పండ్ల ధరలు పైపైకి..

ABN , First Publish Date - 2021-06-24T04:40:26+05:30 IST

గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం అమాంతం పెరిగిపోతున్న పండ్ల ధరలతో సామాన్యుడు వాటిని కొనలేని పరిస్థితి నెలకొంది.

పండ్ల ధరలు పైపైకి..
పరవాడలో వివిధ రకాల పండ్ల అమ్మకాలు

గతంలో పోలిస్తే చాలా ఎక్కువ

బెంబేలెత్తుతున్న సామాన్యులు


పరవాడ, జూన్‌ 23: కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రజలకు అన్ని విధాలా దడ పుట్టిస్తోంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి కరోనా త్వరగా వచ్చే ప్రమాదం ఉందని, ముప్పు నుంచి బయట పడాలంటే రోగ నిరోధక శక్తి ఉన్న పదార్థాలు, పండ్లు ప్రతి ఒక్కరూ తినాలని వైద్యులు చెబుతుండడంతో ప్రజలు ఆ దిశగా దృష్టి సారించారు. దీంతో వివిధ రకాల పండ్ల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. గిరాకీ పెరగడంతో వాటి ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం అమాంతం పెరిగిపోతున్న పండ్ల ధరలతో సామాన్యుడు వాటిని కొనలేని పరిస్థితి నెలకొంది. కరోనా కష్ట కాలంలో ఉపాధి కోల్పోయి అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. పండ్లకు ఉన్న గిరాకీని సొమ్ము చేసుకోవాలని కొందరు వ్యాపారులు ధరలు అమాంతంగా పెంచేస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ధరల నియంత్రణపై అధికారులు దృష్టి సారించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని వినియోగదారులు వాపోతున్నారు. మండలంలోని పరవాడ, గొర్లెవానిపాలెం, దేశపాత్రునిపాలెం, వాడచీపురుపల్లి ప్రాంతాల్లో పండ్ల వ్యాపారం సాగుతోంది. గతంలో ఆపిల్‌ డజను రూ.150 ఉంటే ప్రస్తుతం రూ.200 ఉంది. అలాగే బత్తాయి డజను రూ.80 ఉంటే ఇప్పుడు రూ.120, దానిమ్మ రూ. 80 ఉంటే ఇప్పుడు రూ.120, కివి పండ్లు మూడు రూ.100 ఉంటే ప్రస్తుతం రూ.150, ద్రాక్ష కిలో రూ.60 ఉంటే ఇప్పుడు రూ.90, బొప్పాయి పెద్దది రూ.50 ఉంటే ఇప్పుడు రూ.80 పలుకుతోంది. కరోనా నేపథ్యంలో మునుపెన్నడూ లేని విధంగా పండ్ల ధరలు అమాంతం పెంచేశారు. దీని వల్ల సామాన్యుడు పండ్లు కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది. 


Updated Date - 2021-06-24T04:40:26+05:30 IST