ఆత్మహత్య నుంచి జ్ఞానసిద్ధికి

ABN , First Publish Date - 2022-08-05T05:30:00+05:30 IST

చావుకు భయపడని జీవి ఏదీ ఉండదు. ప్రతి జీవీ ఎక్కువకాలం బతకాలనే అనుకుంటుంది. కానీ ఒక్కొక్క జీవికీ ఒక్కొక్క జీవితకాలం ఉంటుంది. కాబట్టి కనీసం ఆ జీవిత కాలం పరిపూర్ణంగా జీవించాలనే కోరుకుంటుంది. ఎందుకంటే..

ఆత్మహత్య నుంచి జ్ఞానసిద్ధికి

చావుకు భయపడని జీవి ఏదీ ఉండదు. ప్రతి జీవీ ఎక్కువకాలం బతకాలనే అనుకుంటుంది. కానీ ఒక్కొక్క జీవికీ ఒక్కొక్క జీవితకాలం ఉంటుంది. కాబట్టి కనీసం ఆ జీవిత కాలం పరిపూర్ణంగా జీవించాలనే కోరుకుంటుంది. ఎందుకంటే... జీవించడం జీవి ప్రాథమిక లక్షణం. బతకాలనే ఈ ఆకాంక్ష ఇతర జీవులకన్నా మనుషులకు మరీ ఎక్కువ. ధనం కూడబెట్టుకోవడం నేర్చాక... స్వార్థం, అసూయ, ద్వేషాలు వచ్చాక... ఇక చావడానికి ఏ మానవులూ సిద్ధపడరు. ‘మనిషికి జీవితం కన్నా విలువైనది ఏముంది? అందుకే జీవించాలి’ అనే ప్రతివారూ ఆశిస్తారు. అయితే ఆశయాల కోసం ప్రాణాలను పణంగా పెట్టేవారు లేకపోలేదు. అలాంటివారు త్యాగధనులు. కానీ కొందరు అనుకున్న అందలాలు ఎక్కలేకో, సమాజంలో బతకాలంటే సిగ్గుపడో, అసూయ, ద్వేషాల నుంచి బయటపడలేకో, చివరకు నిస్సహాయతను జయించలేకో... నిండు ప్రాణాలను చేతులారా తీసుకుంటారు. ఇలాంటి మరణాలను ఆత్మహత్యలు అంటాం.


అంటే... తమను తాము చంపుకోవడం. ఇలా ఆత్మహత్యలకు పూనుకున్న వారిలో కొందరు... ఆ చివరిక్షణంలో ఆలోచించి, ఏ సమస్య తమను ఇందాకా తెచ్చిందో గుర్తించి, దాన్ని పరిష్కరించుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇలా ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకొని, జీవితంలో అత్యున్నత శిఖరాలు అందుకున్నవారు ఎందరో ఉన్నారు. నిజానికి వారే జీవిత విజేతలు. తమనుతాము జయించుకున్న ధీరులు. ఆత్మహత్య జీవిత సమస్యలకు పరిష్కారం కాదనీ, అది  పిరికితనం అనీ, అనాలోచిత చర్య అనీ భావించి... పటిష్టమైన ధ్యానంతో అరహంతుడైన (జ్ఞానసిద్ధిని పొందిన) భిక్షువు కథ ఇది.


శ్రావస్తి నగర శివారు గ్రామంలో సర్వదాసు అనే గృహస్తు ఉండేవాడు. కొద్దిపాటి వ్యవసాయం చేస్తూ, కూలి చేసుకుంటూ జీవించేవాడు. పాముల్ని ఒడుపుగా పట్టేవాడు. ఎవరి ఇళ్ళలోకి పాములు వచ్చినా సర్వదాసును పిలిచేవారు. అతను పామును పట్టి, ఊరి చివర అడవిలో వదిలి వచ్చేవాడు. అతనికి పట్టుదల హెచ్చు. కానీ కొద్దిగా మంద బుద్ధి. ఇంకొద్దిగా బద్ధకం. దాంతో జీవితం అస్తవ్యస్థంగా సాగిపోతోంది.


