ప్రయోగశాల నుంచి.. పొలాల్లోకి!

ABN , First Publish Date - 2022-06-22T09:26:36+05:30 IST

ఆఫీసులో కూర్చొని పూటకు ఎన్ని సాఫ్ట్‌వేర్లనైనా తయారుచేయచ్చు. కానీ గుప్పెడు మెతుకుల్ని పుట్టించలేమనేది వాస్తవం.

ప్రయోగశాల నుంచి.. పొలాల్లోకి!

ఆమె అన్నదాతకు లాభం చేకూర్చే నూతన ఆలోచనకు శ్రీకారం చుట్టింది. తాను పండించిన పంటను రైతే నేరుగా వినియోగదారుడి ముంగిట నిలిపిన ఆమె వినూత్న అలోచనకు  అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రయోగశాల నుంచి పొలాల బాట పట్టి... ప్రయోగాలకు తెరతీసిన అగ్రిఘర్‌ వ్యవస్థాపకురాలు డా. సుంకర సౌమిను ‘నవ్య’ పలకరించినప్పుడు  తన అనుభవాలు పంచుకున్నారు  


ఫీసులో కూర్చొని పూటకు ఎన్ని సాఫ్ట్‌వేర్లనైనా తయారుచేయచ్చు. కానీ గుప్పెడు మెతుకుల్ని పుట్టించలేమనేది వాస్తవం.  నాలుగేళ్లు నోట్లోకెళ్లేందుకే ప్రతి ఒక్కరూ కష్టపడేది. మరి, ఆ తినే ఆహారం స్వచ్ఛమైంది అయిండాలి. పేద, మధ్యతరగతికి అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ప్రారంభమైందే ‘అగ్రిఘర్‌ సర్వీసెస్‌’. పల్లెల్లోని రైతులంతా బతుకుతెరువు కోసం పట్టణాలకు, ఉద్యోగాల కోసం యువత నగరాల బాట పడితే, దేశానికి తిండి పెట్టేదెవరు. గ్రామాల్లోనే వ్యవసాయ రంగంతో అనుసంబంధానమైన ఉపాధి అవకాశాలు బోలెడున్నాయి. వాటిని రైతులతో పాటు యువతీ, యువకులకు పరిచయం చేయాలి. తాము పండించిన ధాన్యాన్ని అన్నదాతలే లాభదాయకంగా అమ్ముకునే అవకాశాన్ని కల్పించాలి. ఈ సుదీర్ఘ లక్ష్యాల పునాదిగా అగ్రిఘర్‌ ఆలోచన పురుడు పోసుకుంది. దాన్ని కార్యరూపంలోకి తెచ్చేందుకు, చౌటుప్పల్‌లో ఆరు మల్టీ ప్రాసెసింగ్‌ యూనిట్లతో పరిశ్రమ నిర్మిస్తున్నాను. దానికి అనుబంధంగా కూరగాయలు, పండ్ల నిల్వకు వీలుగా చిన్న కోల్డు స్టోరేజ్‌ అందుబాటులో ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తులు... మినుములు, కందులు, పెసలు, రాగులు, సజ్జలు వంటి ధాన్యాలను పొలాల నుంచి నేరుగా రైతులు మా వద్దకు తెచ్చి, ప్రాసెసింగ్‌ చేయించుకుంటారు. వాటిని పప్పుధాన్యాలు, పొడులు వంటి రకరకాల పద్ధతుల్లో మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఉదాహరణకు మినుములు తెస్తే, గుండ్లుగాను, మినప్పప్పుగాను, మినపపిండిగానూ ప్రాసెస్‌ చేసి ఇస్తాం. పొడి ఆహార ఉత్పత్తులకూ అంతర్జాతీయ విపణిలో మంచి గిరాకీ ఉంది. కనుక వాటి తయారీకి ప్రత్యేకంగా సోలార్‌ డీహైడ్రేషన్‌ సిస్టంను వాడుతున్నాం. అందులోనే వంటనూనెల ప్రాసెసింగ్‌ యూనిట్‌ కూడా మరొకటి ఉంటుంది. ఇవన్నీ పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా సోలార్‌ ఎనర్జీమీద నడుస్తాయి. అంతర్లీనంగా సేంద్రీయ సాగును ప్రోత్సహించడం ఇందులో భాగమే.! 


