరువు తగ్గుతారు, అదే పండ్ల రసాలు తాగితే బరువు పెరుగుతారు. ఎందుకంటే అందులో చక్కెర ఎక్కువగా ఉంటుంది కాబట్టి. 


ఎండు ఫలాలతో..

తాజా పండ్లనే కాదు. ఎండు ఫలాలైన ఎండు ద్రాక్ష, అంజీర, ఖర్జూర, కిస్‌మిస్‌ లాంటి వాటిని తింటూంటాం. పండ్లలో సహజంగా ఉండే చక్కెరలు ఎండు ఫలాలలో కూడా అధిక మోతాదులో ఉంటాయి. తాజా పండ్ల ద్వారా లభించే విటమిన్‌ సి ఎండు ఫలాలతో లభించదు. తాజా పండ్లు మన కడుపును తేలికగా నింపి, ఆకలిని తీరుస్తాయి. ఎండు ఫలాలకు ఈ లక్షణం లేదు. కానీ వీటి వల్ల కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు లేకపోలేదు. ఎండు ఫలాలను ప్రయాణాల్లో తీసుకెళ్లడం తేలిక. తక్షణ శక్తి అవసరం అయినప్పుడు త్వరగా అందిస్తాయి. బరువు పెరగాలనుకునే వాళ్లకు మేలు చేస్తాయి. కొన్ని మిఠాయిల తయారీలో చక్కెరకు బదులు ఎండు ఫలాలను వాడుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు స్వీట్లకు బదులు డ్రైఫ్రూట్స్‌ను వాటితో చేసిన లడ్డూలను హాయిగా తినవచ్చు. కానీ ఎంత తింటున్నాం? ఎన్ని కేలరీల శక్తిని సమకూర్చుకున్నాం? అనే విషయాల్లో మాత్రం అప్రమత్తంగా వ్యవహరించాలి. కాండీడ్‌ ఫ్రూట్‌ (చక్కెర పాకంలో ఊరబెట్టిన పండ్లు) అనే మరో రూపంలో కూడా పండ్లు మనకు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. అవి చూడటానికి పండ్ల ముక్కల్లా కనిపిస్తూ.. విపరీతమైన తీపి కలిగి ఉంటాయి. చక్కెర మోతాదు ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. పండ్ల గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నాక ఒకటి గుర్తుంచుకోవాలి. ప్రకృతి ధర్మం ప్రకారం- ఆయా రుతువుల్లో వచ్చే సీజనల్‌ ఫ్రూట్స్‌ను తరచూ తింటే అన్ని రకాల పోషకాలు అందుతాయి. కలకాలం ఆరోగ్యంగా ఉంటాం.


కర్భూజ

బంగారు రంగులో, తీయగా ఉండే కర్భూజ పోషకాల గని. తక్కువ కేలరీలతో ఎక్కువ పోషకాలను అందించే పండ్లలో కర్భూజ ఒకటి. రెండొందల గ్రాముల పండులో కేవలం 70 కేలరీలు మాత్రమే ఉంటాయి. కానీ ఒక రోజుకు మన శరీరానికి కావాల్సిన విటమిన్‌ సి మొత్తం దీనిలో లభిస్తుంది. ఎండాకాలం తింటే ప్రయోజనం.


నేరేడు

తీపి, పులుపు, వగరుల మిశ్రమంగా ఉండే అరుదైన రుచి వీటి ప్రత్యేకం. నేరేడు పండ్లను కృత్రిమ ఇన్సులిన్‌ కనుక్కోని కాలంలో మధుమేహ చికిత్సకు వాడేవారు. విటమిన్‌ సి, పోలిక్‌యాసిడ్‌లతో పాటు పొటాషియం, జింకు, ఇనుము లాంటి అనేక ఖనిజాలు కూడా ఈ పండ్లలో పుష్కలం. వీటిలోని ఆంథోసైయానిన్లు, ఫ్లావనాయిడ్లు, టెర్పిన్లు అనే రసాయనాలు సూక్ష్మజీవనాశక, వైరస్‌ నాశక లక్షణాలతో పాటు, వాపును తగ్గించే గుణాలు, కేన్సర్‌, అలర్జీ, వృద్ధాప్య నిరోధకాలుగా పనిచేస్తాయి. 


ద్రాక్ష

వంద గ్రాముల ద్రాక్షలో కేవలం 80 కేలరీలు ఉంటాయి. విటమిన్‌ సి, కె అధికం. గాయాలైనప్పుడు రక్తం గడ్డకట్టడానికి విటమిన్‌ కె అవసరం. ఎర్ర,, నల్ల ద్రాక్షల్లో ఎక్కువగా లభించే రిజర్వేటాల్‌ అనే రసాయనం పెద్ద పేగుల కేన్సర్ల నుంచి రక్షిస్తుంది. ఆకుపచ్చ ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లను ఫ్లేవనాయిడ్లు అంటారు. కేన్సర్ల నిరోధానికి అత్యంత శక్తివంతంగా పనిచేస్తాయివి. భావోద్వేగాలు, మెదడు పనితీరును ప్రభావితం చేయడంలో ఉపకరించే విటమిన్‌ బి6 ద్రాక్షలో ఎక్కువ.