అతను ఒక రోజు బుద్ధుని ధర్మ ప్రసంగం విన్నాడు. తానూ భిక్షువు కావాలనుకున్నాడు. అనుకున్నట్టే బౌద్ద సంఘంలో చేరాడు. భిక్షువయ్యాడు. భిక్షు జీవితం మరింత కష్టంగా తోచింది. చదువు, ధ్యానం, శిక్షణ చాలా భారంగా అనిపించాయి. అయినా పట్టు వదలలేదు. కొన్నాళ్ళు అలాగే గడిచింది. తనకన్నా వెనుక చేరినవారు, తనకన్నా చిన్నవారు ధ్యానంలో ముందుకు వెళ్ళిపోతున్నారు. మనో మలినాలను వదిలించుకొని, భిక్షువులు పొందే శ్రోతాపన్న, సకృతగామి, అనాగామి, అర్హంత దశల్లో ఏ ఒక్క దశనూ చేరుకోలేకపోయానని అతను బాధపడ్డాడు. ‘ఈ శిక్షణ ఇక నాకు వద్దు. నేను తిరిగి పాత జీవితానికే మళ్ళాలి’ అనుకున్నాడు. కానీ ‘అలా తిరిగి వెనక్కి పోవడం అమర్యాద, అవమానం. దానికన్నా చనిపోవడమే మేలు’ అని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. క్షణం కూడా ఆలోచించలేదు. అతనికి ఆ పక్కనే ఉన్న కుండ పెంకులో విష సర్పం కనిపించింది. వెంటనే దాన్ని పట్టుకున్నాడు. కానీ అది కాటు వేయకుండా జరజరా జారి, పొలాల్లోకి వెళ్ళిపోయింది. తన ఒడుపు తనకు ఇలా కూడా ఉపయోగపడలేదు అనుకున్నాడు. 


వెంటనే కుటీరంలోకి వెళ్ళాడు. పదునైన కత్తి తీసుకుని, గొంతు దగ్గర పెట్టుకున్నాడు. కానీ ఆ క్షణంలో... ‘ఈ ఆత్మహత్య అనే పనిని పట్టుదలగా చేయాలనుకున్నాను. ఇంతే పట్టుదల ధ్యానంలో చూపితే...’ అనుకున్నాడు.


అంతే! అతని చిత్తం విస్తరించింది. మనస్సు వికసించింది. ఆలోచన ఫలించింది. చిత్తం నుంచి మలినాలు తొలగిపోయాయి. చేతిలోని కత్తి అప్రయత్నంగా జారిపడింది. కనురెప్పలు మూతపడ్డాయి. ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ధ్యానానందాన్ని పొందాడు. ఇక, ఆపై ఎంతో సాధన చేశాడు. అతి తక్కువ సమయంలో... ఒకేసారి మూడు ఉన్నత దశలు దాటి, నాలుగో దశకు చేరుకున్నాడు. అర్హంతత్వాన్ని పొందాడు. అలా సర్పదాసు చనిపోవడానికి నిర్ణయించుకున్న సమయంలోనే... ఆలోచించడం వల్ల ఉన్నత ఫలాన్ని పొందాడు. 


ఈ విషయం ఇతర భిక్షువులు బుద్ధునితో చెప్పి ‘‘భగవాన్‌! ఇది సాధ్యమా?’’ అని అడిగారు. 

‘‘భిక్షువులారా! ఇది సాధ్యమే. సమ్యక్‌ జ్ఞానం ఉదయించగానే... పట్టుదల, పరిశ్రమ ఫలిస్తాయి. ప్రశాంతతను చేకూర్చుతాయి. ప్రశాంతచిత్తుడు అర్హంతత్వాన్ని పొందడానికి అరక్షణం చాలు’’ అన్నాడు బుద్ధుడు. సర్పదాసును మెచ్చుకున్నాడు. 


‘నిరాశ అంతుతెలియని లోయలో... అంధకారంలో పడేస్తుంది. సరైన దృక్పథం శిఖరాలపై నిలుపుతుంది. వెలుగులోకి నడిపిస్తుంది’ అనడానికి సర్పదాసు కథే రుజువు.


బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2022-08-05T05:30:00+05:30 IST