అంతర్జాతీయ స్థాయిలో...

ఒక కేజీ మినుములు సుమారుగా రైతు రూ. నలభైకి అమ్మితే, దళారీల ద్వారా వినియోగదారుడికి మినప్పప్పు రూపంలో అవి వంద రూపాయలకు అందుతున్నాయి. అదే మినుములు పండించిన రైతే నేరుగా మినపప్పు అమ్మితే, అన్నదాతకు లాభమే కదా.! ఆ లాభాన్ని రైతులకు అందేలా చేయడమే అగ్రిఘర్‌ ఉద్దేశ్యం. ఇలాంటి ప్రాసెసింగ్‌ యూనిట్‌ మండలానికి ఒకటన్నా ఉండాలి. రైతులంతా కలిసి ఒక సమూహంగా దాన్ని నిర్వహించాలి. అదెలా నడపచ్చు అనే విషయాన్ని తెలియచెప్పేందుకు ఒక నమూనాగా అగ్రిఘర్‌ను ప్రారంభించాను. దీంతో పాటు వ్యవసాయానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా డిజిటలైజేషన్‌ చేసే మరొక ప్రణాళికనూ రూపొందించాను. తద్వారా సాగు పరిశోధనలకూ అదొక రీసోర్స్‌ సెంటర్‌లా ఉండాలనేది నా కోరిక. ఇదంతా పూర్తిస్థాయి కార్యరూపం దాల్చేందుకు మరో ఆరునెలలు పట్టచ్చు. నా ఆలోచనకు అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించడం సంతోషం. కామన్‌వెల్త్‌ సెక్రటేరియేట్‌ వీడియో ప్రమోటింగ్‌కు 54 దేశాల నుంచి నాలుగు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కాన్సెప్టులు ఎంపికైతే, అందులో భారత్‌ నుంచి అగ్రిఘర్‌ ఒకటి. సార్క్‌-2022లో గ్లోబల్‌ స్టార్టప్‌ అవార్డుల జాబితాకూ ఎక్కింది. 


జీవన నైపుణ్యాలశిక్షణ...

గ్రామాల్లోనే యువత ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సృష్టించుకునేలా శిక్షణలు ఇవ్వడం అగ్రిఘర్‌ కాన్సెప్టులో మరో ముఖ్య అంశం. ప్రతి పల్లెలో ఎక్కడికక్కడ చిన్నచిన్న ప్రాసెసింగ్‌ యూనిట్లు పెద్ద సంఖ్యలో రావాలి. ఇవాళ రూ. యాభై వేలు నుంచి రూ. రెండు కోట్లు వరకూ... పెట్టుబడితో ఈ పరిశ్రమను నెలకొల్పవచ్చు. తదనుగుణంగా మార్కెటింగ్‌ విభాగాన్ని తయారుచేయాలి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు సుమారు కొన్ని వందల అవకాశాలను వ్యవసాయానికి అనుబంధంగా సృష్టించుకోవచ్చు. వాటన్నింటి మీదా యువతీ, యువకులకు శిక్షణ ఇస్తాం. దాంతో వాళ్లు సొంత ఊర్లోనే ఉంటూ జీవనోపాధి మార్గాలను వెతుక్కోవచ్చు. అయితే, ఒక వ్యక్తిగా నేను చేయగలింది చాలా తక్కువ. కనుక ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కాన్సెప్టును ముందుకుతీసుకెళ్లాలి. ఇదొక మహోద్యమంలా సాగాలి. 


అత్తింటి ప్రోత్సాహంతో...