జామ

సామాన్యుల సూపర్‌ ఫ్రూట్‌ జామ. విటమిన్‌ సి, ఏ, పోలిక్‌యాసిడ్‌, పొటాషియం, కాపర్‌, మాంగనీస్‌లతో పాటు పీచుపదార్థం సమృద్ధిగా ఉండే జామ అందరిపండు. ఒక జామకాయలో అంతే బరువున్న బత్తాయి కన్నా నాలుగురెట్లు ఎక్కువ విటమిన్‌ సి ఉంటుంది. విటమిన్‌ ఎ, పోలిక్‌యాసిడ్‌లు గర్భవతులకు, గర్భందాల్చాలనే ప్రయత్నంలో ఉన్న మహిళలకు ఎంతో అవసరం. జామలో పైన చెప్పుకున్న వాటన్నిటితో పాటు ఇన్ఫెక్షన్లతో పోరాడి, రోగ నిరోధక శక్తిని పెంచి, వృద్ధాప్యాన్ని నిరోధించే యాంటీ ఆక్సిడెంట్లు అధికం. జామకాయలు తినే అలవాటున్న వాళ్లలో గ్యాస్ట్రోఎంటరైటిస్‌, డయేరియా, డీసెంట్రీ, కడుపునొప్పి, వికారం వంటి జీర్ణకోశ వ్యాధులు తక్కువని అనేక అధ్యయనాల్లో తేలింది. 


పుచ్చకాయ

వేసవిలో అందరూ ఇష్టపడే పండు పుచ్చకాయ. ఇందులో 95 శాతం నీరే ఉంటుంది. వేసవిలో కలిగే దాహార్తికి ఇది చక్కటి ఉపశమనం. తక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు పెరగరు. యాంటీ ఆక్సిడెంట్‌గానూ, కేన్సర్‌ నిరోధకంగానూ పనిచేసే ‘లైకోపిన్‌’ అనే రసాయనం మిగతా పండ్లు, కూరగాయలతో పోలిస్తే పుచ్చకాయలోనే అధికం. ఇది ప్రొస్టేట్‌, రొమ్ము, జీర్ణాశయ కేన్సర్లు, గుండె జబ్బుల నిరోధకంగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది. ఇందులోని పీచుపదార్థం జీర్ణవ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది కాబట్టి కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. ‘సిట్రుల్లైన్‌’ అనే రసాయనం వృద్దాప్యఛాయల్ని అంత త్వరగా రానివ్వదు. 


మామిడిపండు

ఆహారంలోని ఇనుమును శరీరం శోషించుకోవడానికి నోటిలోని దంతాలు, చిగుళ్ల ఆరోగ్యానికి మామిడి అవసరం. చర్మసౌందర్యాన్ని ఇనుమడింపజేస్తుందీ పండు. ఎముకల పటుత్వం, కంటిచూపును కాపాడటం, రోగాలను ఎదుర్కొనే శక్తినిచ్చే విటమిన్‌ ఏ, ఫోలేట్‌, విటమిన్‌ బీ6 వంటివన్నీ మామిడి ద్వారా పొందవచ్చు. మధుమేహం ఉన్న వాళ్లు రోజుకు ఒక పండును తీసుకోవచ్చు. మామిడిపండు జ్యూస్‌ లేదా జామ్‌గా తీసుకుంటే మాత్రం బరువు పెరిగే ప్రమాదం ఉంది.


అరటిపండు

సామాన్యుల పండు అయిన అరటిలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల... తిన్న వెంటనే శక్తి వస్తుంది. ఈ పిండి పదార్థాలు చక్కెర, పీచు రూపంలో ఉంటాయి. వీటిలో కొవ్వుశాతం స్వల్పం. అరటిలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ 45-58 మధ్య ఉండటం వల్ల... రక్తంలోని గ్లూకోజు పరిణామాన్ని పెంచవు. చక్కెర వ్యాధిగ్రస్తులు మాత్రం భోజనం చేసిన వెంటనే అరటిపండును తినకూడదు. అరటిలోని పీచు పదార్థం పెద్ద పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 


అనాస

అనాసలో సమృద్ధిగా ఉండే పిండి పదార్థాలు, చక్కెరలు శక్తిదాయకాలు. పీచుపదార్థం అధికం కాబట్టి జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్‌ సి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. శరీరం ఇనుమును శోషించుకునేందుకు కూడా విటమిన్‌ సి దోహదం చేస్తుంది. కొల్లాజిన్‌తో కలిసి చర్మాన్ని ముడుతలు పడకుండా చేస్తుంది. అనాసలోని బ్రమెలిన్‌ ఎంజైమ్‌ ప్రొటీన్లను తేలికగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఇందులోని మెగ్నీషియం, ఫాస్పరస్‌, పొటాషియం, మాంగనీస్‌, ఖనిజాలు నీళ్ల విరేచనాల చికిత్సలోనూ, అధిక రక్తపోటును నియంత్రించడంలోనూ, రక్తనాళాలలో గడ్డలు ఏర్పడకుండా చేస్తాయి.


అంజీర్‌

అన్ని పండ్లలో కంటే అంజీర్‌లో ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం ఉంటుంది. అంజీర్‌లో ఫ్లావనాయిడ్స్‌, పాలీఫినాల్స్‌ శరీరంలోని టాక్జిన్లను (వ్యర్థాలు) తొలగించి వయోసంబంధిత వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి. ఎండు అంజీర్‌లో కాల్షియంతో పాటు కాపర్‌, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్‌, విటమిన్‌ కే వంటి మరిన్ని ఖనిజ లవణాలు ఉండటం వల్ల ... ఇవి పిల్లలకు ఎంతో ఆరోగ్యకరం. తాజా లేదా ఎండు ఫలాలను ఉదయాన్నే తీసుకుంటే మలబద్దక సమస్య తొలగుతుంది.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

Updated Date - 2021-03-15T21:09:54+05:30 IST