ఇల్లు ఇస్తామని.. నిండా ముంచాడు

ABN , First Publish Date - 2021-05-06T06:21:30+05:30 IST

ఇవాళ సమాజంలో సొంత ఇల్లు అనేది అందరి కల.. అలాంటి కల కష్టపడకుండానే నెరవేరుస్తామని ఓ కటుంబాన్ని నిండా ముంచిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇల్లు ఇస్తామని.. నిండా ముంచాడు
అగంతుకుడు వదిలేసి వెళ్లిన దొంగనోట్లను చూపుతూ.. న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధిత కుటుంబం

  సీఎం పేషీ వారిమంటూ చుంచుపల్లి మండల వాసికి కుచ్చుటోపీ 

 రూ.75లక్షల విలువైన ఇల్లు మంజూరైందని మాయమాటలు 

 రూ.35లక్షలు చెల్లించాలని డిమాండ్‌  

 చేతిలో డబ్బు పడగానే దొంగనోట్ల బ్యాగ్‌ పెట్టి ఉడాయింపు

 భద్రాద్రి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన

చుంచుపల్లి, మే 5: ఇవాళ సమాజంలో సొంత ఇల్లు అనేది అందరి కల.. అలాంటి కల కష్టపడకుండానే నెరవేరుస్తామని ఓ కటుంబాన్ని నిండా ముంచిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రతి ఏడాది ప్రభుత్వం సీఎం పేషీ నుంచి అర్హులైన వారికి సుమారు రూ.75లక్షల నుంచి రూ.90లక్షల విలువగల ఇల్లు కట్టి అందజేస్తారని నమ్మ బలికి చివరికి డబ్బుతో ఉడాయించాడు ఓ అగంతకుడు.  బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గతనెల 13న చుంచుపల్లి మండలం రాంనగర్‌కు ఓ వ్యక్తి వచ్చి తాను ప్రభుత్వ అధికారినని, హైదరాబాద్‌ నుంచి వచ్చానని గ్రామానికి చెందిన గుగులోతు శంకర్‌, విరాని దంపతు లను పరిచయం చేసుకున్నాడు. తరువాత ఈ ఏడాది రూ.75లక్షల విలువైన బహుళ అంతస్తు భవనం ప్రభుత్వం నుంచి మీకు మంజూరైందని ఆశ చూపించాడు. ఆ గృహం దక్కించుకోవాలంటే రూ.35లక్షలు డిపాజిట్‌ చేయాలని, మిగతా నగదు రాయితీకింద మంజూరవుతుందని నమ్మ బలికాడు. దాంతో బాధితుడు ఈ మొత్తాన్ని తొలి విడత రూ.10లక్షలు, రెండో విడత రూ.7లక్షలు, మూడో విడత రూ.3లక్షలు, నాలుగో విడత బాధితుడి అల్లుడు రూ.10 లక్షలు చెల్లించగా చివరిగా ఐదో విడత రూ.5లక్షలు చెల్లిం చారు. మొత్తం రూ.35లక్షలు చెల్లించిన మరుసటి రోజు బాధితులు సదరు వ్యక్తికి ఫోన్‌ తమ ఇంటి సంగతి ఏంటని ఆరా తీయగా,  సార్‌తో మాట్లాడి ఖచ్చితంగా ఇల్లు వచ్చేలా చేస్తానని చెప్పాడు. అయినా తరువాత స్పందించ కపోవడంతో సదరు వ్యక్తిని బాధితుడు శంకర్‌ కుటుంబ సభ్యులు ఫోన్‌లో నిలదీయగా ఇల్లు రిజిస్ట్రేషన్‌ చేయాలంటే రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో రూ.3.60లక్షలు చలానా కట్టాలని, ఆ డబ్బును సిద్ధం చేసుకోవాలని సూచించాడు. అయితే చలానా విషయం తొలుత ప్రస్తావించకుండా ఇప్పుడు చెప్పడమేంటని బాధితుడు శంకర్‌, ఆయన కుటుంబ సభ్యులు సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో  అంతగా అనుమానం ఉంటే రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో వెళ్లి కనుక్కోవాలని అపరిచిత వ్యక్తి తేల్చిచెప్పాడు.

