Agnipath recruitment scheme: రక్షణ దళాల్లోకి ఇక నవ యువత

ABN , First Publish Date - 2022-06-14T21:39:38+05:30 IST

భారతీయ నవ యువతకు రక్షణ దళాలు స్వాగతం పలుకుతున్నాయి. నాలుగేళ్ళపాటు

Agnipath recruitment scheme: రక్షణ దళాల్లోకి ఇక నవ యువత

న్యూఢిల్లీ : భారతీయ నవ యువతకు రక్షణ దళాలు స్వాగతం పలుకుతున్నాయి. నాలుగేళ్ళపాటు సేవలందించడానికి అగ్నివీరులను నియమించే కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. అగ్నిపథ్ పేరుతో ప్రారంభమైన ఈ పథకంలో పదిహేడున్నరేళ్ళ నుంచి 21 సంవత్సరాల వయసుగలవారిని త్రివిధ దళాల్లో  అగ్నివీరులుగా నియమిస్తారు. 


అగ్నిపథ్ పథకాన్ని గతంలో ‘టూర్ ఆఫ్ డ్యూటీ’గా పిలిచేవారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతుల సమక్షంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. భద్రతకు సంబంధించిన  కేబినెట్ కమిటీ రెండేళ్ళపాటు విస్తృతంగా చర్చించిన తర్వాత ఈ పథకానికి ఆమోదం తెలిపింది. 


రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) త్రివిధ దళాల అధిపతులతో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్ ఓ పరివర్తక కార్యక్రమమని తెలిపారు. ఇది గొప్ప మార్పును, దేశ యువతకు ఉద్యోగావకాశాలను తీసుకొస్తుందన్నారు. ఈ పథకం వల్ల భారత దేశ భద్రత పటిష్టమవుతుందని తెలిపారు. అదే సమయంలో రక్షణ దళాలకు యూత్‌ఫుల్ ప్రొఫైల్ వస్తుందన్నారు. రక్షణ దళాలవైపు అందరూ ఎంతో గౌరవంతో చూస్తారన్నారు. యూనిఫాం ధరించాలని యువత కోరుకుంటారన్నారు. ప్రొఫైల్ యూత్‌ఫుల్‌గా ఉంటుందని తెలిపారు. ఆరోగ్యం, ఫిట్‌నెస్ లెవెల్ చాలా మెరుగ్గా ఉంటాయని చెప్పారు. అత్యున్నత స్థాయి నైపుణ్యంగల దళం అందుబాటులోకి వస్తుందన్నారు. అగ్నివీరులకు ఉత్తమ వేతనాలు లభిస్తాయని చెప్పారు. పదవీ విరమణ సమయంలో కూడా మంచి ప్యాకేజ్ లభిస్తుందని చెప్పారు. 


బహుముఖ సవాళ్లకు సిద్ధంగా...

భారత సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే మాట్లాడుతూ, సైన్యాన్ని భవిష్యత్తులో యుద్ధానికి సంసిద్ధంగా ఉండే దళంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అగ్నిపథ్ పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. సంపూర్ణ యుద్ధ క్షేత్రంలో బహుముఖ సవాళ్ళను ఎదిరించే సత్తాగల దళంగా సిద్ధం చేయడమే ఈ పథకం లక్ష్యమని చెప్పారు. ఐఐటీ, ఇతర సాంకేతిక విద్యా సంస్థల నుంచి అగ్నివీరులను ఎంపిక చేయనుండటం వల్ల సైన్యానికి సాంకేతిక సమర్థత పెరుగుతుందని చెప్పారు. 


ఎవరు అర్హులు?

పదిహేడున్న సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వయస్కులను అగ్నివీరులుగా ఎంపిక చేస్తారు. వీరికి నెలకు రూ.30,000 నుంచి రూ.40,000 వరకు జీతం ఇస్తారు. మహిళలు కూడా అర్హులే. సంబంధిత కేటగిరీలు/ట్రేడ్స్‌కు నియమితులయ్యేవారికి వర్తించే ఆరోగ్య సంబంధిత అర్హతా నిబంధనలు అగ్నివీరులకు కూడా వర్తిస్తాయి. 


