మా గవాక్షం నుండే!

ABN , First Publish Date - 2020-11-09T06:39:51+05:30 IST

లోకం గూటి నుండి వ్యాపకాల తలలు నిక్కపొడిచినప్పుడల్లా ఈ గవాక్షం నుంచే...

మా గవాక్షం నుండే!

లోకం గూటి నుండి 

వ్యాపకాల తలలు 

నిక్కపొడిచినప్పుడల్లా 

ఈ గవాక్షం నుంచే తిలకిస్తుంటాను 


కాలం రెక్కలు కట్టుకుని 

ఆశల ఆకాశపు అంచుల్లో 

స్వేచ్ఛగా విహరిస్తున్న 

మానవ అత్యుత్సాహాన్ని కూడా 

ఈ గవాక్షం నుంచే చూస్తుంటాను 


కళల లోగిలిలో 

రంగు రంగుల కథలు 

పురివిప్పినప్పుడు 

సందేశాలు సందేహం తీర్చే 

తీరును కూడా 

ఈ గవాక్షం నుంచే చూస్తూ 

చప్పట్లు చరుస్తుంటాను 


వివిధ కోణాల పరిమాణంలో 

మానవత పరిణమిల్లుతుంటే 

కొన్నింటికి తలుపులు వారగా వేస్తూ 

ఒక కంటితోనే గమనిస్తూ 

అక్కడే వాలిపోతుంటాను 


అవసరాల వేదికపై 

నాటక ప్రదర్శనలు 

ఉత్సాహంగా రంకెలేస్తున్నప్పుడు 

సమాజపు శిలకు దండవేసి 

కోర్కెలు కోరుతున్న వాళ్ళని 

ఈ గవాక్షం నుంచే 

కన్నార్పకుండా చూస్తుంటాను 


కడలి తీరం వెంబడి 

అలల ఉధృతిలో 

ఒడ్డుకు చేరుతున్న చేపల్ని 

ఒక బక్కచిక్కిన ప్రాణం 

కుప్పగా ఊడ్చి చిందులేస్తుంటే 

ఆకలి అలారం కొడుతున్నా పట్టించుకోక 

కడుపు బిగపట్టి మా గవాక్షం నుండే 

నేరుగా చూస్తుంటాను 


చీకటి అలుముకున్న వీధిలో 

బొచ్చె పట్టిన మనిషి 

కాలం దుప్పటి విదిలించి 

నేలపై తల వాల్చినాక 

మిణుగురు పురుగుల వెలుగులో 

బువ్వ తింటున్న దృశ్యాన్ని 

మా గవాక్షం నుంచే చూసాను 


పండుగల శోభతో ఊరు మొత్తం 

సింగారించుకుని ఊరేగుతుంటే 

వసంతాలు విరజిమ్మే 

ఆ సందడి మొత్తాన్ని కూడా 

ఈ గవాక్షం నుంచే చూసి తరించాను 


మా గవాక్షం ఊసల మధ్య నుంచి 

కొండ గుట్టల మధ్య నుండి 

మెల్లగా తొంగి చూస్తున్న సూర్యున్ని 

నేనే మొదట పట్టుకుంటాను 

తటాలున జారిపోయి 

పడమట కనుమల్లోకి జారిపోతుంటే 

ఈ గవాక్షం నుంచే..... 

మళ్ళీ ఎదురు చూస్తుంటాను 

నరెద్దుల రాజారెడ్డి

96660 16636

Updated Date - 2020-11-09T06:39:51+05:30 IST