పక్కాగా నమ్మించిన అగంతకుడు 

ఇంటికోసం విడతల వారీగా వసూలు చేసిన రూ.30 లక్షలను అగంతకుడు బాధితుడు శంకర్‌ ఇంట్లోనే దాచి ఉంచి నమ్మబలికాడు. సొమ్ము తమ వద్దనే ఉండడంతో ఇందులో మోసం ఏం లేదని బాధితుడు శంకర్‌ భావిం చాడు. ఈ క్రమంలో తాను రాంనగర్‌కు వచ్చి ఇల్లును రిజిస్ట్రేషన్‌ చేయిస్తానని, ఈలోపు మిగతా 5లక్షలు కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పడంతో ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి మరో రూ.5లక్షలు కలిపి మొత్తం రూ.35లక్షలను అగంతకుడికి ఇవ్వగా మరుసటి రోజు ఆ నగదును ఒక చిన్న బ్యాగ్‌లో సర్దుకొని, మరో పెద్ద బ్యాగ్‌ను బాధితుడు శంకర్‌ ఇంట్లో ఉంచి అందులో రూ.60లక్షలు నగదు ఉందని, తాను మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. అయితే నాలుగు రోజులు గడిచినా అతడు రాకపోవడంతో బాధితుడు శంకర్‌ ఆ వ్యక్తికి ఫోన్‌ చేయగా, నగదు తీసుకున్న వ్యక్తి గొంతు మార్చి మాట్లాడుతున్నట్లు గుర్తించి ఇంట్లో వారికి చెప్పాడు. ఒకే వ్యక్తి  గొంతు మారుస్తూ మాట్లాడటంతోపాటు వరుసగా అసభ్య పదజాలంతో కోపం గా మాట్లాడుతుండగా బాధితులకు అనుమానం వచ్చి చలానా రూ.3.60లక్షలు ఇవ్వనందుకు కోపగి స్తున్నాడని భావించి కొత్తగూడెం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి చలానా కట్టేందుకు సం బంధించిన ధ్రువపత్రాల కోసం అడిగారు. అయితే చలానా కేవలం బ్యాంకులోనే కట్టా లని అక్కడి సిబ్బంది చెప్పడంతో బ్యాంక్‌కు వెళ్లేందుకు ఇంటికి వచ్చి అపరిచిత వ్యక్తి ఇచ్చిన బ్యాగ్‌లో ఉన్న నగదు తీసుకునేందుకు ప్రయత్నించగా ఆ బ్యాగ్‌కు తాళం వేసి ఉండ టంతో దాన్ని తొలగించి నగదును చూడగా అందులో దొంగనోట్లు ఉండడంతో తాము మోసపోయామని గుర్తించారు. కరోనా సమ యంలో ఉన్నది ఊడ్చి అప్పులు చేసి రూ.35 లక్షలు చెల్లించామని, ప్రస్తుతం తినడానికి తిండి కూడా కరువైందని, తమను ఆదుకొని నాకు న్యాయం చేయాలని బాధితుడు శంకర్‌ వేడుకున్నాడు. మరుగుజ్జునైన తనకు 53 సంవత్సరాల వయస్సు ఉందని, ఆరోగ్యం కూడా సహకరించడంలేదని, అపరిచిత వ్యక్తి నుంచి నగదును రికవరీ చేసి న్యాయం చేయాలని చుంచుపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఓ అపరిచిత వ్యక్తి కేవలం 25రోజుల వ్యవధిలో మాయమాటలు చెప్పి రూ.35లక్షలు ఉడాయించడం స్థాయికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.


Updated Date - 2021-05-06T06:21:30+05:30 IST