8వ తేది నుంచి దైవదర్శనం?

ABN , First Publish Date - 2020-06-04T10:16:56+05:30 IST

రెండున్నర నెలలుగా ఎదురుచూస్తున్న భక్తులకు త్వరలో ఆలయాల్లో ప్రవేశం, దైవ దర్శనం లభించే అవకాశాలు ఉన్నాయి.

8వ తేది నుంచి దైవదర్శనం?

  • అధికారుల ముందస్తు కసరత్తు

కడప (సిటీ), జూన్‌ 3: రెండున్నర నెలలుగా ఎదురుచూస్తున్న భక్తులకు త్వరలో ఆలయాల్లో ప్రవేశం, దైవ దర్శనం లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 30 వతేదీ వరకు లాక్‌డౌన్‌ పొడిగించినప్పటికీ ప్రార్థనా స్థలాల్లో 8వ తేది నుంచి ప్రవేశం కల్పించుకోవచ్చన్న కేంద్ర ప్రభుత్వం సూచనలతో భక్తుల్లో ఆనందం నెలకొంది. 74 రోజులుగా భక్తులకు ఆలయ ప్రవేశం లేదు. ఇలాంటి సమయంలో తిరుమలలో దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంతో కేంద్ర సూచనల మేర ఈ నెల 8 నుంచి అన్ని ఆలయాల్లో ప్రవేశం కల్పించే అవకాశాలు ఉన్నాయి.


రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే జిల్లాలో దేవదాయశాఖ గుర్తింపు పొందిన 2950 ఆలయాలతో పాటు ప్రైవేటు ఆలయాల్లో సైతం భక్తులకు ప్రవేశం లభిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే అవకాశాలుండడంతో అధికారులు ఆలయాలవద్ద చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్తలపై కసరత్తు ప్రారంభించారు. ఈ విషయమై దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శంకరబాలాజీ స్పందిస్తూ ప్రభుత్వ ఆదేశాలు, ఉన్నతాధికారుల సూచనల మేర ముందుకెళతామన్నారు. ఈ నెల 8న ఆలయాల్లో ప్రవేశంపై తమకు ఇంత వరకు ఎలాంటి ఉత్తర్వులు లేదన్నారు. కాగా లాక్‌డౌన్‌ కాలంలో ప్రతి ఆలయంలో పూజలు, కైంకర్యాలు విధిగా నిర్వహించామన్నారు.

Updated Date - 2020-06-04T10:16:56+05:30 IST