నేను పుట్టి, పెరిగిందంతా వరంగల్‌లోనే. చిన్నప్పటి నుంచి చదువులో టాపర్ని. డిగ్రీలోనూ కాకతీయ యూనివర్సిటీ గోల్డ్‌మెడల్‌ అందుకున్నాను. కోఠి ఉమెన్స్‌ కాలేజీలో బయోటెక్నాలజీ పీజీ మొదటి బ్యాచ్‌ నాది. తర్వాత పెళ్లి అయింది. కుటుంబ బాధ్యతలతో ఇక చదవడం కష్టం అనుకున్నాను. కానీ ‘నాకు మల్లే ఇంటికే పరిమితం అవ్వకు’ అన్న మా అత్తమ్మ కనపర్తి ఉషారాణి మాటలు నన్ను తిరిగి చదువు వైపు మళ్లించాయి. హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో ఎంటెక్‌  బయోటెక్నాలజీ, ఆపై ఇక్రిశాట్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశాను. అందులోనూ బెస్ట్‌ పోస్టర్‌ అవార్డు తీసుకున్నాను. వేరుశెనగకు బూజు పట్టినప్పుడు కొన్నిరకాల హానికర టాక్సిన్స్‌ విడుదల అవుతాయి. వాటిని నిలువరించే పద్ధతి మీద నా పరిశోధనంతా సాగింది. మా మామయ్య కళాథర్‌కూ చదువు అంటే చాలా ఇష్టం. నా భర్త కల్యాణ్‌ సహకారంతో పాటు అత్త, మామల అండదండల వల్లే నా జీవితాన్ని నాకు నచ్చినట్టు తీర్చిదిద్దుకోగలిగాను. తర్వాత పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టాను. ఆ క్రమంలో ఎదురయ్యే ఒడుదొడుకులను సునాయాసంగా దాటగలిగాను. పెళ్లి అయ్యాక ఆడవాళ్ల ఆశలు, ఆశయాలు మారతాయని చాలామంది అభిప్రాయం. అది సరికాదనడానికి నా మెట్టినిల్లే నిదర్శనం. 


క్షేత్రస్థాయి పర్యటనలో...

ఒక ల్యాబ్‌లో పరిశోధన కన్నా, ఫీల్డ్‌లో ప్రయోగాలు చేయడం ద్వారా ఫలితాలు త్వరగా లబ్దిదారులకు చేరతాయి అనిపించింది. దాంతో తెలంగాణ సెర్ప్‌లో వరల్డ్‌ బ్యాంకు ప్రాజెక్టు కన్సల్టెంట్‌గా చేరాను. అప్పటి సెర్ప్‌ సీఈవో ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి సర్‌ మార్గదర్శకత్వంలో ఊర్లకు వెళ్లి రైతులను కలిసేదాన్ని. అగ్రిఘర్‌లోనూ మురళి సర్‌ ముఖ్య సలహాదారుగా ఉన్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఆయన తపన ఆదర్శనీయం. అలాంటి ఐఏఎస్‌లు అత్యంత అరుదు కూడా! గ్రామాలకు వెళ్లడం ద్వారా ఆరుగాలం పడించిన అన్నదాతకు నష్టమెక్కడ తలెత్తుతుందో సులువుగా పసిగట్టగలిగాను. కూరగాయల సాగు మీద స్వయం సహాయ బృందాలకు, రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించాను. బ్యాంకు రుణాలు తదితర సదుపాయాల గురించి తెలియజేయడం వంటివన్నీ అప్పటి నా బాధ్యతలో భాగమే! ఆ సమయంలో పుస్తకాలలో కన్నా, పరిశోధనా కేంద్రంలోకన్నా పంటపొలాల్లోనే నేనెక్కువ నేర్చుకోగలిగానని గర్వంగా చెప్పగలను. అందులో రైతులే నాకు ఉపాధ్యాయులు. వాళ్ల నుంచి నేర్చుకున్న జ్ఞానాన్ని, అగ్రిఘర్‌ రూపంలో తిరిగి వాళ్లకు ఇస్తున్నాను. ఈ కాన్సెప్టును మిగతా రాష్ట్రాలకూ పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నాను. 


కె. వెంకటేశ్‌

ఫొటోలు: కొప్పిశెట్టి శ్రీనివాస్‌


గ్రామాలకు వెళ్లడం ద్వారా ఆరుగాలం పడించిన అన్నదాతకు నష్టమెక్కడ తలెత్తుతుందో సులువుగా పసిగట్టగలిగాను. కూరగాయల సాగు మీద స్వయం సహాయ బృందాలకు, రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించాను. బ్యాంకు రుణాలు తదితర సదుపాయాల గురించి తెలియజేయడం వంటివన్నీ అప్పటి నా బాధ్యతలో భాగమే.! ఆ సమయంలో పుస్తకాలలో కన్నా, పరిశోధనా కేంద్రంలోకన్నా పంటపొలాల్లోనే నేనెక్కువ నేర్చుకోగలిగానని గర్వంగా చెప్పగలను. 

Updated Date - 2022-06-22T09:26:36+05:30 IST