అగ్నిపథ్ పథకంలో నియమితులైనవారందరినీ నాలుగేళ్ళ తర్వాత సర్వీస్ నుంచి విడుదల చేస్తారు. నాలుగేళ్ళ తర్వాత మరొక రౌండ్ స్క్రీనింగ్ నిర్వహించి వీరిలో 25 శాతం మందిని దీర్ఘకాలిక సేవల కోసం నియమిస్తారు. సమగ్ర, నిష్ఫాక్షిక, పారదర్శక, పటిష్ట మదింపు విధానంలో స్క్రీనింగ్, సెలక్షన్ జరుగుతాయని జనరల్ మనోజ్ పాండే చెప్పారు. దీనివల్ల దీర్ఘకాలిక సర్వీస్‌కు ఉత్తముల్లో అత్యుత్తములను నియమించుకోవడానికి వీలవుతుందన్నారు. ఇటువంటివారు సైన్యానికి మూలాధారంగా నిలుస్తారన్నారు. 


ఆన్‌‌లైన్‌లో నియామక ప్రక్రియ

త్రివిధ దళాల్లో అగ్నివీరుల నియామకాలు ఆన్‌లైన్ సెంట్రలైజ్డ్ సిస్టమ్‌లో జరుగుతాయి. విభాగాలవారీగా ప్రత్యేకంగా ఎంపిక కార్యక్రమాలు జరుగుతాయి. గుర్తింపు పొందిన సాంకేతిక విద్యా సంస్థలలో కేంపస్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. పారిశ్రామిక శిక్షణ సంస్థలు (ఐటీఐలు), నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్‌వర్క్ వంటివాటి ద్వారా ఈ నియామకాలు జరుగుతాయి. ‘ఆలిండియా, ఆల్ క్లాస్’ ప్రాతిపదికపై ఈ నియామకాలు జరుగుతాయి. సంబంధిత విభాగంలో అమలవుతున్న అర్హతా నిబంధనలు అగ్నివీరులకు కూడా వర్తిస్తాయి. ఉదాహరణకు జనరల్ డ్యూటీ సోల్జర్‌గా నియమితుడవాలంటే కనీసం పదో తరగతి ఉత్తీర్ణుడై ఉండాలి. 


పారితోషికం, వేతనాలు, పరిలబ్ధులు (Benefits) :

అగ్నివీరులకు ఆకర్షణీయమైన కస్టమైజ్డ్ నెలవారీ ప్యాకేజ్ ఉంటుంది. దాంతోపాటు ప్రమాద, ఇబ్బందుల సమయాల్లో త్రివిధ దళాలకు వర్తించే భత్యాలు కూడా వీరికి వర్తిస్తాయి. నాలుగేళ్ళ ఎంగేజ్‌మెంట్ పీరియడ్ పూర్తయిన తర్వాత అగ్నివీరులకు ఏకకాలిక (వన్‌టైమ్) ‘సేవా నిధి’ ప్యాకేజిని చెల్లిస్తారు. దీనిలో అగ్నివీరుల కంట్రిబ్యూషన్ (30 శాతం), దానిపై వచ్చే వడ్డీ కూడా కలిసి ఉంటాయి. ఈ అసలు + వడ్డీకి సమానమైన మొత్తాన్ని ప్రభుత్వం తన వాటాగా ఇస్తుంది. ఈ సేవా నిధికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. గ్రాట్యుయిటీ, పింఛను బెనిఫిట్స్ ఉండవు. అగ్నివీరులు తమ నాలుగేళ్ళ ఎంగేజ్‌మెంట్ పీరియడ్‌లో రూ.48 లక్షలు నాన్ కంట్రిబ్యూటరీ జీవిత బీమా కవరేజ్ పొందుతారు. 


మూడు నెలల్లో తొలి నియామక ప్రక్రియ ప్రారంభం

అగ్నివీరుల (Agniveers) తొలి నియామకాల ప్రక్రియ రానున్న మూడు నెలల్లో ప్రారంభం కానుందని రక్షణ శాఖ వెల్లడించింది. ప్రత్యేక నియామకాల కార్యక్రమాలను నిర్వహించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది మొదట 45 వేల మంది యువతను నియమిస్తారని తెలుస్తోంది. అగ్నివీరులుగా ఎంపికైనవారిని రెజిమెంట్, యూనిట్, సంస్థలో పోస్టింగ్ ఇస్తారు. సైనిక బలగాల మాదిరిగానే వీరికి ర్యాంకులు కూడా ఇస్తారు. మెరుగైన ప్రతిభ కనబరచినవారికి సేవా పతకాలు కూడా అందజేస్తారు. నాలుగేళ్ళ సర్వీస్ పూర్తయిన తర్వాత అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్ మంజూరు చేస్తారు. ఉపాధి అవకాశాలు పొందడానికి ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. బ్యాంకు నుంచి రూ.16.5 లక్షల వరకు రుణం పొందడానికి అవకాశం కల్పిస్తారు. 


Updated Date - 2022-06-14T21:39:38+05:30 IST