మిగులు నుంచి లోటుకు!

ABN , First Publish Date - 2021-11-26T08:16:16+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ‘ఆర్నెల్ల ముచ్చట’గా మారింది. బడ్జెట్‌లో రెవెన్యూ మిగులు చూపగా.. వాస్తవంగా ఆర్నెల్లలోనే రెవెన్యూ లోటుకు చేరింది.

మిగులు నుంచి లోటుకు!

  • ఆరు నెలల్లోనే తారుమారైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి
  • బడ్జెట్‌లో రెవెన్యూ మిగులు రూ.6743 కోట్లు చూపిన సర్కారు.. 
  • 6 నెలల్లోనే రూ.8058 కోట్ల లోటు!
  • రుణాలు కూడా 56% తీసేసుకున్నారు..
  •  ఇదీ తెలంగాణ ఆర్థిక స్థితి.. కాగ్‌ గణాంకాల్లో వెల్లడి


న్యూఢిల్లీ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ‘ఆర్నెల్ల ముచ్చట’గా మారింది. బడ్జెట్‌లో రెవెన్యూ మిగులు చూపగా.. వాస్తవంగా ఆర్నెల్లలోనే రెవెన్యూ లోటుకు చేరింది. ఇదీ తెలంగాణ ఆర్థిక స్థితి. 2021-22లో రెవెన్యూ మిగులు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొంది. కానీ, తొలి ఆరు నెలల్లోనే గణనీయమైన స్థాయిలో రెవెన్యూ లోటు పెరిగింది. 2021-22లో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కంపో్ట్ర లర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) వివరాలను వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.6743.49 కోట్లు రెవెన్యూ మిగులు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ అంచనాల్లో పేర్కొంది. అయితే, తొలి ఆరు నెలల్లోనే రూ.8058.47 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడింది. బడ్జెట్‌ అంచనాల కంటే ఇది 119.5 శాతం ఎక్కువ అని కాగ్‌ స్పష్టం చేసింది. మరోవైపు బడ్జెట్‌లో ప్రతిపాదించిన దానిలో 50 శాతానికిపైగా ప్రభుత్వం అప్పులు చేసేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.45,509.6 కోట్ల అప్పులు చేస్తామని బడ్జెట్‌లో పేర్కొన్న సర్కారు.. తొలి ఆర్నెల్లలోనే రూ.25,573.72 కోట్లు తీసుకుంది. ఇది బడ్జెట్‌లో ప్రతిపాదించినదానికి 56.19 శాతం.


30 శాతమే రెవెన్యూ ఆదాయం..

ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో ఖజానాకు కేవలం 30.15 శాతం ఆదాయమే సమకూరింది. మొత్తం రెవెన్యూ ఆదాయం రూ.1,76,126.93 కోట్లు ఉంటుదని బడ్జెట్‌ ప్రతిపాదించగా.. సెప్టెంబరు నాటికి రూ.53,109.63 కోట్ల ఆదాయం వచ్చింది. అందులో పన్నుల రూపంలో రూ.45,859.85 కోట్లు, పన్నేతర రెవెన్యూ రూపంలో రూ.2,436.03 కోట్లు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ల రూపంలో రూ.4,813.75 కోట్లు సమకూరినట్లు కాగ్‌ గణాంకాలు తెలిపాయి.


మూలధన వ్యయం 51.91 శాతం

సెప్టెంబరు వరకు రాష్ట్ర ప్రభుత్వం 36.11 శాతం రెవెన్యూ వ్యయం పూర్తి చేసింది. తొలి ఆరు నెలల్లో రూ.61,168.1 కోట్లు ఖర్చు చేసింది. రెవెన్యూ ఖాతా కింద రూ.26,926.49 కోట్లు, వడ్డీల చెల్లింపునకు రూ.8,801.55 కోట్లు, వేతనాలు రూ.13,921.48 కోట్లు, పెన్షన్లు రూ.6,453.99 కోట్లు, సబ్సిడీ కింద రూ.5,064.59 కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్‌ వివరించింది. కాగా సెప్టెంబరు నెలాఖరు వరకు రూ.15,077.59 కోట్లు మూలధన వ్యయం (51.91 శాతం) చేసింది. ఇక రంగాల వారీగా ఖర్చును పరిశీలిస్తే సామాజిక రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ఖర్చు చేసింది. ఈ రంగంలో తొలి ఆరు నెలల్లో రూ.26,661 కోట్లు (33.1 శాతం), సాధారణ రంగంలో రూ.20,479.09 కోట్లు (42.01 శాతం), ఆర్థిక రంగంలో రూ. 29,105.6 కోట్లు (42.11 శాతం) ఖర్చు చేసింది. 


తెలంగాణ టాప్‌!

మూలధన వ్యయంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని కేర్‌ రేటింగ్స్‌ నివేదిక వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో రూ.5.13 లక్షల కోట్ల మూలధన వ్యయంగా పేర్కొనగా.. తొలి ఆర్నెల్లలో కేవలం రూ.2.09 లక్షల కోట్లే ఖర్చు చేసిందని, ఇది 41 శాతమేనని తెలిపింది. ఇక  చిన్న రాష్ట్రమైన తెలంగాణ 51.91 శాతం మూలధన వ్యయంతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని వివరించింది. పెద్ద రాష్ట్రాలైన యూపీ, మహారాష్ట్ర అతి తక్కువగా ఖర్చు చేశాయని పేర్కొంది. 

Updated Date - 2021-11-26T08:16:16+05:30 IST