రేపటి నుంచే.. పది పరీక్షలు....

ABN , First Publish Date - 2022-04-25T05:30:00+05:30 IST

జిల్లాలో పదో తరగతి పరీక్షలు బుధవారం నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యా ప్రాంతీయ సంచాలకులు ఎం.వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పరీక్షల కోసం జిల్లాలో 241 కేంద్రాలు ఏర్పాటు చేయగా 38,379 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు చెప్పారు.

రేపటి నుంచే.. పది పరీక్షలు....

కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరి 

విద్యార్థులు 38,379 మంది

కేంద్రాలు 241

సమస్యాత్మక  కేంద్రాలు 10 

ఐదుచోట్ల సీసీ కేమెరాలు

అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 63032 16534

వివరాలు వెల్లడించిన ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి

కడప(ఎడ్యుకేషన్‌), ఏప్రిల్‌ 25 : జిల్లాలో పదో తరగతి పరీక్షలు బుధవారం నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యా ప్రాంతీయ సంచాలకులు ఎం.వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పరీక్షల కోసం జిల్లాలో 241 కేంద్రాలు ఏర్పాటు చేయగా 38,379 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు చెప్పారు. కడప డీఈవో కార్యాలయంలో సోమవారం జిల్లా విద్యాశాఖాధికారి దేవరాజ్‌, పరీక్షల విభాగం జిల్లా అసిస్టెంట్‌ కవిషనర్‌ వెంకటేశ్‌తో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ మాట్లాడుతూ కొవిడ్‌ వల్ల రెండేళ్లుగా పదో తరగతి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను ప్రభుత్వం ఉత్తీర్ణులను చేసిందన్నారు. ఈ ఏడాది కొవిడ్‌  ఉధృతి తక్కువగా ఉండడంతో ఈ నెల 27వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 


కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరి

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కో గదిలో 16 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నారు. కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, చీఫ్‌, డిపార్మెంట్‌ అధికారులు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది. కేంద్రాల వద్ద శానిటైజర్‌ ఏర్పాటు చేస్తారు.


విద్యార్థులు.. కేంద్రాలు

జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 842 పాఠశాలల నుంచి 241 కేంద్రాల్లో 38,397 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్షల పర్యవేక్షణకు 24 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 241 డిపార్ట్మెంట్‌ అధికారులను ఏర్పాటు చేశారు. 10 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి వాటిలో సిట్టింగ్‌ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఐదు కేంద్రాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.


మారిన పరీక్ష విధానం

పబ్లిక్‌ పరీక్ష విధానం తొలిసారిగా మారింది. గతంలో ఉన్న 11 పేపర్లను ప్రస్తుతం 7 పేపర్లకు కుదించారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. 24 పేజీలతో కూడిన బుక్‌లెట్‌ రూపంలో జవాబు పత్రం ఉంటుంది. ఆ బుక్‌లెట్‌లోనే అన్ని జవాబులు పొందుపరచాలి. అడిషనల్‌ షీట్లు ఉండవు. బార్‌కోడింగ్‌ విధానం అమలులో ఉంటుంది.


25/1997 చట్టం అమలు

సిబ్బంది, అధికారులు చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడినా, విద్యార్థులు మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడినా వారికి ఎవరైనా సహకరించినా 25/1997 చట్టం అమలులో ఉంటుంది. నిబంధనలకు వ్యతిరేకంగా పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవు.


ఎలక్ర్టానిక్‌ పరికరాలు నిషేధం

పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ర్టానిక్‌ పరికరాలకు అనుమతి లేదు. డిపార్మెంట్‌ అధికారులు, ఇన్విజిలేటర్లు సెల్‌ఫోన్లు వాడకూడదు. అత్యవసర పరిస్థితుల్లో  మాత్రమే వినియోగించాలి. విద్యార్థులు కూడా ఎలక్ర్టానిక్‌ సబంధించిన ఎటువంటి పరికరాలు పరీక్షా కేంద్రాల్లోనికి తీసుకురాకూడదు.


ఐదు కేంద్రాల్లో సీసీ కెమెరాలు

జిల్లాలో పైలేట్‌ ప్రాజెక్టుగా 5 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్ట మండలం న్యూ మాధవరం జడ్పీ హై స్కూల్‌, పెనగలూరు మండలం చక్రంపేట జడ్పీ హైస్కూల్‌, బి.కోడూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కమలాపురం జడ్పీ బాలికల హైస్కూల్‌, మైదుకూరు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.


ఇవే సమస్యాత్మకం

జిల్లాలో 10 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి వాటిలో సిట్టింగ్‌ స్క్వాడ్‌ ఏర్పాటు  చేశారు. పెండ్లిమర్రి మండలం నందిమండలం జడ్పీహెచ్‌ఎస్‌, బి.మఠం మండల కందిమల్లయ్యపల్లె జడ్పీ హెచ్‌ఎస్‌ (బాయ్స్‌), కమలాపురం జడ్పీ హెచ్‌ఎస్‌ (బాయ్స్‌), చాపాడు జడ్పీహెచ్‌ఎస్‌, దువ్వూరు జడ్పీహెచ్‌ఎస్‌, వేంపల్లి జడ్పీహెచ్‌ఎస్‌(బాయ్స్‌), ఓబులవారిపల్లె, వేంపల్లె, పెనగలూరు మండలం చక్రంపేట జడ్పీహెచ్‌ఎస్‌, ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లి ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.


పరీక్ష కేంద్రాల వద్ద  144 సెక్షన్‌ 

పరీక్షా కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. ఆయా పరిసర ప్రాంతాల్లో జిరాక్స్‌ సెంటర్లు మూసివేస్తారు.


కంట్రోల్‌ రూమ్‌

పదో తరగతి పరీక్షలకు సంబంఽధించి ఎటువంటి సమస్యలు తలెత్తినా డీఈవో కార్యాలయం 6303216534 నెంబర్‌తో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేయవచ్చు. 24 గంటలు అందుబాటులో ఉంటుంది. పరీక్షలకు సంబంధించి ఎటువంటి సమస్య ఉత్పన్నమైనా ఈ నెంబర్‌కు ఫోన్‌ చేసి తెలియజేయవచ్చు.


ఆర్టీసీ బస్సుల్లో..

పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఆర్టీసీ అధికరారులు కల్పించారు. బాలికలకు ఉచితంగా బస్సు పాసులు ఉండటం వల్ల వారికి ఇబ్బంది లేదు. అలాగే బాలబాలికలందరూ హాల్‌ టికెట్‌ చూపించి ఉచితంగా ప్రయాణించొచ్చు.

Updated Date - 2022-04-25T05:30:00+05:30 IST