నేటి నుంచి సామాన్యులకు టీకా

ABN , First Publish Date - 2021-03-01T05:40:39+05:30 IST

సామాన్యులకు కరోనా టీకా అందుబాటులో వచ్చింది. జిల్లాలో సోమవారం నుంచి మూడో విడత వ్యాక్సినేషన్‌ మొదలవుతోంది.

నేటి నుంచి సామాన్యులకు టీకా

  1. 60 ఏళ్లు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు వ్యాక్సిన్‌ 
  2. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితం.. ప్రైవేటులో రూ.150
  3. డీఎంహెచ్‌వో డాక్టర్‌ రామగిడ్డయ్య


కర్నూలు(హాస్పిటల్‌), ఫిబ్రవరి 28: సామాన్యులకు కరోనా టీకా అందుబాటులో వచ్చింది. జిల్లాలో సోమవారం నుంచి మూడో విడత వ్యాక్సినేషన్‌ మొదలవుతోంది. 60 ఏళ్ల వయసు పైబడిన వారు, 45 ఏళ్లు పైబడి.. కోమార్చిడిటీస్‌ కలిగిన 6 లక్షల మందికి టీకాలు ఇవ్వనున్నారు. జిల్లాలోని 40 ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య కేంద్రాల్లో సోమవారం నుంచి మూడో విడత వ్యాక్సినేషన్‌ ప్రారంభిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య వెల్లడించారు. 60 సంవత్సరాల వయస్సు పైబడి నవారు, 45-49 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి, క్యాన్సర్‌, షుగర్‌, గుండె జబ్బులు, రక్తపోటు వంటి  దీర్ఘకాలిక జబ్బులు సమస్యలు ఉన్నవారికి వ్యాక్సిన్‌ వేస్తామని తెలిపారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకాలు ఉచితంగా వేస్తామన్నారు. మొదటి రోజు 10 కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలు, 7 ప్రైవేటు ఆసుపత్రు లు, 23 ప్రభుత్వ కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. 


52 నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో.. 

జిల్లాలో ఆరోగ్యశ్రీ గుర్తింపు ఉన్న 52 ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఉంటుందని డీఎంహెచ్‌వో తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒక్కో డోసు ధర రూ.150గా ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికి రూ.100 సర్వీస్‌ చార్జ్‌తో కలిపి రూ.250 మాత్రమే తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కొవిడ్‌ సాఫ్ట్‌వేర్‌ లేదా ఆరోగ్యసేతు యాప్‌, మీసేవా  కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ కోసం పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్‌కు వెళ్లేటప్పుడు గుర్తింపు కోసం ఆధార్‌, ఓటరు కార్డు తీసుకుని వెళ్లాలని కోరారు. 


ఇద్దరికి పాజిటివ్‌

జిల్లాలో గత 24 గంటల్లో ఇద్దరికి కరోనా వైరస్‌ సోకింది. మొత్తం బాధితుల సంఖ్య 60,880కి చేరింది. ఇందులో 28 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 60,363 మంది కోలుకున్నారు. 

Updated Date - 2021-03-01T05:40:39+05:30 IST